శ్రీశైలానికి భారీగా వరద | Sakshi
Sakshi News home page

శ్రీశైలానికి భారీగా వరద

Published Sat, Jul 21 2018 4:15 AM

Huge flood water to the Srisailam Dam - Sakshi

సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/హొసపేటె: నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తోండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు నిండటంతో భారీ ఎత్తున వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శుక్రవారం రాత్రి ఏడు గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 1.76 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది.. గురువారం సాయంత్రం 800.30 అడుగులుగా ఉన్న నీటి మట్టం శుక్రవారం సాయంత్రానికి 804.70 అడుగులకు చేరుకుంది. ఒక్క రోజులోనే 4.40 అడుగులు పెరగగా.. జలాశయంలోకి 2.2663 టీఎంసీల నీరు వచ్చి చేరగా  31.3963 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ఇది నిండాలంటే 185 టీఎంసీలు అవసరం. మహారాష్ట్ర, కర్ణాటకల సరిహద్దులో పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువన జలాశయాలు నిండిపోయాయి.

వరద ఇదే రీతిలో కనీసం 10 రోజులు కొనసాగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనాల నేపథ్యంలో మరో పది పదిహేను రోజుల్లో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు.. కృష్ణా ప్రధాన ఉపనది అయిన తుంగభద్రలో కూడా వరద రోజు రోజుకూ పెరుగుతోంది. తుంగభద్ర జలాశయంలోకి 70,416 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 94.09 టీఎంసీలకు చేరింది. దీంతో 22 గేట్లు రెండు అడుగుల మేర తెరిచి 63,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

శనివారానికి ఈ వరద జలాలు సుంకేసుల బ్యారేజీకి చేరనున్నాయి. సుంకేసుల బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 1.2 టీఎంసీలే. 24 గంటల్లో బ్యారేజీ నిండుతుంది. దాంతో ఆదివారం సుంకేసుల నుంచి తుంగభద్ర వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తారు. ఈ జలాలు కృష్ణా ప్రవాహంతో కలిసి శ్రీశైలాన్ని చేరనున్నాయి. కృష్ణా మరో ప్రధాన ఉప నది బీమా. గతేడాది బీమా నది నుంచి తెలుగు రాష్ట్రాలకు భారీఎత్తున జలాలు వచ్చాయి. బీమా నదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టులో ప్రస్తుతం 72.78 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇంకా 16,197 క్యూసెక్కులు ఆ ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. ఇది నిండాలంటే మరో 44 టీఎంసీలు అవసరం. ఉజ్జయిని నిండితే బీమా ప్రవాహం కూడా కృష్ణా నదిలో కలిసి శ్రీశైలాన్ని చేరుతాయి.

ఈ ఏడాది పుష్కలంగా నీటి లభ్యత?
శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 875 అడుగులకు చేరుకుంటే ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి.. దిగువకు అంటే నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తారు. సాగర్‌లో ప్రస్తుతం 133.37 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగార్‌ నిండాలంటే.. 178.67 టీఎంసీలు అవసరం. పులిచింతల ప్రాజెక్టు నిండాలంటే 43 టీఎంసీలు కావాలి. తెలుగు గంగ ప్రాజెక్టు కింద వెలిగోడు, సోమశిల, కండలేరు, బ్రహ్మంసాగర్‌.. గాలేరు–నగరి పథకం కింద గండికోట, పైడిపలెం, వామికొండ, హంద్రీ–నీవా పథకం కింద కృష్ణగిరి, జీడిపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్లు నిండాలంటే 215 టీఎంసీలు అవసరం. తెలంగాణలోని బీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ఏలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులతో కలిపి మొత్తం 675 టీఎంసీల నీటి కొరత ఉంది. కేసీ కెనాల్‌ ఆయకట్టుకు 40 టీఎంసీలు అవసరం. మొత్తం మీద 715 టీఎంసీలు అవసరం. గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని రీతిలో జూలై మూడో వారానికే కృష్ణమ్మ శ్రీశైలాన్ని చేరడం, తుంగభద్ర జలాశయం గేట్లు ఎత్తేసిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీల నీటి లభ్యత ఈ ఏడాది ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

గోదావరి జలాలు సముద్రంపాలు
గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీకి శుక్రవారం 3,85,922 క్యూసెక్కుల ప్రవాహం రాగా 8,400 క్యూసెక్కులను డెల్టాకు విడుదల చేసి మిగతా 3,78,922 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. దాంతో 24 గంటల్లోనే 32.73 టీఎంసీలు కడలి పాలైనట్లు అయ్యింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 302.597 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ప్రకాశం బ్యారేజీకి గోదావరి జలాలు మొత్తం 10,301 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా కాలువలకు విడుదల చేస్తున్నారు. అలాగే, వంశధార నదిలో వరద తగ్గుముఖం పట్టింది. గొట్టా బ్యారేజీకి 4325 క్యూసెక్కులు రాగా.. 1220 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేసి 3,105 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. నాగావళిలో వరద తగ్గడంతో తోటపల్లి బ్యారేజీ గేట్లును మూసివేశారు. నీటి నిల్వ గరిష్ఠ స్థాయికి చేరడంతో తోటపల్లి బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. రాష్ట్రంలో అన్నీ నదులు జలకళతో కళకళలాడుతుంటే వర్షాభావం వల్ల పెన్నా నది మాత్రం వెలవెలబోతోంది. 

Advertisement
Advertisement