భారీగా గంజాయి స్వాధీనం | Sakshi
Sakshi News home page

భారీగా గంజాయి స్వాధీనం

Published Wed, Jan 29 2014 2:46 AM

huge drugs caught by polices

 
 గొలుగొండ, హుకుంపేట, నర్సీపట్నం, అనకాపల్లి అర్బన్, రావికమతం, న్యూస్‌లైన్:
 జిల్లావ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి, మంగళవారాల్లో పోలీసులు నిర్వహించిన దాడుల్లో భారీఎత్తున గంజాయి పట్టుబడింది. మొత్తం 1329 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.
 
 400 కిలోలకు పైగా గంజాయి పట్టివేత
 గడ్డిలోడు ట్రక్కర్‌లో సుమారు 400 కిలోలకు పైగా తరలిస్తున్న గంజాయిని మంగళవారం సాయంత్రం భీమవరం చెక్‌పోస్టు వద్ద అటవీ శాఖ బేస్ క్యాంపు సిబ్బంది పట్టుకున్నారు. చింతపల్లి మండలం చౌడుపల్లి నుంచి గంజాయిని కె.డి.పేట మీదుగా కంఠారం తరలిస్తుండగా భీమవరం చెక్‌పోస్టు సిబ్బంది తనిఖీ నిర్వహించారు. గడ్డిలోడు కింద తవుడు బస్తాల మాటున గంజాయి మూటలున్నట్టు గుర్తించారు. వెంటనే రేంజర్ మహలక్ష్మినాయుడు, డీఆర్వో అచ్యుతరామారావు, కె.డి.పేట ఎస్‌ఐ గోపాలరావులకు సమాచారమందించారు. వెంటనే వీరు అక్కడికి చేరుకుని ట్రక్కర్‌ను స్వాధీనపరచుకున్నారు. నాతవరం మండలం జిల్లేడిపూడికి చెందిన డ్రయివర్ గాడి చిట్టిబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు బుధవారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
 
 100 కిలోల గంజాయి స్వాధీనం
 అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని పోలీసులు సోమవారం అర్ధరాత్రి హుకుంపేట వారపు సంతకు సమీపంలో పట్టుకున్నారు. పెదబయలు మండలం మారుమూల ప్రాంతం నుంచి  కెఎల్06క్యూ 2925 జిప్సీ వాహనంలో తరలిస్తుండగా హుకుంపేట ఎస్‌ఐ భరత్‌కుమార్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. నాలుగు బస్తాల్లో తెస్తున్న 100 కిలోల గంజాయితో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేరళకు చెందిన బిజు చాకో, టి.ఎఫ్.అనీష్‌లను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి వస్తోందన్న సమాచారంతో పోలీసులు సంత కూడలి వద్ద మాటువేసి ఉండటాన్ని గమనించిన స్మగ్లర్లు తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు.
 
 92 కిలోల గంజాయి స్వాధీనం
 అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు వద్ద ఆటోలో సుమారు రూ.2 లక్షల విలువైన 92 కిలోల గంజాయిని తరలించేందుకు ప్రయత్నించిన అయిదుగురిని మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సీఐ పి. శ్రీనివాసరావు తెలిపారు. సీఐ కథనం ప్రకారం పాడేరు మండలం మద్దిగరువు నుంచి 46 సంచుల్లో 92 కిలోల శీలావతి రకం గంజాయిని అయిదుగురు మంగళవారం ఆటో లో అనకాపల్లికి తరలించారు. అనంతరం కారులో వేరే ప్రాంతానికి తరలించేందుకు ప్రణాళిక రూపొందించారు. కాంప్లెక్స్ వద్ద గస్తీని గమనించిన స్మగ్లర్లు ఆటోను తుప్పల వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు చుట్టుముట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. పాడేరు మండలం కింతూరు గ్రామం సాంబే రాధారో (30), పాడేరు మండలం తొట్లగంది గ్రామానికి చెందిన సాంబే వెంకటేశ్వర్లు, పెదబయలు బనుగుబిల్లికి చెందిన దర్శింగ్ వెంకటేశ్వర్లు (21), చింతపల్లి పెండ్లిమామిడికి చెందిన శెట్టి మత్స్యరాజు (25), చీడికాడ మండలం దండి సురవరానికి చెందిన ఆటో డ్రయివర్ గొర్లి రాజేశ్వరరావులను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ తెలిపారు.
 
 187 కిలోల గంజాయి స్వాధీనం
 రావికమతం మండలం కొత్తకోట సమీపంలోని కన్నంపేట పొలాల్లో తరలిస్తున్న రూ.27 లక్షల విలువైన గంజాయిని కొత్తకోట పోలీసులు మంగళవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి ఇండికా కారును, భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కొత్తకోట సీఐ పి.వి.కె.వర్మ కథనం ప్రకారం కన్నంపేట, వమ్మవరం గ్రామాల మధ్య గంజాయి తరలుతున్నట్టు సమాచారం అందడంతో సోమవారం రాత్రి నుంచి కొత్తకోట ఎస్‌ఐ శిరీష్‌కుమార్, సిబ్బందితో గస్తీ నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజాము ప్రాంతంలో ఏపీ35 ఏసీ 4357 నంబరు ఇండికా కారు వేగంగా వస్తుండటంతో ఆపు చేశారు. కారులోని నలుగురు దిగి పారిపోతుండటంతో సిబ్బంది వెంబడించి ఇద్దరిని పట్టుకోగా, మరో ఇద్దరు పారిపోయారు. కారులో 187 కిలోల గంజాయి లభించింది. పట్టుబడిన ఇద్దరిలో ఒకరు తమిళనాడు ప్రాంతానికి చెందిన కొట్యాసా పాండే (21), మరొకరు రోలుగుంట మండలం బి.బి.పట్నం గ్రామానికి చెందిన శవాకుల రాముగా గుర్తించారు. వీరి నుంచి రూ.లక్షా 75 వేలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పరారైన ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు సీఐ వర్మ తెలిపారు.
 
 550 కిలోల గంజాయి స్వాధీనం
 రూ.55 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం ఏఎస్పీ విశాల్ గున్నీ మంగళవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రా, ఒడిశా సరిహద్దు లోని ఏజెన్సీ మండలాల నుంచి తమిళనాడు థైయినీ జిల్లాకు 550 కిలోల గంజాయి ప్యాకెట్లను లారీలో తరలిస్తున్నట్టు చెప్పారు. ఈ లారీని గొలుగొండ మండలం ఏటిగైరంపేట వద్ద తనిఖీలు నిర్వహిస్తూ పట్టుకున్నట్టు చెప్పారు. మంచినీరు ప్యాకెట్ల లోడుతో వస్తున్న లారీ అడుగు భాగంలో ప్యాకెట్లను ఉంచినట్టు వివరించారు. వీటి విలువ సుమారు రూ.55 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లా మత్తుకుట్టి, డ్రయివర్ వీరమృగన్, క్లీనర్ కార్తీకన్‌కరూర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు ఏఎస్పీ చెప్పారు. సమావేశంలో రూరల్ సీఐ తిరుమలరావు, ఎస్‌ఐ ప్రభాకరరెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
 
 
 

Advertisement
Advertisement