హుద్‌హుద్ పరిహారం విడుదల | Sakshi
Sakshi News home page

హుద్‌హుద్ పరిహారం విడుదల

Published Sun, Dec 7 2014 1:42 AM

Hud hud release compensation

విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలో ఇటీవల బీభత్సం సృష్టించిన హుద్‌హుద్ తుపాను ధాటికి కూలిన ఇళ్లకు సంబంధించి పరిహారం విడుదలైంది. మొత్తం 14,781 మంది బాధితులకు పరిహారం విడుదలైందని, వారి బ్యాంక్ ఖాతాలకు సొమ్ము జమ చేశామని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. తుపాను తీవ్రంగా ప్రభావం చూపిన మండలాల్లో పూర్తిగా కూలిపోయిన పక్కా ఇళ్లకు రూ.50 వేలు, కచ్చా ఇంటికి రూ. 25 వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. పాక్షికంగా ప్రభావం చూపిన ప్రాంతాల్లో కూలిన పక్కా ఇళ్లకు రూ. 6,300, కచ్చా ఇంటికి రూ.5వేలు,  జిల్లా అంతటా పాక్షికంగా దెబ్బతిన్న  కచ్చా, పక్కా ఇళ్లకు రూ.5వేల చొప్పున పరిహారాన్ని అందించారు. జిల్లాలో 13 పక్కా ఇళ్లు, 324 కచ్చా ఇళ్లు కూలిపోయినట్టు, పాక్షికంగా 7,237 కచ్చా ఇళ్లు  దెబ్బతిన్నట్టు గుర్తించారు.
 
 అలాగే తుపాను కారణంగా నేలమట్టమైన 6,349 గుడిసెలకు రూ. 5 వేల చొప్పున, కూలిపోయిన 20 వేల పశువుల పాక లకు రూ. రెండు వేల చొప్పున పరిహారం ప్రకటించారు. విజయనగరం డివిజన్‌లో పదివేల పాకలు, పార్వతీపురంలో పదివేల పాకలు కూలిపోయినట్టు అధికారులు గుర్తించారు. పార్వతీపురం డివిజన్ కన్నా విజయనగరం డివిజన్‌లో నష్టం ఎక్కువగా జరిగింది.   పార్వతీపురం డివిజన్‌లో 1,220 మంది   బాధితులుండగా, విజయనగరం డివిజన్‌లో 13,561 మంది బాధితులున్నట్టు గుర్తించారు. ఇక్కడ రూ.7.50 కోట్లు పరిహారం మంజూరుకాగా, పార్వతీపురం డివిజన్‌లో రూ. 73.85 లక్షలను  మంజూరు చేశారు.
 

Advertisement
Advertisement