కాకినాడను మారుస్తా: సీఎం | Sakshi
Sakshi News home page

కాకినాడను మారుస్తా: సీఎం

Published Sun, Aug 27 2017 1:17 AM

కాకినాడను మారుస్తా: సీఎం - Sakshi

సాక్షి, కాకినాడ:  నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థులను గెలిపిస్తే కాకినాడను బ్రహ్మాండమైన నగరంగా తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆయన నగరంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదు రహదారి కూడళ్లలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో చంఢీగఢ్, యానాం తర్వాత మూడో ప్రణాళికాబద్ధమైన నగరంగా కాకినాడ నిలుస్తోందని, కేంద్ర ప్రభుత్వం కూడా కాకినాడను స్మార్ట్‌సిటీగా ప్రకటించి ఇప్పటి వరకూ రూ.400 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. 
 
సముద్రంతోనే సమస్య
నగరంలో విశాలమైన, పొడవైన రహదారులున్నా సముద్రంతోనే పెద్ద సమస్య వచ్చిందన్నారు. సముద్రం పొంగినప్పుడు నగరంలోకి నీరు వస్తోందన్నారు. డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. తమ పార్టీని గెలిపిస్తే డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మార్చివేస్తామని హామీ ఇచ్చారు. మూడున్నరేళ్లలో నగరంలో డ్రైనేజీల నిర్మాణానికి రూ.22 కోట్లు ఖర్చు చేశామని, రానున్న రోజుల్లో మరో రూ.460 కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. చనిపోయిన వారికి వెంటనే రూ.30 వేలు ఇస్తున్నామని, తాను స్వయంగా సంతాప లేఖ రాస్తున్నానని తెలిపారు. 

Advertisement
Advertisement