హెచ్‌పీఎస్ @:90 | Sakshi
Sakshi News home page

హెచ్‌పీఎస్ @:90

Published Thu, Nov 7 2013 1:53 PM

హెచ్‌పీఎస్ @:90 - Sakshi

 హైదరాబాద్ పబ్లిక్ స్కూల్... నగరంతో తొమ్మిది దశాబ్దాల అనుబంధం. ఎందరో ప్రముఖులకు మార్గనిర్దేశనం చేసిన విద్యానిలయం. ఇరుకు గదుల్లో... విద్యను వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలకు భిన్నంగా  ప్రత్యేకత చాటుకుంది. సువిశాల ప్రాంగణంలో... అత్యాధునిక వసతులతో... నాణ్యమైన విద్యను అందిస్తూ దేశంలోనే విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. నేడు హెచ్‌పీఎస్ 90 వసంతాల ఉత్సవం జరుపుకొంటున్న సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
 
దేశంలోని 20 ప్రసిద్ధ పాఠశాలల్లో బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటని ప్రఖ్యాత ‘వరల్డ్ మ్యాగజైన్’ గుర్తించింది. 140 ఎకరాల సువిశాల ప్రాంగణం... పెద్ద క్రీడా మైదానం... ఎటు చూసినా పచ్చందం... అత్యాధునిక వసతులతో చూడగానే ముచ్చటగొలుపుతుంది హెచ్‌పీఎస్. ఉన్నత వర్గాల వారి కోసం ముఖ్యంగా నవాబులు, జాగీర్‌దార్లు, బ్రిటిష్ అధికారుల పిల్లల చదువుల కోసం 1923లో ‘జాగీర్‌దార్ స్కూల్’ పేరుతో ప్రారంభమైందీ పాఠశాల. అప్పటి జాగీర్‌దార్లలో ఒకరైనా సర్ వికార్-ఉల్-ఉమా బహుల్‌ఖానగూడ పేరుతో ఉన్న ప్రస్తుత బేగంపేటలో దీర్ఘకాల లీజ్ ప్రాతిపదికన పాఠశాలకు స్థలాన్ని కేటాయించారు. బ్రిటిష్ విద్యావేత్త షాక్రాస్ మొదటి ప్రిన్సిపాల్‌గా... ముగ్గురు విద్యార్థులతో పాఠశాల మొదటి బ్యాచ్ ప్రారంభమైంది.

 పబ్లిక్ స్కూల్‌గా...
 1950లో ప్రభుత్వం జమిందారీ వ్యవస్థను రద్దు చేయడంతో... అప్పటి వరకు కేవలం ప్రముఖుల పిల్లలకే పరిమితమైన జాగీర్‌దార్ స్కూల్ పబ్లిక్ స్కూల్‌గా రూపాంతరం చెందింది. నాటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధకృష్ణన్ మొదటి అధ్యక్షుడిగా హెచ్‌పీఎస్ సొసైటీ ఏర్పాటైంది. బాలులకు మాత్రమే పరిమితమైన హెచ్‌పీఎస్... 1988 నుంచి కోఎడ్యుకేషన్ విద్యాలయంగా మారిపోయింది.
 
 ఒకరా... ఇద్దరా..!
 ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన ఎందరో నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. రాజకీయ నాయకులుగా, సినీతారలుగా, బడా వ్యాపారవేత్తలుగా ఉన్నారు. వారిలో కొందరు...   ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి పళ్లం రాజు, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, స్టార్ హీరోలు నాగార్జున, వెంకటేష్, రామ్‌చరణ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, లండన్‌లో కోబ్రా బీర్ వ్యవస్థాపక చైర్మన్ కరణ్‌బిల్లి మోరియా, ఐ2 టెక్నాలజీస్ సీఈఓ సంజీవ్‌సిద్ధు, అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ, గాయకుడు తలజ్ అజీజ్, ఎంటీవీ వీజే నిఖిల్ చిన్నప్ప, క్రికెట్ వ్యాఖ్యాత హర్షభోగ్లే, ఫ్రాన్స్‌లో భారత మాజీ రాయబారి వీర్‌మొహిసిన్ సయిద్, కెనడాలో స్థిరపడ్డ ఫెయిర్‌ఫాక్స్ చైర్మన్ రాజ్‌వత్సా, ఇటీవల వార్తల్లో నిలిచిన బిజినెస్ మ్యాన్  ప్రేమ్‌వత్సా.
 
 ప్రముఖులు ఎంతో మంది విద్యాభ్యాసం చేసిన హెచ్‌పీఎస్‌లో చదువుకోవడం చాలా ఆనందంగా ఉంది. దశాబ్ధాలు గడిచినా పాఠశాల ఖ్యాతి తరగకపోవడం విశేషం. ఇప్పటికీ నగరంలోని తల్లిదండ్రులు తమ పిల్లలకు హెచ్‌పీఎస్‌లో సీటు సంపాదించడానికే తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఇది పాఠశాలకే గర్వకారణం.     - మర్రి ఆదిత్యారెడ్డి, పూర్వ విద్యార్థి, హెచ్‌పీఎస్ సొసైటీ సభ్యుడు
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement