హైవే రక్తసిక్తం | Sakshi
Sakshi News home page

హైవే రక్తసిక్తం

Published Thu, May 29 2014 1:02 AM

Highway bleed

  •      రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
  •      గాయపడి మృత్యువుతో పోరాడుతున్న ఇద్దరు డ్రైవర్లు
  •      మృతుల్లో ఒకరిది విజయనగరం, మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉంది
  •      కేబిన్‌లోనే చిక్కుకున్న డ్రైవర్
  •  తగరపువలస, న్యూస్‌లైన్ : జాతీయ రహదారి రక్త సిక్తమైంది. బాలాజీనగర్ వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు.

    మృతులలో ఒకరు విజయనగరానికి చెందిన ఇనపకుర్తి సత్యనారాయణ అలియాస్ చినబాబు (45).  మరో ఏభై ఏళ్ల వయసు గల మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికుల కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా చెన్నాపూర్ నుంచి ఖాళీ బీరు సీసాలతో శ్రీకాకుళం జిల్లా రణస్థలం వెళ్తున్న మినీ లారీకి వెనుక టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ శ్రీను (24) రోడ్డుపక్కన నిలిపి వీల్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.  

    విజయనగరంలోని స్వగ్రామానికి వెళ్లేందుకు సత్యనారాయణ ఇదే వ్యాన్‌లో ప్రయాణిస్తున్నాడు. డ్రైవర్ శ్రీనుకు సహాయం చేసేందుకు అతను కూడా దిగాడు. ద్వారపూడి నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఖాళీ మినీ లారీ ఆగి ఉన్న ఆ లారీని బలంగా ఢీకొట్టింది. అప్పుడే రెండు వాహనాల మధ్య నుంచి రోడ్డు దాటుతున్న ఏభై ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి తల నుజ్జునుజ్జవగా ముందు వాహనం డ్రైవర్ శ్రీను తలపై బలమైన గాయాలయ్యాయి. ఆ పక్కనే ఉన్న సత్యనారాయణకు గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు.

    వెనక లారీలో ఉన్న డ్రైవర్  రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయాడు. ప్రమాదం జరిగిన స్థలానికి నేషనల్ హైవే అంబులెన్స్, 108 సిబ్బంది చేరుకున్నప్పటికీ ఇరుక్కున్న డ్రైవర్‌ను తీయలేక ఫ్లూయిడ్స్ ఇచ్చి కాపాడుకొచ్చారు. అంతలో చుట్టుపక్కల మెకానిక్‌లు వచ్చి గొలుసులు, గునపాలతో కేబిన్ నుంచి నలభై నిమిషాల పాటు శ్రమించి డ్రైవర్‌ను వెలికి తీశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కల్యాణమండపం నిర్వాహకుడు శ్రీను సాహసించి చేతులతో లారీ అద్దాలను పగులగొట్టడంతో ఆయన చేతికి గాయమైంది.

    తీవ్ర గాయాలతో ఉన్న డ్రైవర్ వివరాలేవీ చెప్పలేకపోవడంతో ఇద్దరు డ్రైవర్లను హైవే అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. ఈ డ్రైవర్ కోమాలో ఉన్నట్టు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. ఆనందపురం ట్రాఫిక్ ఎస్‌ఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో భీమిలి ట్రాఫిక్ పోలీసులు క్రేన్ తీసుకువచ్చి వాహనాలను పక్కకు తీయించి ట్రాఫిక్‌ను నియంత్రించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
     
    అల్లుడికి ద్విచక్రవాహనం కొనడానికి వెళ్లి..

     మృతుడు సత్యనారాయణ విజయనగరంలో హొటల్ నిర్వహిస్తుంటాడు. ఈ నెల 2న కుమార్తెకు కత్తిపూడికి చెందిన యువకునితో పెళ్లి జరిపించాడు. అల్లుడికి లాంఛనాలలో భాగంగా అన్నవరంలో ద్విచక్రవాహనం కొనిచ్చేందుకు గత శనివారమే వెళ్లాడు. తిరుగుప్రయాణంలో మృత్యువాత పడటాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు.
     

Advertisement
Advertisement