తమ్ముళ్లకు చుక్కెదురు..! | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లకు చుక్కెదురు..!

Published Tue, Aug 26 2014 1:00 AM

high court stay on voting of no-confidence motion on sridevi

సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(కేడీసీసీబీ) లో పాగా వేయాలని యత్నించి టీడీపీ నేతలు భంగపడ్డారు. డీసీసీబీ అధ్యక్షురాలు శ్రీదేవిని తప్పించేందుకు వారు వేసిన ఎత్తులు చిత్తయ్యాయి. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించే ప్రక్రియకు హైకోర్టులో చుక్కెదురైంది. మంగళవారం ఓటింగ్ నిర్వహించాల్సి ఉన్న తరుణంలో హైకోర్టు స్టే ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాక.. ఆ పార్టీ నాయకులు పదవుల కోసం అక్రమమార్గం పట్టారు.

 పైరవీలు చేసి.. బెదిరింపులకు పాల్పడి పదవులు చేజిక్కించుకోవడంలో దిట్టలుగా మారారు. ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సిన జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని దౌర్జన్యంగా కైవసం చేసుకున్నారు. అదే విధంగా కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాం చైర్మన్ పదవికీ ఎసరు పెట్టారు. డీసీసీబీలో 21 మంది డెరైక్టర్లు ఉండగా.. 2013లో జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ మద్దతుదారులే అత్యధికంగా ఎన్నికయ్యారు.

దీంతో డీసీసీబీ అధ్యక్షురాలిగా పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి రాష్ర్టంలో ప్రభుత్వాన్ని ఏర్పరచడంతో అక్రమ మార్గంలో డీసీసీబీ అధ్యక్షురాలు శ్రీదేవిని తప్పించి, తమ వారిని పీఠంపై కూర్చోబెట్టేందుకు తెలుగుదేశం నాయకులు రంగం సిద్ధం చేశారు.

ఇందుకు అనుగుణంగా 16 మంది డెరైక్టర్లు సంతకాలు చేసిన అవిశ్వాస తీర్మానాన్ని.. డెరైక్టర్లు చల్లా రఘునాథరెడ్డి, ప్రతాప్‌రెడ్డి ఈనెల 5న డీసీఓకు అందజేశారు. దీంతో ఈ నెల 26న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగే విధంగా డీసీఓ సుబ్బారావు ఆదేశాలు ఇచ్చారు. విషయాన్ని పసిగట్టిన కాంగ్రెస్ నేతలు..అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేందుకు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. వెల్దుర్తి మండలం ఎల్‌బండ తాండకు చెందిన స్వామినాయక్  ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది.

 స్వామినాయక్ వాదనతో హైకోర్టు ఏకీభవిస్తూ అవిశ్వాస తీర్మానం ఓటింగ్ నిర్వహించే ప్రక్రియను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. దీంతో తమ్ముళ్ల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. చైర్మన్ పదవి కోసం కొందరు డెరైక్టర్లకు లక్షల రూపాయలు ముట్టజెప్పినట్లు సమాచారం.  కోర్టు స్టే ఇవ్వటంతో డెరైక్టర్లకు ఇచ్చిన సొమ్ము తిరిగి ఎలా రాబట్టుకోవాలని జుట్టు పీక్కుంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement