ఖాకీ క్రౌర్యం! | Sakshi
Sakshi News home page

ఖాకీ క్రౌర్యం!

Published Wed, Mar 5 2014 3:08 AM

Hundreds of thousands of different political parties are working actively...

సాక్షి ప్రతినిధి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో పోలీసులు సృష్టిస్తోన్న అరాచకానికి ఇవి రెండు తార్కాణాలు మాత్రమే..! వివిధ రాజకీయ పార్టీల్లో క్రియాశీలకంగా పనిచేస్తోన్న వేలాది మందిని కౌన్సిలింగ్ పేరుతో పోలీసులు కుళ్లబొడుస్తున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తే.. ‘మాకేమీ తెలియదు. రౌడీషీటర్లు, సంఘవిద్రోహక శక్తులతో పాటు రాజకీయ పార్టీ నేతలను పిలిపించి.. కౌన్సిలింగ్ ఇవ్వండి.. వారిని కొట్టకపోతే మిమ్మిల్ని కొడతా’ అంటూ ఎస్పీ తమను బెదిరిస్తున్నారని సీఐ, ఎస్‌ఐలు దాటవేస్తున్నారు. ఇదే అంశంపై మంగళవారం ఎస్పీ సెంథిల్‌కుమార్‌ను ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి నిలదీస్తే.. ‘సంఘ విద్రోహక శక్తులు, రౌడీషీటర్లకు మాత్రమే కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించా.. రాజకీయ నాయకులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పలేదు’ అంటూ స్పష్టీకరించారు. వీటిని పరిశీలిస్తే.. నెపాన్ని ఒకరిపై ఒకరు నెట్టుకునే యత్నానికి పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. పోలీసుల వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన సాగుతోన్న విషయం విదితమే. సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు త్వరలో విడుదల కావడం ఖాయమన్న నేపథ్యంలో పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో తమ ప్రతాపాన్ని చూపుతున్నారు.  
 
 పంచాయతీ ఎన్నికల్లో కన్పించని హింస
 ఏడాది క్రితం సహకార ఎన్నికలు నిర్వహించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలను పూర్తి చేశారు. ఆ రెండు ఎన్నికల్లోనూ చెదరుముదురు ఘటనలు మినహా ఎక్కడా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న దాఖలాలు లేవు. ఒకప్పుడు ఫ్యాక్షన్, నక్సలిజం, రౌడీషీటర్లకు పెట్టింది పేరైన జిల్లాలో ఇప్పుడు వాటి ఆనవాళ్లు కన్పించడం లేదు. కారణం.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కొందరు పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు. వాటి వల్లే ఇప్పుడు జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొంది.
 
 ఇప్పటికిప్పుడు లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను నిర్వహించినా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకునే అవకాశాలు తక్కువని పోలీసు నిఘా వర్గాలే స్పష్టీకరిస్తున్నాయి. కానీ.. వాటిని పోలీసు ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఎన్నికలను స్వేచ్ఛగా.. ప్రశాంతంగా నిర్వహించడం పేరుతో దొరికిన వాళ్లను దొరికినట్లుగా కుళ్లబొడుస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 25,543 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయడమే అందుకు తార్కాణం. నాలుగు నెలల పరిధిలో జిల్లా వ్యాప్తంగా వెయ్యి మందికిపైగా రౌడీషీట్లను బనాయించడమే నిదర్శనం. ఒక్క అనంతపురం నగరం పరిధిలోని ఇటీవల కొత్తగా 63 మంది రౌడీషీట్లు తెరిచారు. ఇందులో 65 ఏళ్లు పైబడిన వృద్ధులు కూడా ఉండటం గమనార్హం.  
 
 ఎవరినీ ఖాతరు చేయని పోలీసులు
 ఎన్నికల నేపథ్యంలో ఇటీవల జిల్లాలో సీఐ, ఎస్‌ఐలను బదిలీ చేశారు. బదిలీపై జిల్లాకు వచ్చి కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఐ, ఎస్‌ఐల్లో అధికశాతం మందికి జిల్లా భౌగోళిక, సామాజిక, రాజకీయ పరిస్థితులపై అవగాహన కూడా లేదు. ఎన్నికల్లో ఎవరు ఇబ్బందులు సృష్టిస్తారు.. ఎవరు గుండాయిజం చేస్తారు.. ఎవరు రౌడీయిజం చేస్తారు అన్న అంశాన్ని కూడా గుర్తించలేకపోతున్నారు.
 ఈ క్రమంలోనే ఎస్పీ సెంథిల్‌కుమార్ జారీ చేసిన ఆదేశాల పేరుతో దొరికిన వాళ్లను దొరికినట్లుగా కుళ్లబొడుస్తున్నారనే అభిప్రాయం పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎవరైనా ఈ దమనకాండపై నిలదీస్తే.. ఆ నెపాన్ని ఎస్పీ సెంథిల్‌కుమార్‌పై సీఐ, ఎస్‌ఐలు నెట్టేస్తున్నారు. ఇదే అంశంపై ఎస్పీని ఆ ప్రజాప్రతినిధులు కలిస్తే.. ఆ నెపాన్ని కిందిస్థాయి అధికారులపై నెట్టేస్తున్నారు.
 
 మంగళవారం రాయదుర్గం నియోజకవర్గంలో అమాయకులు, వృద్ధులు, ప్రజాప్రతినిధులకు అన్యాయంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారంటూ పోలీసులను నిలదీసిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై అమానుషంగా ప్రవర్తించారు. పోలీసు దమనకాండకు మనస్థాపం చెందిన ఎమ్మెల్యే కాపు ఆత్మహత్యకు యత్నించారు. ఎన్నికల షెడ్యూలు వెలువడక ముందే ఖాకీ క్రౌర్యం ఇలా ఉంటే.. మున్ముందు పరిస్థితి ఇంకెలా ఉంటుందోననే ఆందోళనను ప్రజాస్వామ్యవాదులు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేయడానికి కూడా వందలాది మంది సిద్ధమవుతున్నారు.
 

Advertisement
Advertisement