ప్రేమపుస్తకం..నెత్తుటి సంతకం | Sakshi
Sakshi News home page

ప్రేమపుస్తకం..నెత్తుటి సంతకం

Published Sat, Jan 11 2014 3:05 AM

ప్రేమపుస్తకం..నెత్తుటి సంతకం - Sakshi

వారిద్దరు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కడదాకా కలిసే సాగాలని బాస చేసుకున్నారు. పెద్దలను ఒప్పించి మూడుముళ్లు.. ఏడడుగుల బంధంతో ఏకమయ్యారు. కొంతకాలం సజావుగా సాగిన వారి కాపురంలో కలతలు మొదలయ్యాయి. భర్తలో అనుమానపు చిచ్చు రగిలి చివరకు భార్య ప్రాణాలను బలిగొన్నది. ఇద్దరు పసివాళ్లను అనాథలను చేసింది. తాను దగ్గర లేకపోవడంతోపాటు చెప్పుడు మాటలు నెత్తికెక్కి భార్యను దారుణంగా కొట్టిచంపాడు ఆ కిరాతకుడు.
 
 సారంగాపూర్, న్యూస్‌లైన్: సారంగాపూర్ మండలం అర్పపల్లి గ్రామానికి చెందిన ఎండబెట్ల విజయ్(28), గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామానికి చెందిన బ్లెస్సీ(26) జగిత్యాలలో పక్కపక్కనే ఉన్న దుకాణాల్లో టైల రింగ్ నేర్చుకునేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. రెండు కుటుంబాల పెద్దలను ఒప్పించి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు.
 
 కొంతకాలం పాటు దంపతులిద్దరు ఎంతో అన్యోన్యంగా మెలిగారు. పెళ్లయిన తర్వాత రెండేళ్లకు విజయ్ ఉపాధి నిమిత్తం ఏడాదిన్నర పాటు ఇరాక్ వెళ్లాడు. ఇంటి దగ్గర ఉన్న తల్లి, భార్యతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండేవాడు. ఈ క్రమంలో తల్లితోపాటు మరికొందరు బ్లెస్సీపై లేనిపోని విషయాలు అతనికి ఫోన్‌లో చెప్పేవారు. మనస్తాపానికి గురైన విజయ్ మానసిక స్థితిలో మార్పు రావడంతో కంపెనీ అతడిని ఇంటికి పంపింది. కొంతకాలం పాటు ఇంటివద్దే ఉన్న విజయ్ తిరిగి ఇరాక్ వెళ్లి మళ్లీ అదే కంపెనీలో చేరాడు. అప్పటికీ అతడి మానసకస్థితిలో మార్పు రాకపోవడంతో కంపెనీ తిరిగి ఇంటికి పంపించింది. అప్పటినుంచి బ్లెస్సీని విజయ్ ఏదో రకంగా హింసిస్తుండేవాడు.


 
 ప్రతిరోజు తీవ్రంగా కొట్టేవాడు. గాయాలైన ఆమెకు స్థానిక ఆర్‌ఎంపీల వద్ద మందులు ఇప్పించేవాడు. వారం రోజుల క్రితం విజయ్ కొట్టిన దెబ్బలకు బ్లెస్సీ శరీరమంతా గాయాలు కావడంతో  సమీప బంధువులు జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయించారు. నాలుగు రోజుల క్రితం ఆసుపత్రి నుంచి వచ్చిన ఆమెను ఇంట్లో నిర్భందించినంత పనిచేసి కర్రలతో చితకబాదుతున్నాడు. బ్లెస్సీతో దిగిన ఫొటోలను, ఆమెకు సంబంధించిన సర్టిఫికెట్లను ఇంటిముందు కుప్పగా పోసి దహనం చేసినట్లు చుట్టుపక్కలవారు తెలిపారు.

బ్లెస్సీని కొడుతున్న సమయంలో ఎవరైనా అడ్డొస్తే వారితో సంబంధం అంటగట్టి విచిత్రంగా ప్రవర్తించేవాడు. మహిళలు అడ్డుగా వస్తే వారిని దుర్భాషలాడి అవమానపరిచేవాడు. దీంతో బ్లెస్సీని విజయ్ కొడుతుంటే అడ్డుకునేందుకు స్థానికులు జంకేవారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బ్లెస్సీతో విజయ్ గొడవపడి చితకబాదాడు.

తర్వాత కర్రలతో తీవ్రంగా కొట్టడంతో ఆమె స్పృహతప్పి కుప్పకూలిపోయింది. బ్లెస్సీ చనిపోయేంత వరకు కొట్టి, ప్రాణంపోయిందని నిర్ధారించుకున్న తరువాత జుట్టు పట్టుకొని బయటకు ఈడ్చుకొచ్చాడు. కర్ర చేతిలో పట్టుకొని శవం పక్కన కూర్చుండిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని విజయ్‌ను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, బ్లెస్సీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించామని ఎస్సై వినయ్ తెలిపారు. విజయ్ మూడు రోజులుగా సైకోగా ప్రవర్తిస్తూ బ్లెస్సీని తీవ్రంగా హింసించి చంపినట్టు గ్రామస్తులు వివరించారు.
 
 పాపం.. పసివాళ్లు..
 విజయ్-బ్లెస్సీలకు ఇద్దరు కుమార్తెలు అభీషా(5), వర్షిణి(3) ఉన్నారు. తమ కళ్లముందే తల్లిని తండ్రి చావగొడుతుంటే చూస్తుండడం తప్ప ఏమీ చేయలేని పసితనం వారిది. ఇద్దరూ సంఘటన జరిగిన తరువాత నుంచి తల్లి మృతదేహం చుట్టు తిరుగుతూ.. అమ్మకు ఏమైందంటూ అడుగడం అక్కడున్న వారిని కంటతడిపెట్టించింది. అభం శుభం తెలియని చిన్నారులు తండ్రిని చూస్తే మాత్రం హడలిపోయారు. ప్రతిరోజు నాన్న తీరును చూసిన భయంతో వణికిపోతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లి ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లడం.. తండ్రిని పోలీసులు పట్టుకెళ్లడంతో చిన్నారులు దిక్కులేనివారయ్యారు. విజయ్ తండ్రి గతంలో గ్రామంలో హత్యకు గురికాగా, తల్లి ఉంది. కుమారుడికి లేనిపోని విషయాలు చెప్పి కోడలు మృతికి ఆమె కూడా కారకురాలైంది.

 
 భర్త, అత్త కొట్టిచంపారు..
 బ్లెస్సీని భర్త విజయ్, అత్త అమృతమ్మ అదనపు కట్నం కోసం కొట్టి చంపారని మృతురాలి తండ్రి బొల్లం నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివాహ సమయంలో రూ.90వేలు కట్నంగా ఇచ్చామని, ఆ తరువాత మరో రూ.30వేలు ముట్టజెప్పామని తెలిపారు. ఇంకా రూ.30వేలు కావాలంటూ బ్లెస్సీని వేధింపులకు గురిచేసి చంపారంటూ కన్నీటిపర్యంతమయ్యాడు.
 

Advertisement
Advertisement