ప్రైవేట్‌కు ఆస్పత్రులు | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌కు ఆస్పత్రులు

Published Sat, Jan 2 2016 12:28 AM

ప్రైవేట్‌కు ఆస్పత్రులు - Sakshi

నిర్వహణను అప్పగిస్తాం: సీఎం చంద్రబాబు
 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆస్పత్రుల నిర్వహణ కోసం త్వరలోనే ప్రత్యేక అడ్మినిస్ట్రేటర్లను నియమిస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా ప్రవేశపెట్టిన ఎన్‌టిఆర్ వైద్యపరీక్ష, 102 కాల్‌సెంటర్, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, టెలీ రేడియాలజీ సేవలను సీఎం చంద్రబాబు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో పారిశుధ్యం మొదలు ఇతర నిర్వహణ మొత్తం ఔట్‌సోర్సింగ్‌కు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ బాధ్యత కూడా ఔట్‌సోర్సింగ్‌కే ఇస్తామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో జనరిక్ మందుల షాపులను ఏర్పాటు చేస్తామన్నారు.

ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో, ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు ఉచిత వైద్య పరీక్షలు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 40 రకాల వైద్య పరీక్షలు, పీహెచ్‌సీల్లో 19 రకాల వైద్య పరీక్షలను పైసా ఖర్చు కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద అందిస్తామన్నారు. ఈ పథకంలో భాగంగా ప్రసవానంతరం తల్లి, బిడ్డను వారి ఇంటికి తీసుకెళ్లడానికి వీలుగా ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ను ప్రవేశపెట్టామన్నారు. అదేవిధంగా 131 వైద్య కేంద్రాల్లో టెలీ రేడియాలజీ సేవలను వినియోగంలోకి తీసుకువస్తామని, దాని ద్వారా రోగులు వైద్య పరీక్షల ఫలితాలను ఫోన్లలోనే తెలుసుకోవచ్చన్నారు.  ఎన్టీఆర్ వైద్య సేవా పథకంపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

 ఆరోగ్యాంధ్రప్రదేశే లక్ష్యం..
 రాష్ట్రంలో కొత్తగా 500 మంది డాక్టర్లు, 1,000 మంది నర్సుల నియామకాలు చేపడతామని చంద్రబాబు తెలిపారు. ఆసుపత్రుల్లో నిర్ణీత వేళల్లో పనిచేయని వైద్యులను ఇంటికి పంపిస్తామని  హెచ్చరించారు. వారి హాజరు కోసం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామని, ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది, వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అందుబాటులో ఉండాలన్నారు. లేనిపక్షంలో శాశ్వతంగా ఉద్యోగం వదిలి వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జపాన్, చైనా దేశాల్లో ఒక్క సంతానం చాలని కుటుంబ నియంత్రణకు పరిమితం కావడంతో ఇప్పుడు అక్కడంతా వృద్ధులే ఎక్కువ కనిపిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. మన వద్ద ఆ పరిస్థితి రాకుండా బిడ్డలే ఆస్తులుగా భావించి వారి ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని కోరారు. రోగులు కోరిన ప్రైవేట్ వైద్యుడితోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు చేయించే యోచనలో ఉన్నామని సీఎం అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఉన్న ఈ విధానాన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ప్రవేశపెడతామన్నారు.

 ఒక్క ఎకరా కూడా ఎండనివ్వం
 గోదావరి జిల్లాల్లో ఈ రబీ సీజన్‌లో ఒక్క ఎకరా కూడా ఎండనివ్వబోమని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రైతులకు హామీ ఇచ్చారు. బహిరంగసభ అనంతరం సీఎం ఏలూరులో విలేకరులతో మాట్లాడారు. ఒడిశా ప్రభుత్వాన్ని ఒప్పించి సీలేరు నుంచి అదనంగా జలాలు తీసుకువస్తామన్నారు. ‘అవసరమైతే ఇక్కడే పడుకుంటా.. కానీ ఒక్క ఎకరాకూడా ఎండనిచ్చేది లేదు’ అన్నారు. ‘జనవరి 1 తర్వాత నాట్లు వేస్తే నీరిచ్చేది లేదని జిల్లా కలెక్టర్ భాస్కర్ చెబుతున్నారు. రబీ లక్ష్యం నాలుగున్నర లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటికి లక్షన్నర ఎకరాల్లో కూడా నాట్లు పడలేదు.. మరి నీళ్లు ఎలా ఇస్తారు’ అని ‘సాక్షి’ ప్రతినిధి ప్రశ్నించగా.. సీఎం కాస్త తత్తరపడ్డారు. ఈ విషయమై పక్కనే ఉన్న కలెక్టర్‌ను ప్రశ్నించారు.రెండు లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయని కలెక్టర్ చెప్పారు. తర్వాత సీఎం మాట్లాడుతూ.. ‘రబీ పరిస్థితి దారుణంగానే ఉంది. ఈ సారి సాగు తగ్గే అవకాశముంది. వేసిన నాట్లకు మాత్రం కచ్చితంగా నీళ్లిస్తాం’ అని చెప్పారు.

Advertisement
Advertisement