ఓ ఎంపీగారి పాడుప్రేమ! | Sakshi
Sakshi News home page

ఓ ఎంపీగారి పాడుప్రేమ!

Published Sun, Jul 27 2014 1:14 AM

ఓ ఎంపీగారి పాడుప్రేమ! - Sakshi

  •   వెనుకబడిన మండలంగా చందర్లపాడు ఎంపిక
  •  అంత కన్నా వెనుకబడిన పది మండలాలను పట్టించుకోని వైనం
  •  తెరవెనుక చక్రం తిప్పిన టీడీపీ ఎంపీ?
  •  ఆయన పరిశ్రమల కోసం కేంద్రం నిధులతో అభివృద్ధి!
  • నందిగామ : అధికారంలోకి వచ్చిన వెంటనే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు టీడీపీ ఎంపీ ఒకరు. తాను భవిష్యత్తులో స్థాపించనున్న పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కేంద్ర ప్రభుత్వ నిధులతో సమకూర్చుకునేందుకు పథకం పన్నారు. ఈ మేరకు ఢిల్లీలో చక్రం తిప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన వెనుకబడిన మండలాల జాబితాలో చందర్లపాడుకు చోటు కల్పించారు.

    దీంతో చందర్లపాడు కన్నా వెనుకబడిన పది మండలాల ప్రజలు మండిపడుతున్నారు. సదరు ఎంపీకి చందర్లపాడు మండలంలో వేలాది ఎకరాల భూములు ఉన్నాయని, అందువల్లే వెనుకబడినట్లు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
     
    వెనుకబడినా.. పట్టించుకోని వైనం..
    జిల్లాలోని నందిగామ, వత్సవాయి, వీరులపాడు, కంచికచర్ల, తిరువూరు, పెనుగంచిప్రోలు, రెడ్డిగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేట, చాట్రాయి మండలాలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి.
     
     ఈ మండలాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. చెప్పుకోదగిన ఒక్క పరిశ్రమ కూడా లేదు.
     
     నీటి వనరులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. అక్కడక్కడా ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా మునేటికి వరద వచ్చినప్పుడు మాత్రమే చివరి భూములకు నీరు అందుతుంది.
     
     సాగర్ కాలువ ఉన్నా చివరి భూములకు నీరు అందిన దాఖలాలు లేవు.
     
     మెట్ట ప్రాంతాలు కావడంతో వ్యవసాయం పూర్తిగా ప్రకృతిపైనే ఆధారపడి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రకృతి ఆటుపోట్లు వచ్చిన ప్రతీసారి పంటలు దెబ్బతిని రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
     
     పది మండలాల్లోని గ్రామాల్లో అంతర్గత రహదారులు లేవు. డొంకరోడ్లు 20 శాతం కూడా నిర్మించలేదు.
     
     పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
     
     వైద్య సేవలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.
     
     గుర్తింపు వల్ల ఇవీ ఉపయోగాలు..
     కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేస్తారు.
     
     పరిశ్రమలకు విద్యుత్ బిల్లులు, పన్నుల చెల్లింపులతోపాటు ఇతర రాయితీలు ఇస్తారు. దీంతో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది.  
     
     ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
     
     పంచాయతీల ఆదాయం మెరుగుపడుతుంది.
     
     ఇన్ని ఉన్నా.. వెనకబడినట్లు గుర్తింపు..
     చందర్లపాడు మండలంలో అభివృద్ధికి అవసరమైన వనరులన్నీ ఉన్నాయి.
     
     సహజ సిద్ధమైన ప్రకృతి వనరులు, నీరు, కొండ పోరంబోకు, అటవీ పోరంబోకు, కృష్ణానదీ పరీవాహక పోరంబోకు భూములు అనేకం ఉన్నాయి.
     
     మండలంలో ఇప్పటికే సుబాబుల్ కర్ర వ్యాపారం ఎక్కువగా జరుగుతోంది. ఇందుకోసం అనేక వేబ్రిడ్జిలు ఉన్నాయి.
     
     ముప్పాళ్ల ప్రాంతంలో బస్ బాడీ బిల్డింగ్ ఫ్యాక్టరీ, ఫ్లైవుడ్, టైల్స్, విద్యుత్ ట్రాన్సఫార్మర్ల తయారీ పరిశ్రమలు ఉన్నాయి.
     
     గుడిమెట్ల-ఉస్తేపల్లి మధ్య కెమికల్ ఫ్యాక్టరీ, ఆయుర్వేద ఫార్మసీ, బిస్లెరీ పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి.
     
     గుడిమెట్ల ప్రాంతంలో సహజ వనరులు ఎక్కువగా ఉండటంతో పరిశ్రమలు నెలకొల్పేందుకు టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఒకరు రెండు వేల ఎకరాలకు పైగా కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
     
     ఏటూరు గ్రామం నుంచి కంచికచర్ల మండలం మోగులూరును కలుపుతూ మునేటిపై కాజ్‌వే నిర్మించనున్నట్లు ఇటీవలే రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు.
     
    కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద నుంచి గుంటూరు జిల్లా అమరావతిని కలుపుతూ భారీ వంతెనతో పాటు రిజర్వాయర్‌ను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు ప్రచారం జరుగుతోంది.
     
     చందర్లపాడు మండలానికి తూర్పున మునేరు, దక్షిణం పడమరగా కృష్ణానదీ ప్రవహిస్తుండటంతో అక్కడి భూములు పరిశ్రమలకు అనువుగా ఉంటాయని పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement