వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదు

Published Thu, Oct 30 2014 1:47 AM

వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదు - Sakshi

నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టీకరణ
 
నెల్లూరు: ‘‘నేను నైతిక విలువలు పాటించే వ్యక్తిని. పార్టీ సమావేశానికి రాకపోతే బీజేపీలో చేరుతున్నట్టా? నేను వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు. ఓ పార్టీపై గెలిచి మరో పార్టీలో చేరే తత్వం కాదు నాది. పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేతగా ఉంటూ వేరే పార్టీలో చేరాల్సిన అవసరం నాకు లేదు’’ అని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తేల్చిచెప్పారు. ఎంపీ మేకపాటి వైఎస్సార్‌సీపీకి దూరంగా ఉన్నారంటూ, పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై బుధవారం ఆయన ఘాటుగా స్పందించారు. తనపై వస్తున్న ప్రచారాలన్నీ అవాస్తమని తేల్చేశారు. తనకు, అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ కుటుంబాన్ని ఇబ్బందిపెడుతున్న తరుణంలో తాను వైఎస్ జగన్‌కు మద్దతు ఇచ్చానని, ఎంపీ పదవికి రాజీనామా చేశానని గుర్తుచేశారు.

తన రాజీనామాను ఆమోదింపజేసుకునేందుకు పార్లమెంట్‌లో ఆరునెలల పాటు పోరాడిన చరిత్ర తనదేనని చెప్పారు. ఎవరైనా మంచి చేస్తే మంచి అనడంలో తప్పులేదని, అందులో భాగంగానే ప్రధాని నరేంద్రమోదీని అభినందించానని మేకపాటి చెప్పారు. స్వచ్ఛభారత్ వంటివి చేపట్టడం అభినందనీయమన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనటం తప్పుకాదని, ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే ప్రభుత్వంలో భాగస్వాములేనని వెల్లడించారు. పార్టీ మారుతున్నారనే వార్త రాసే సమయంలో తన వివరణ తీసుకోవాల్సిన అవసరం లేదా? మీరు నైతిక విలువలు పాటిం చరా? అని ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్రతినిధులను ప్రశ్నించారు.
 

Advertisement
Advertisement