హవ్వ..ఇదేం తీరు...అమాత్యా?! | Sakshi
Sakshi News home page

హవ్వ..ఇదేం తీరు...అమాత్యా?!

Published Tue, Aug 25 2015 2:08 AM

హవ్వ..ఇదేం తీరు...అమాత్యా?! - Sakshi

మరమ్మతులకు ఎన్ని శిలాఫలకాలు వేస్తారు
ఆగస్టు 8న మరమ్మతు పనులకు కొత్తాస్పత్రిలో మంత్రి శిలాఫలకాలు
మళ్లీ సోమవారం పాత ఆస్పత్రిలో అదేమంటే ఇంజినీర్లు సరిగా  పనిచేయాలని హితబోధ

 
లబ్బీపేట: ఆర్భాటపు ప్రచారం మినహా ..అభివృద్ధి శూన్యమనే దాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తీరే నిదర్శనంగా మారుతోంది. ఆస్పత్రి రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులతో చేపట్టిన మరమ్మతు పనులను ఈ నెల 8న కొత్తాస్పత్రిలో ఆర్భాటంగా శిలాఫలకాలు వేసి ప్రారంభించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి , మళ్లీ అదే పనులకు సంబంధించి సోమవారం పాత ఆస్పత్రిలో శిలాఫలకాలను మంత్రి కామినేని నిస్సిగ్గుగా ఆవిష్కరించారు. ఆస్పత్రి అభివృద్ధికి తామేమి నిధులు ఇవ్వకపోయినా, ఆస్పత్రి ఆరోగ్యశ్రీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు ఏకంగా రెండు శిలాఫలకాలు ఆవిష్కరించి ఆర్భాటపు ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

 పరికరాల నిధులు..ప్యాచ్ వర్క్‌లుకా..?
 ప్రభుత్వాస్పత్రిలో 2008 సంవత్సరం నుంచి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించిన సేవలకుగాను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ నిధులు ప్రభుత్వం వద్ద ఉంచారు. వాటితో నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంది. ఒకవైపు ఆపరేషన్ థియేటర్‌లో సరైన పరికరాలు లేక ఇబ్బందులు ఎదురవడంతోపాటు, వ్యాధి నిర్థారణ పరీక్షలకు అవసరమైన అత్యాధునిక పరికరాలు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో తమ ప్రచారం కోసం... పరికరాలు కోసం ఉంచిన రూ. 4 కోట్లు నిధులను ప్యాచ్ వర్క్‌ల కోసం కేటాయించి,ఏకంగా రెండు ఆస్పత్రిల్లో రెండు శిలాఫలకాలు వేయించేసుకున్నారు. ఎక్కైడె నా కొత్త భవనాలు ప్రారంభోత్సవానికి, నిర్మాణాలను శిలాఫలకాలు వేస్తారు కానీ, ఈ మంత్రి రిపేర్లకు శిలాఫలకాలు వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నారు.

 స్థానిక నేతల కోసమేనా
 రెండు ప్రాంతాల్లో శిలా ఫలకాలు స్థానిక ఎమ్మెల్యేలు, అభివృద్ధి కమిటీ సభ్యుల పేర్లు కోసం తాపత్రయ పడి వేసినట్లు సమాచారం.  వారు వేసినప్పటికీ నిసిగ్గుగా వైద్య మంత్రి వచ్చి ప్రారంభించడమేమిటని పలువురు మండి పడుతున్నారు. రెండు ప్రాంతాల్లో కార్యక్రమాలు చేసేందుకు రూ.లక్షకు పైగా సొమ్ము దుర్వినియోగం అయినందనే వాదన వినిపిస్తుంది. ఇప్పటికైన ఎమ్మెల్యేలు, అభివృద్ధి కమిటీ సభ్యులు ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేయాలనే కానీ, ఆర్భాటపు ప్రచారానికి కాదని హితవు పలుకుతున్నారు. సిద్ధార్థ వైద్య కళాశాలలో కేంద్ర ప్రభుత్వం  పీఎం ఎస్‌ఎస్‌వై ద్వారా మంజూరైన నిధులకు సంబంధించి భవన నిర్మాణానికి సంబంధించి సత్వరమే చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆ నిధులు మళ్లీ వెనక్కివెళ్లే అవకాశం వుందని నిపుణులు సూచిస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement