బతికి వస్తాననుకోలేదు | Sakshi
Sakshi News home page

బతికి వస్తాననుకోలేదు

Published Thu, Jul 10 2014 12:03 AM

బతికి వస్తాననుకోలేదు

తిండీ తిప్పలు లేవు. ఇంటికి ఫోన్ చేసే అవకాశం లేదు. పని చేస్తున్న కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదు. చివరకు అక్కడకు పంపిన ఏజెంట్‌తో సంబంధాలు తెగిపోయాయి. యుద్ధవాతావరణంలో బాంబుల మోత నడుమ తిరిగి ఇంటికి చేరతామా, ప్రాణాలతో ఉంటామా, అని భయాందోళనకు లోనవుతున్న తరుణంలో భారత్ ఎంబసీ స్పందించటం..బతుకుజీవుడా అంటూ బయటపడడం నిజంగా కలగానే ఉంది.తెనాలి రూరల్ మండలం కఠెవరం గ్రామానికి చెందిన ఈదులమూడి శశిదీప్ ఇరాక్ నుంచి క్షేమంగా ఇల్లు చేరిన సందర్భంగా మాట్లాడిన మాటలివి.
 
 ఇరాక్ నుంచి క్షేమంగా బయటపడిన ఈదులమూడి శశిదీప్
 తెనాలిఅర్బన్ : పొట్టకూటి కోసం ఏజెంట్ మాటలు నమ్మి మార్చి ఏడున శశిదీప్, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలకు చెందిన చెందిన ఎస్‌కే బాషా, లక్ష్మణ్‌లతో కలిసి ఇరాక్ వెళ్లాడు. అక్కడ కోఫియా ప్రాంతంలోని ఓ కూల్‌డ్రింక్ కంపెనీలో పనికి కుదిరాడు. నాలుగో నెల గడుస్తుండగా, ఇరాక్ ప్రభుత్వానికీ, అక్కడున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా (ఐఎస్‌ఐఎస్) తీవ్రవాదులకు మధ్య యుద్ధం ప్రారంభమైంది. దీంతో వీరంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. వారు పనిచేస్తున్న కంపెనీ ముందే బాంబు పేలుళ్లు, కాల్పులు జరగటంతో కంపెనీ యాజమాన్యం వీరిని పట్టించుకోకుండా పారిపోయింది. దాదాపు నాలుగు రోజులు నరకయాతన అనుభవించిన తరువాత భారత్‌కు సమాచారం అందింది. మన ఎంబసీ ప్రతినిధులు స్పందించి ఈ ముగ్గురూ బయటపడేందుకు సహకరించారు.
 
 అష్టకష్టాలు పడిన శశిదీప్ మంగళవారం రాత్రి కఠెవరం గ్రామానికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులను కలుసుకుని కంటతడి పెట్టుకున్నాడు. బతుకుతామని, తిరిగి కుటుంబ సభ్యులను కలుస్తామని కలలో కూడా ఊహించలేదని చెప్పాడు. యుద్ధ వాతావారణం నెలకొన్న తరువాత దాదాపు పదిరోజులు తిండి లేక, బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడే వీల్లేక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతికినట్టు శశిదీప్ చెప్పాడు.
 
 నెలల కాలానికి రెండు నెలల వేతనం మాత్రమే దక్కిందని వాపోయాడు. దాదాపు రూ. లక్షన్నర అప్పుచేసి ఉపాధి కోసం వెళితే, అప్పులే మిగిలాయని, తనలాంటి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. శశిదీప్‌తోపాటు వెళ్లిన ఎస్.కె. బాషా, లక్ష్మణ్‌లు కూడా క్షేమంగా ఇల్లు చేరుకున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement