Sakshi News home page

హైస్కూల్‌ విద్యార్థినులకు అస్వస్థత

Published Sat, Dec 1 2018 7:17 AM

High School Girls Illness With Bad Weather - Sakshi

విశాఖ, రావికమతం(చోడవరం): రావికమతం బాలికల హైస్కూల్‌ విద్యార్థినులు   పలువురు శుక్రవారం అస్వస్థతకు  గురయ్యారు. ఫుడ్‌పాయిజన్‌ కారణంగా వీరు అస్వస్థతకు గురయ్యారని అందరూ ఆందోళన చెందారు. అయితే  ఫుడ్‌పాయిజన్‌ వల్ల కాదని దుర్వాసన వల్లే ఇబ్బందికి గురయ్యారని  వైద్యాధికారి ధ్రువీకరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రావికమతం హైస్కూల్‌కు నవప్రయాస్‌ సంస్థ ద్వారా శుక్రవారం మధ్యాహ్నం భోజనాలు వచ్చాయి. పిల్లలంతా తిని తరగతి గదిల్లోకి వెళ్లాక  ఆరోతరగతికి చెందిన 10 మంది విద్యార్థినులు   ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు.

దీంతో ఆహారం కలుషితమై ఉంటుందని మిగిలిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. బాధిత విద్యార్థినులను హుటాహుటిన రావికమతం ఆస్పత్రికి   తరలించారు.   వైద్యసేవలందించడంతో వారు తేరుకున్నారు.  ఫుడ్‌ పాయిజన్‌ వల్ల కాదని,  దుర్వాసన వల్ల వచ్చిందని తేల్చారు. ఫుడ్‌ పాయిజన్‌ అయితే  విద్యార్థులందరూ అస్వస్థతకు గురై ఉండాలని వైద్యాధికారి విమలగిరి స్పష్టం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisement
Advertisement