విభజన, సమీక్షే పాలన..! | Sakshi
Sakshi News home page

విభజన, సమీక్షే పాలన..!

Published Fri, Mar 7 2014 2:45 AM

విభజన, సమీక్షే పాలన..! - Sakshi

 లక్షల్లో ఫైళ్లు, కోట్ల సంఖ్యలో పేపర్ల జిరాక్స్‌లు
 మరోవైపు గవర్నర్ సమీక్షకోసం ఫైళ్లను సిద్ధం చేస్తున్న వైనం
సాధారణ ఫైళ్ల గురించి పట్టించుకునే  నాథుడే లేడు

 
సాక్షి, హైదరాబాద్: రాష్టంలో పాలన పడకేసింది. సచివాలయం నుంచి సాధారణ ప్రభుత్వ కార్యాలయాల వరకు.. ఐఏఎస్ అధికారులనుంచి సాధారణ ఉద్యోగుల వరకూ అందరూ విభజన పనిలోనే మునిగితేలుతున్నారు. మరోవైపు గత రెండు నెలల్లో ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ నర్సింహన్ సమీక్షించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. గవర్నర్ సమీక్షకు ఎటువంటి ఫైళ్లు పంపాలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సంబంధిత శాఖల ఐఏఎస్‌లకే అప్పజెప్పేశారు. దీంతో గత రెండు నెలల్లో తీసుకున్న నిర్ణయాల ఫైళ్లను అన్నింటినీ పంపించేయాలని ఆయా శాఖలకు చెందిన ఐఏఎస్‌లు భావిస్తున్నారు. ఫలితంగా ఆయా శాఖల్లో దీనికి సంబంధించిన కసరత్తు జోరుగా సాగుతోంది. దీంతో సాధారణ ఫైళ్లు అంగుళం కూడా కదలడంలేదు.
 
- ప్రధానంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, సాగునీరు. మున్సిపల్ వంటి శాఖల్లో లక్షల సంఖ్యలో ఫైళ్లు ఉన్నాయి. అన్ని శాఖల్లో కలిపి లక్షల సంఖ్యల్లో ఫైళ్లు, కోట్ల సంఖ్యలో పేపర్లు ఉన్నాయి. ఈ ఫైళ్లను తెలంగాణ, సీమాంధ్ర వారీగా విభజించడంపైనే ఉద్యోగులందరూ పనిచేస్తున్నారు. ఫైళ్ల విభజన పూర్తి చేసిన తరువాత వాటిని జిరాక్స్‌లు లేదా స్కానింగ్ చేసే పనిని చేపట్టనున్నారు.
- అత్యంత ప్రాధాన్యత విభజనేనని, అందరూ  ఈ పనిలోనే నిమగ్నమవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో అన్ని శాఖలు ఈ పనిని తప్ప మరో పనిని చేపట్టడం లేదు.
- ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటికీ సాధారణంగా జరగాల్సిన పనులను విభజన నేపథ్యంలో అధికార యంత్రాంగం పక్కన పెట్టేసింది.
 
 సచివాలయం సీ బ్లాకులోనే సలహాదారులు
 గవర్నర్‌కు పాలన అంశాల్లో సలహాదారులగా నియమితులయ్యే వారికి సచివాలయంలోని సీ బ్లాకు నాలుగో అంతస్తులో గతంలో సీఎం ముఖ్యకార్యదర్శి అజయ్ కల్లాం ఉన్న పేషీని, అలాగే ఐదో అంతస్తులో గతంలో సీఎం కార్యదర్శి రావత్ ఉన్న పేషీని కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. వారు బస చేయడానికి లేక్‌వ్యూ అతిథి గృహాన్ని కేటాయించనున్నారు.

Advertisement
Advertisement