జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా | Sakshi
Sakshi News home page

జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా

Published Mon, May 18 2015 2:22 AM

i Will  District development Minister Paritala Sunitha

జిల్లా ఇన్‌చార్జి మంత్రి పరిటాల సునీత
 శ్రీకాకుళం సిటీ/ శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి తనవంతుగా కృషిచేస్తానని టీడీపీ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పరిటాల సునీత అన్నారు. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన టీడీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. అనంతపురం జిల్లాకు ఇక్కడ పరిస్థితికి చాలా వ్యత్యా సం ఉందన్నారు. జిల్లాలోని టీడీపీ కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని చెప్పారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రతిపేద కుటుంబంలో ఇస్తున్న రేషన్‌పై ఏటా *700కు పైగా అదనపు భారాన్ని ప్రభుత్వం మోస్తోందన్నారు.
 
  జన్మభూమి కమిటీల ద్వారా 11 లక్షల రేషన్‌కార్డుల దరఖాస్తులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల మేర రేషన్ కార్డులు ఉండగా 8 లక్షల బోగస్ రేషన్ కార్డులను గుర్తించామన్నారు. రాష్ట్ర కార్మిక శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 24 వరకూ హైదరాబాదులో మహానాడు జరగనుందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మరచిపోతే మనుగడ ఉండదన్నారు. తోటపల్లి రిజర్వాయర్ ద్వారా 1.87 లక్షల ఎకరాలకు జూన్ నాటికి సాగునీరందిస్తామన్నారు. 2016 జూన్ నాటికి వంశధార రెండవదశ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.
 
 ఎన్నికల పర్యవేక్షకుడు, ఎంపీ తోట నర్సింహం, ఎన్నికల పర్యవేక్షకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికతో పాటు ముఖ్యమైన కమిటీలు, అనుబంధ కమిటీల ప్రక్రియను ఆదివారం సాయంత్రానికి పూర్తి చేసి వాటి జాబితాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు.  ప్రభుత్వవిప్ కూన రవికుమార్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా అని, ఈ జిల్లాపై ప్రత్యేకదృష్టి సారించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పరిటాల సునీతను కోరారు. ఆర్థిక వనరులు, హైవే, ఇరిగేషన్, తాగునీరు, మౌలికవసతులు మెరుగుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ మంత్రి, ఎచ్చెర్ల శాసనసభ్యుడు కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 55 లక్షల సభ్యత్వం దేశం పార్టీలో ఉందన్న విషయాన్ని తెలిపారు.
 
  టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జి మాట్లాడుతూ పార్టీ పూర్వవైభవానికి, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ఎమ్మెల్యేలు గౌతు శ్యామసుందర్ శివాజీ, గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్, మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి, ఇన్‌చార్జిలు నిమ్మక జయకృష్ణ, శత్రుచర్ల విజయరామరాజు, గొర్లె హరిబాబునాయుడు, బోయిన గోవిందరాజులు, ఎల్ ఎల్ నాయుడు, తలే భద్రయ్య,  పి.వి.రమణ, కలిశెట్టి అప్పలనాయుడు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
 
 సునీతకు ఘనస్వాగతం
 రాష్ట్ర పౌరసంబంధాల శాఖామంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పరిటాల సునీతకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం, ఏజేసీ పి.రజనీకాంతరావు, ఆర్‌డీవో బి.దయానిధి, డీఎస్‌వో సీహెచ్.ఆనంద్‌కుమార్ తదితరులు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.
 

Advertisement
Advertisement