హెచ్‌పీసీఎల్‌లో శిథిలాల తొలగింపు | Sakshi
Sakshi News home page

హెచ్‌పీసీఎల్‌లో శిథిలాల తొలగింపు

Published Mon, Aug 26 2013 3:33 AM

HPCL cleanup

మల్కాపురం, న్యూస్‌లైన్:  హెచ్‌పీసీఎల్‌లో కూలింగ్ టవర్ వద్ద జరిగిన సంఘటనకు సంబంధించిన శిథిలాల తొలగింపు ప్రక్రియ ఆదివారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా సంఘటన స్థలం వద్ద ఐదు సంప్పుల్లో ఉన్న వ్యర్థాలను క్రేన్, కాంట్రాక్ట్ కార్మికుల సాయంతో తొలగించారు. శుక్రవారం రాత్రి నుంచి శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.

శనివారం తొలగింపు కార్యక్రమంలో భాగంగా సుమారు ఐదు మృతదేహాలను వెలికితీయగా, ఆదివారం తొలగింపులో మరో రెండు మృతదేహాలను గుర్తించినట్టు సమాచారం. కానీ దీనిని సంస్థ యాజమాన్యం నిర్థారించడం లేదు. అటువంటిదేమి లేదని శనివారంతోనే శిథిలాల కింద ఉన్న మృతదేహాలను తొలగించినట్టు వివరించారు. ఆదివారం తొలగింపు చేపట్టిన కార్యక్రమంలో ఎటువంటి మృతదేహాలు లభ్యం కాలేదని, కేవలం సంప్‌లో ఉన్న వ్యర్థాలను తొలగించామన్నారు. సోమవారం కూడా తొలగింపు ప్రక్రియ కొనసాగే అవకాశముంది.
 
సంప్‌ల చుట్టూ చెక్కలు, ఇతర వ్యర్థాలు మండి భారీగా ఆ ప్రాంగణమంతా చెల్లాచెదురై వ్యర్థాలతో నిండిపోవడంతో ఆ వ్యర్థాలను తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తారు. అధికారుల సమక్షంలో శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు.
 
మరికొందరు గల్లంతు
 ఒడిశా ప్రాంతానికి చెందిన కొంత మంది కార్మికులు హెచ్‌పీసీఎల్‌లో జరిగిన సంఘటనలో గల్లంతైనట్లు తెలుస్తోంది. వీరంతా పారిశ్రామిక ప్రాంతంలో శ్రీహరిపురం, గుల్లలపాలెం, రామ్‌నగర్, ములగాడ ప్రాంతాలకు చెందిన వారని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం విధులకు వెళ్లిన వీరు ఇంత వరకు తిరిగి రాలేదని వారు పేర్కొంటున్నారు. కానీ వీరు ప్రమాదంలో గాయపడ్డారో, లేదా సంఘటన గుర్తించి భయంతో ఎక్కడికైనా పారిపోయారో అర్థం కావడం లేదని స్థానికులు తెలుపుతున్నారు. దీనిపై సంస్థ యాజమాన్యం వద్దగాని, పోలీసుల వద్దగాని సమాచారం లేదని వారు తెలుపుతున్నారు.
 

Advertisement
Advertisement