భయం గుప్పెట్లో వీరవరం | Sakshi
Sakshi News home page

భయం గుప్పెట్లో వీరవరం

Published Thu, Oct 30 2014 2:05 AM

భయం గుప్పెట్లో వీరవరం - Sakshi

  • నేడు ఈస్ట్ డివిజన్ బంద్
  •  ప్రధాన కూడళ్లలో తనిఖీ
  •  ప్రభుత్వ కార్యాలయాల వద్ద బందోబస్తు
  • చింతపల్లి:  మావోయిస్టు ప్రభావిత ఈస్ట్‌డివిజన్‌లో భయానక వాతావరణ నెలకొంది. ఈ నెల 19న మావోయిస్టులు, గిరిజనులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక గిరిజనుడితో పాటు ముగ్గురు మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. దీనికి కారకులైన వారిని ప్రజాకోర్టులో శిక్షిస్తామంటూ దళసభ్యులు హెచ్చరించడంతో పాటు మావోయిస్టుల హత్యలకు నిరసనగా గురువారం బంద్‌కు పిలుపునివ్వడంతో చింతపల్లి మండలం వీరవరం, తూరుమామిడి, దిగవలసపల్లి, కోరుకొండ, జోహార్ ప్రాంతాల్లో భయాందోళనలు చోటుచేసుకున్నాయి.

    మావోయిస్టుల నుంచి గిరిజనులకు ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఎటువంటి విధ్వంసకర సంఘటనలకు పాల్పడతారోనని ఆ ప్రాంత గిరిజనులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు చెందిన చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు. మావోయిస్టులు ప్రతీకారదాడులకు పాల్పడవచ్చనే అనుమానంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.
     
    ఏ క్షణం ఏం జరుగుతుందోనని బలపం ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రధానకూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ కారణంగా మారుమూల ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నిలిపివేసే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
     

Advertisement
Advertisement