పరిశుభ్రతతో సగం వ్యాధులు దూరం | Sakshi
Sakshi News home page

పరిశుభ్రతతో సగం వ్యాధులు దూరం

Published Wed, Oct 15 2014 3:32 AM

పరిశుభ్రతతో సగం వ్యాధులు దూరం - Sakshi

ఉదయగిరి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సగం వ్యాధులకు దూరంగా ఉండవచ్చని కలెక్టర్ శ్రీకాంత్ అన్నారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయగిరి మండలం అప్పసముద్రంలో సర్పంచ్ బి.రామక్క అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేలు అందజేస్తోందన్నారు.

మరుగుదొడ్డి లేని ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నవంబర్ లోపు నిర్మాణం పూర్తి చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. గ్రామంలోని మురుగునీరంతా ఒకే ప్రాంతానికి చేరే ఏర్పాటు చేసుకుని, ఉపాధి నిధులతో అక్కడ గుంత తవ్వుకోవాలన్నారు. ప్రతి ఇంట్లోని చెత్తను సేకరించి గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసే డంపింగ్ యార్డులో వేసేలా పంచాయతీ పాలకులు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఇంటికి మంచి నీటి కుళాయిల ఏర్పాటుకు కూడా చర్యలు చేపట్టాలన్నారు. ఆత్మకూరు ఆర్డీఓ ఎంవీ రమణ మాట్లాడుతూ ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం 10 గంటలకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఓ చోట చేరి చేతుల శుభ్రతపై అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. చేతులను శుభ్రంగా ఉంచుకుంటే అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు.

మండల పరిషత్ అధ్యక్షుడు చేజర్ల సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉదయగిరిని కరువు మండలంగా ప్రకటించి ఆదుకోవాలన్నారు. ఈ ప్రాంతంలో భూములున్నా కూడా దేనికీ పనికిరానందున పింఛన్ల మంజూరులో ఐదెకరాలు అనే నిబంధనను తొలగించాలన్నారు. గ్రామాలలో బెల్టుషాపులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

అర్హులందరికీ పింఛన్లు మంజూరుచేయాలన్నారు. గ్రామసభలో తహశీల్దారు కుర్రా వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ ఫణి పవన్‌కుమార్, ఎంఈఓ అల్లాభక్షు, వ్యవసాయాధికారి సుబ్రహ్మణ్యం, హౌసింగ్ ఏఈ శివమోహన్‌రెడ్డి, పీఆర్ ఏఈ రవీంద్రనాథ్, ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ రవీంద్రనాథ్, ఏపీఎం వెంకటేశ్వర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసరు శ్రీనివాసులు, ఐసీడీఎస్ సీడీపీఓ వెంకటసుబ్బమ్మ, ఈఓపీఆర్డీ రంగారెడ్డి, ఎస్సై విజయకుమార్, పంచాయతీ కార్యదర్శి సికిందర్, వీఆర్వో మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement