అడ్డగోలుగా.. అత్యంత సులువుగా.. | Sakshi
Sakshi News home page

అడ్డగోలుగా.. అత్యంత సులువుగా..

Published Mon, Nov 20 2017 8:40 AM

Husband and wife cheating for unemployed youthi in west godavari

సాక్షి ప్రతినిధి, కాకినాడ: అడ్డగోలుగా.. అత్యంత సులువుగా.. ఎదుటివారి నెత్తిన టోపీ పెట్టి.. ఎలాగోలా డబ్బు సంపాదించడమే ధ్యేయంగా.. అమాయకులకు వల వేసి.. మోసగిస్తున్న మాయగాళ్లు జిల్లాలో ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నారు. భారీ జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని.. వ్యాపారాలు చేసుకొనేందుకు రుణాలు ఇప్పిస్తామని.. అనతికాలంలోనే నగదు రెట్టింపు చేస్తామని.. ఇలా రకరకాలుగా ఆశ చూపి జనానికి టోకరా వేస్తున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. నిరుద్యోగం కారణంగా ఏదో ఒక ఉపాధి వెతుక్కోవాలన్న ప్రయత్నంలో పలువురు ఈ మాయగాళ్ల చేతిలో చిక్కి మోసపోతున్నారు. అంతా అయిపోయాక వారి అసలు రూపం తెలియడంతో అమాయక ప్రజలు లబోదిబోమంటున్నారు. తెలిసో తెలియకో ప్రజలు మోసపోతుంటే.. నిందితులను పట్టుకోవల్సిన నిఘా వ్యవస్థ నిద్రావస్థలో జోగుతోంది. ఎక్కడేం జరుగుతోందో పసిగట్టే పరిస్థితి కనిపించడం లేదు. వైఫల్యమెవరిదైనా అమాయక ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.

ఎన్నో సంఘటనలు
 విద్యుత్‌ షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టులు ఇప్పిస్తామంటూ ఆమధ్య కొందరు పెద్ద ఎత్తున వసూళ్లు చేశారు. రాజకీయ  నాయకుల అండదండలున్న వ్యక్తులే ఈ వసూళ్లకు బరితెగించారు. ఉద్యోగం వస్తే తమవల్లనే వచ్చిందని.. రాకపోతే మిస్సయిందని చెప్పి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి.

 జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల కోసం రూ.లక్షలు గుంజుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి.

► సహకార శాఖ పరిధిలోకి వచ్చే పోస్టులు ఇప్పిస్తామని కూడా కొందరు బయలుదేరారు. లక్షల్లో వసూళ్లకు తెగబడ్డారు. పత్రికల్లో వార్తలు వచ్చాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

► పశు సంవర్ధక శాఖలో ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి గతంలో కొందరు బేరం పెట్టారు. అప్పట్లో పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారాయన్న ఆరోపణలు వచ్చాయి.

► ఇటీవల హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అనంతపురం జిల్లా కాసాపురానికి చెందిన మాజీ హోంగార్డు హరిజన గోవర్ధన్‌ జిల్లాకు చెందిన ముగ్గురు నిరుద్యోగుల నుంచి రూ.3.43 లక్షలు వసూలు చేసి మోసగించాడు.

► రాజశేఖర్‌నాయుడు, పడాల రాజేశ్‌నాయుడు అనే ఇద్దరు కలిసి రాజమహేంద్రవరం ఏవీ అప్పారావు రోడ్డులో అప్లూయన్స్‌ సొల్యూషన్స్‌ అనే కన్సల్టెన్సీ ఏర్పాటు చేశారు. డబ్బులిస్తే షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతామని, కమిషన్‌తో పాటు అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. ఇలా రూ.56 లక్షల వరకూ వసూలు చేసి కార్యాలయం మూసేశారు.

ఇంద్రపాలెంలో భార్యాభర్తల మాయాజాలం
ఏడాది క్రితం ఇంద్రపాలెం శ్రీనివాసనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్న భార్యాభర్తలు నల్లా ప్రసాద్, నల్లా శైలజలు.. తాము జేఎన్‌టీయూ ఉద్యోగులమని, అందులో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రూ.కోటి వరకూ గుంజి టోకరా వేశారు. తమ జీతం రూ.80 వేలు అని, రిజిస్ట్రార్‌ తమకు బాగా కావల్సిన వ్యక్తి అని చెప్పగానే పలువురు నిరుద్యోగులు ట్రాప్‌లో పడిపోయారు. కనీసం వాకబు కూడా చేయకుండానే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో అడిగినంతా సమర్పించుకున్నారు. అక్కడితో ఆగని ఆ వంచక దంపతులు రుణాలిప్పిస్తామని కూడా నమ్మబలికారు. బ్యాంకు అధికారులు, మత్స్యశాఖ అధికారులు బాగా తెలుసని, వేటకు వెళ్లే బోట్ల నిర్మాణానికి వీలుగా రూ.1.30 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల వరకూ రుణం ఇస్తారని చెప్పగానే.. పలువురు వారి చేతిలో లక్షలాది రూపాయలు పెట్టేశారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో ఆరా తీయకుండానే అప్పోసొప్పో చేసి పెద్ద ఎత్తున డబ్బులిచ్చేశారు. జేఎన్‌టీయూలో ఉద్యోగం వస్తుందన్న ఆశతో కరపకు చెందిన యువకుడు నాగేంద్ర రూ.1.60 లక్షలు, జి.కృష్ణదీపక్‌ రూ.17 లక్షలు, ఎం.ప్రభాకర్‌ రూ.1.50 లక్షలు, కె.రాజేష్‌ రూ.1.50 లక్షలు, ఎ.సంజీవ్‌ రూ.70 వేలు, కె.సురేష్‌కుమార్‌ రూ.1.50 లక్షలు, పి.నాగేంద్రకుమార్‌ రూ.80 వేలు, శివదుర్గ రూ.80 వేలు.. ఇలా అనేకమంది అడిగినంతా ఇచ్చి మోసపోయారు.

దురాశతో దుఃఖం
నిబంధనల ప్రకారం ఉద్యోగాలో, ఉపాధో పొందడం వేరు. అలాకాకుండా కొంతమంది ఏదో ఒకవిధంగా అడ్డదారిలో ఉద్యోగాలు, సొమ్ములు సంపాదించాలన్న దురాశతో ఇటువంటి మాయగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలుకుతున్న వ్యక్తులకు అంత సీన్‌ ఉందా, ప్రభుత్వ ఉద్యోగాలిప్పించే హోదా, పలుకుడి ఉన్నాయా,  రుణాలు ఇప్పించే స్థాయి ఉందా అనే అంశాలను పరిశీలించకుండానే నాలుగు మాయమాటలు చెప్పగానే నమ్మి రూ.లక్షలు ముట్టజెబుతున్నారు. నియామకాల ప్రకటనలు లేకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారనే కనీస ఆలోచన కూడా చేయకుండా పెద్ద ఎత్తున సొమ్ములిచ్చి మోసపోతున్నారు. పోలీసు నిఘా వ్యవస్థ సక్రమంగా పనిచేసి ఉంటే ఆదిలోనే ఇటువంటి మోసగాళ్ల భరతం పట్టడం సాధ్యమై ఉండేది. ఆవిధంగా జరగకపోవడంతో అమాయకులు బలైపోతున్నారు.

కొడుక్కి ఉద్యోగం అంటే ఆశ పడ్డాను
అతను రోజుకో కారులో తిరుగుతూ యువకులను తిప్పుకొనేవాడు. అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తున్నానని చెప్పాడు. నా కొడుక్కి ఉద్యోగం ఇప్పిస్తానంటే ఆశ పడ్డాను. మా శ్రీనివాసనగర్‌లోనే చాలామంది ఇచ్చారని తెలిసి, ఉద్యోగం ఇప్పిస్తానంటే రూ.90 వేలు అప్పు చేసి ఇచ్చాను. ఇప్పుడేం చేయాలో తెలియడంలేదు.
– పెండ్యాల నూకరాజు, శ్రీనివాసనగర్, ఇంద్రపాలెం

రూ.1.30 కోట్ల రుణం అన్నాడు
బోటు కొనుగోలుకు రూ.1.30 కోట్ల బ్యాంకు రుణం ఇప్పిస్తానని నల్లా ప్రసాద్‌ అనే వ్యక్తి చెప్పాడు. బ్యాంకు అధికారులకు రూ.3 లక్షలు ఇవ్వాలన్నాడు. మోసం చేస్తున్నాడని తెలియక వస్తువులు, భూమి తనఖా పెట్టి రూ.3 లక్షలు ఇచ్చాను. రాత్రికి రాత్రే జెండా ఎత్తేశాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియడంలేదు.
– సూరంపూడి లోవరాజు, శ్రీనివాసనగర్, ఇంద్రపాలెం

Advertisement

తప్పక చదవండి

Advertisement