రుణ మాఫీ పైనే ఆశ | Sakshi
Sakshi News home page

రుణ మాఫీ పైనే ఆశ

Published Sat, Jun 7 2014 12:05 AM

రుణ మాఫీ పైనే ఆశ - Sakshi

రైతు రుణ మాఫీ ... ఈ మాట వింటే చాలు... రైతుల్లో కొండంత ఆశ... భరోసా... టీడీపీ అధికారంలోకి రావడానికి కీలకమైన రుణ మాఫీ పథకం కోసం రైతులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అప్పులు తీర్చే మార్గం లేక, కొత్త అప్పులు వెతుక్కునే దారి లేక దిక్కులు చూస్తున్న రైతులకు బాబు హామీతో కష్టాలు తీరే మార్గం దొరికిందని సంతోషించారు. ఇక  సర్కారు ప్రకటన కోసమే రైతులు ఒళ్ళంతా కళ్లు చేసుకుని ఎదురు చూస్తున్నారు.
 
 సత్తెనపల్లి, న్యూస్‌లైన్: తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు సంబంధించి అన్ని రుణాలు మాఫీ చేస్తాం... డ్వాక్రా, చేనేత రుణాలు రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ప్రకటించడంతో ఆ పార్టీ పూర్తి మెజార్టీతో విజయం సాధించింది. చంద్రబాబు ప్రకటనపై భరోసాతో ఖరీఫ్ ప్రారంభమైనా రైతులు బ్యాంకుల వైపు చూడడం లేదు. ఏటా ఈ సమయానికి సగానికి పైగా రైతుల రుణాలు రెన్యూవల్ జరిగేవి. చంద్రబాబు హామీతో రైతులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.
 
 ఈ నెల 8వ తేదీ ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలి సంతకం రుణమాఫీపైనే అని బాబు ప్రకటన చేయడంతో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా అదే చర్చ సాగుతోంది. ఎప్పటినుంచి ఎప్పటివరకు రుణ మాఫీ వర్తించనుంది? ఎంత మొత్తం వరకు రుణ మాఫీ ఉంటుంది? ఎప్పట్లోగా ఇస్తారు? కొత్త రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందా... ఇలా రకరకాల ప్రశ్నలతో  ఎవరు గ్రామాలకు వెళ్లినా రైతులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బ్యాంకుల వారు ఎవరైనా రెన్యూవల్‌కు వస్తే మాత్రం తాము రెన్యూవల్ చేసేందుకు సిద్ధమంటున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా రైతులకు రూ.లక్ష లోపు రుణ మాఫీ అమలు చేస్తారనే ప్రచారం జరుగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా బేషరతుగా గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏవిధంగా అయితే రుణ మాఫీ చేశారో అదేవిధంగా పంట రుణాలు, బంగారు రుణాలు, తదితర అన్నిరకాల రుణాలను రద్దు చేసి అన్నదాతలను ఆదుకోవాలని కోరుతున్నారు. ఎన్నికల్లో ప్రకటించిన విధంగా ఆదుకోకపోతే రైతుల సత్తా ఏమిటో భవిష్యత్తులో చవిచూపిస్తామంటున్నారు. రుణమాఫీపై పలువురు రైతుల అభిప్రాయాలు వారి మాటల్లోనే....
 
 ప్రకటించినవిధంగా రుణ మాఫీ చేయాలి
 ఎన్నికల్లో ప్రకటించిన విధంగా చంద్రబాబు రుణ మాఫీ చేయాలి. లేకపోతే ప్రజలే మళ్లీ వచ్చే ఎన్నికల్లో తీర్పు ఇస్తారు. సంవత్సరం క్రితం ఇచ్చిన రుణాలు మాఫీ చేస్తే ఎప్పటి నుంచో అప్పుల ఊబిలో కూరుకు పోయిన రైతుల పరిస్థితి ఏమిటి? అన్ని రుణాలు మాఫీ చేస్తేనే రైతులకు మేలు జరుగుతుంది.
 -  జాష్టి వెంకయ్య, రైతు, సత్తెనపల్లి
 
 బంగారు రుణాలకు మాఫీ వర్తింప చేయాలి
 ఎన్నికల ముందు రైతుల రుణాలన్నీ మాఫీ అని చెప్పి, ఇప్పు డు కొందరికే మాఫీ వర్తిస్తుం దని చెప్పడం భావ్యం కాదు. పంట రుణాలు, బంగా రు రుణాలు తీసుకున్న రైతులందరికి మాఫీ వర్తింప చేయాలి.
 - గాడికొయ్య సుబ్బారెడ్డి, రైతు, పాకాలపాడు
 
 అన్ని బకాయిలకు మాఫీ వర్తింప చేయాలి
 రైతు రుణం ఎగగొట్టాలని ఏనాడు చూడడు. పంటలు సరిగా పండకపోతేనే రుణం చెల్లించేందుకు వెనుకడుగు వేస్తాడు. బకాయి దారులకు గతంలో వైఎస్.రాజశేఖరరెడ్డి ఇచ్చినట్లుగా మాఫీ వర్తింప చేస్తే అందరికి సమానంగా న్యాయం జరిగినట్లవుతుంది.
 - మూసాబోయిన శ్రీనివాసరావు,
 
 సీపీఐ పట్టణ కార్యదర్శి, సత్తెనపల్లి
 ఆంక్షలు లేని స్పష్టమైన ప్రకటన చేయాలి
 అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లుగా రైతులకున్న పంట రుణాలన్నింటిని మాఫీ చేస్తామని ప్రకటిస్తే తప్ప రైతులకు దిగులు తీరదు. దీనిలో సంవత్సరం, రెండేళ్ళు అని లేకుండా ఉన్న రుణాలన్ని మాఫీ చేయాలి.
  - కట్టా సాంబయ్య,
 వ్యవసాయ మార్కెట్‌కమిటి మాజీ ఛైర్మన్
 

Advertisement
Advertisement