అర్హుల పింఛన్లు తొలగిస్తే ఊరుకునేది లేదు | Sakshi
Sakshi News home page

అర్హుల పింఛన్లు తొలగిస్తే ఊరుకునేది లేదు

Published Tue, Sep 30 2014 2:05 AM

అర్హుల పింఛన్లు తొలగిస్తే ఊరుకునేది లేదు

బ్రహ్మంగారిమఠంః
అర్హులైన వారి పింఛన్లను రద్దు చేస్తే ఊరుకునేది లేదని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. సోమవారం బ్రహ్మంగారిమఠం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బి.మఠం సింగిల్ విండో అధ్యక్షుడు  సి.వీరనారాయణరెడ్డి, మల్లెపల్లె సర్పంచ్ నాగిపోగు పెంచలయ్యలు మల్లెపల్లె గ్రామ పంచాయపతీ పరిధిలో రాజకీయ కక్షతో అర్హులుగా అర్హులైన 140 మందిని పింఛన్ల జాబితా నుంచి తొలగించారని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందించారు. మల్లెపల్లె వీఆర్‌ఓ సుబ్బన్నను పిలిచి రికార్డులను పరిశీలించారు. అర్హులుగా ఉన్న వారికి ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్లలో తొమ్మిది, పది నెంబర్లు వేయడంతో ఆయన వీఆర్‌ఓ, ఎంపీడీఓలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు వీఆర్‌ఓ భయపడి పరిశీలన అనంతరం స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ సభ్యురాలు ఆమోదం తెలిపారని, అయితే కమిటీ సభ్యుల్లో ఒకరైన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మేకల రత్నకుమార్ యాదవ్ కుమారుడు బాలకృష్ణ యాదవ్ ఆమోదం కోసం ఫైలు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అక్కడే అవకతవకలు జరిగినట్లు ఎమ్మెల్యేకు వివరించారు.  అర్హులైన వారిని తొలగించే అర్హత ఎవ్వరిచ్చారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. వీఆర్‌ఓపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. లింగాలదిన్నెపల్లె గ్రామంలో 40 మంది, మల్లెపల్లెలో 20 మంది, చెంచయ్యగారిపల్లెలో 60, ఎద్దులాయపల్లెలో 10 మంది, మల్లెపల్లె ఎస్సీ కాలనీలో మరికొంత మందిని తొలగించినట్లు రికార్డులు పరిశీలించగా తెలిసింది. అయితే వీరు వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసిన వృద్ధులేనని, అంతేగాకుండా రెడ్డి సామాజిక వర్గం కావడం వలనే తీసివేసినట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలు ఎలా ఉన్నా అర్హులను గుర్తించి వారికి పింఛన్ వచ్చేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎంపీడీఓ హుసేన్‌కు తెలిపారు. మండల కమిటిలోనైనా ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. అర్హుల పింఛన్లను ఎవరు రద్దు చేశారనేదానిపై రాతపూర్వకం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ 140 పింఛన్ల రద్దుకు ప్రధాన కారకుడు తెలుగుదేశం నాయకుని కుమారుడు బాలకృష్ణ యాదవ్ అని వీఆర్‌ఓ రాతపూర్వకంగా ఎమ్మెల్యేకు తెలిపారు. దీనిపైన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని  స్థానిక నాయకులకు హామీనిచ్చారు. బాధ్యుడైన బాలకృష్ణపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.



 

Advertisement
Advertisement