‘స్వచ్ఛ’త ఏదీ? | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛ’త ఏదీ?

Published Mon, Oct 6 2014 1:45 AM

hospitals are not follows the swachh bharat programme

ఎక్కడికక్కడ చెత్తాచెదారం.. వాడేసిన సిరంజిలు, దూది, మందు బిళ్లలు.. వార్డుల్లో అపరిశుభ్ర వాతావరణం.. రోత పుట్టించే వంట గది పరిసరాలు.. పొంగిపొర్లే డ్రయినేజీలు..ఇదీ విశాఖలో ప్రభుత్వాస్పత్రుల దుస్థితి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ ఆస్పత్రుల్లో అమలుకాకపోవడం విశేషం.
 
సాక్షి, విశాఖపట్నం : కేజీహెచ్, ఘోషా, ప్రాంతీయ కంటి ఆస్పత్రులు ఉత్తరాంధ్ర ప్రజలకు పెద్దదిక్కు. ఇక్కడికి జిల్లాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం నుంచి వేలాది మంది రోగులు వస్తుంటారు. ఒక్క కేజీహెచ్‌లోనే 1045 పడకలుండగా, సుమారుగా వెయ్యి మంది రోగులు ఇన్‌పెషెంట్లుగా ఉంటున్నారు. నిత్యం ఓపీకి వచ్చే వారి సంఖ్య వందల్లోనే. ఇంత కీలక ఆస్పత్రిలో పరిశుభ్రత అందని ద్రాక్షగానే ఉంది.

ఆస్పత్రిలో ఎటుచూసినా పొంగిపొర్లే డ్రయినేజీలతో పరిస్థితి అధ్వానంగా ఉంటోంది. భావనగర్, రాజేంద్రప్రసాద్ వార్డు, పిల్లలు, ప్రసూతి వారు ్డతదితర మెడికల్ విభాగాల్లో డ్రయినేజీలు శిథిలమై మురుగునీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. అదీకాక ఆస్పత్రి ఆవరణలోనే పందులు, కుక్కలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. వాడేసిన సిరంజీలు, మందులు, ఇంజక్షన్లు, కాటన్‌కట్లు, ఉపయోగించిన దూది ఇలా ఎక్కడికక్కడ పడేస్తున్నారు. ఇవి ఎవరికీ గుచ్చుకున్నా పరిస్థితి విషమిస్తుంది. కానీ ఆస్పత్రి అధికారులు పారిశుద్ధ్యంపై కనీసం శ్రద్ధ వహించడం లేదు.
 
ఆ రెండు ఆస్పత్రులూ అంతే..
ఘోషాస్పత్రిలోనూ ఇదే దుస్థితి. ఒకపక్క పోర్టు కాలుష్యం మరోపక్క ఎక్కడికక్కడ చెత్తాచెదారంతో ఇక్కడకొచ్చే గర్భిణులు నరకయాతన  పడుతున్నారు. ప్రాంతీయ కంటి ఆస్పత్రి చుట్టూ భారీగా పెరిగిపోయిన పొదలతో పరిస్థితి భయానకంగా మారింది. వాస్తవానికి ఆస్పత్రుల్లో వాడిన మందులు, ఇంజక్షన్లను ఎప్పటికప్పుడు బయటకు తరలించి సురక్షిత పద్ధతుల్లో నాశనం చేయాలి. కానీ ఇది సక్రమంగా జరగడం లేదు. అటు రోగుల వార్డుల్లో భరించలేని దుర్గంధంతో అనేకమంది ఇబ్బందులకు గురవుతున్నారు.

ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం పెరిగిపోతున్నాయి. కొందరు రోగులు, వారి బంధువులు వార్డుల్లో వాసన భరించలేక వాంతులు చేసుకుంటున్నారు. ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో వార్డుల్లోకి రాత్రుళ్లు విష పురుగులు వస్తాయన్న భయంతో రోగులు గడుపుతున్నారు. మరోపక్క కేంద్రం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రభుత్వాస్పత్రుల్లో అమలుకావడం లేదు. మొదటిరోజు ఆస్పత్రి వర్గాలు పది నిమిషాలు చీపుర్లతో శుభ్రత కార్యక్రమం మొక్కుబడిగా చేపట్టి వదిలేశారంతే. అంతేకాదు ఈ ఆస్పత్రుల్లో రోగులకు ఆహారం తయారుచేసే వంటగదుల్లో కనీస శుభ్రత ఉండడం లేదు.
 
కాగితాల్లోనే ప్రతిపాదనలు
ఆస్పత్రులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా చేయాలి. కానీ ఇది జరగడం లేదు. కేజీహెచ్‌లో సరైన డ్రయినేజీ వ్యవస్థ లేకపోవడంతో దాన్ని ఆధునికీకరించేందుకు గతంతో అధికారులు రూ.5 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రయినేజీ ప్రతిపాదనలు తయారు చేశారు. దీనికి జీవీఎంసీ రూ.1కోటి ఇవ్వడానికి ముందుకువచ్చినా ఆచరణలోకి రాలేదు. ఘోషాస్పత్రిలో కనీసం మరుగుదొడ్లలో నీటి సదుపాయం సక్రమంగా లేక పరిసరాలు దయనీయంగా మారాయి. రూ.1.10 కోట్లతో ఆధునికీకరణ చేపట్టడానికి రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఇంత వరకు నిధులులేక అధ్వానంగా పరిస్థితులు మారాయి. ప్రాంతీయ కంటి ఆస్పత్రిని రూ.10 కోట్లతో ఆధునికీకరించాలని ప్రతిపాదనలు ఉన్నా ఆచరణలోకి రావడం లేదు.

Advertisement
Advertisement