ఏపీ ప్రజల ఆకాంక్షను గుర్తించండి | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రజల ఆకాంక్షను గుర్తించండి

Published Mon, Apr 9 2018 1:45 AM

Identify the expectations of the AP people - Sakshi

న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఇంకా జాప్యం తగదని, వెంటనే ఎన్డీయే ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని సీపీఐ రాజ్యసభ సభ్యుడు, పార్టీ జాతీయ నాయకుడు డి.రాజా విజ్ఞప్తి చేశారు. ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఎంపీలను ఆదివారం సాయంత్రం ఆయన పరామర్శించారు. ఎంపీల దీక్షకు, వైఎస్సార్‌సీపీ ప్రత్యేక హోదా పోరాటానికి తమ పార్టీ తరఫున సంపూర్ణంగా సంఘీభావం ప్రకటిస్తున్నానని పేర్కొన్నారు. దీక్షా శిబిరం వద్ద ఆయన ప్రసంగిస్తూ... ప్రత్యేక హోదా కావాలన్న ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో రోజు రోజుకూ బలపడుతోందని, వారి సెంటిమెంట్‌ను ప్రధాని నరేంద్రమోదీ అర్థం చేసుకోవాలని హితవు పలికారు. హోదా విషయంలో ఇంకా ఆలస్యం చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది భవిష్యత్‌లో ఏపీ ప్రజలే చెబుతారని అన్నారు. ఎంపీల పోరాట పటిమను ఆయన ప్రశంసిస్తూ వారి ఆరోగ్యం క్షీణిస్తూ ఉండటం ఆందోళనకరమన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను విభజించే తంతులో తాను కూడా భాగస్వామినని, రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందేటప్పుడు తానూ ఉన్నానని, అందుకే ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్‌ను సమర్థించడం తనపై ఉన్న నైతిక బాధ్యత అని రాజా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చర్చలో ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నేతలు అరుణ్‌ జైట్లీ, ఎం.వెంకయ్యనాయుడు ఏం మాట్లాడారనేది అందరికీ తెలుసునన్నారు. పవిత్రమైన పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా అని, అందుకే ఆంధ్రప్రదేశ్‌కు దానిని ఇచ్చి తీరాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏ ప్రధాని హామీ ఇచ్చారు? ఏ ప్రభుత్వ హయాంలో హామీ లభించింది? అనేవి అప్రస్తుతం అని, ప్రధానిగా ఎవరున్నా... ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అనేది నిరంతరం సాగే ప్రక్రియ అన్నది మరవకూడదన్నారు.

గత ప్రభుత్వాలు చేసిన వాగ్దానాలను ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు గౌరవించి తీరాలన్నారు. లేకపోతే పార్లమెంటు విలువ తగ్గుతుందని రాజా ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ చేస్తున్న పోరాటానికి ఆయన మద్దతు ప్రకటిస్తూ సీపీఐ కూడా హోదా కోసం ముందుండి పోరాడుతున్న పార్టీల్లో ఒకటన్నారు. వైఎస్సార్‌ జిల్లాలో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర మహాసభల్లో ఉన్న నాయకులతో తాను మాట్లాడితే వైఎస్సార్‌సీపీ పోరాటానికి సంఘీభావం ప్రకటించడం సమర్థనీయమని వారన్నారని రాజా అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ ప్రజల బలీయమైన మనోభావాలను అర్థం చేసుకుని తక్షణం స్పందించాలన్నారు.

Advertisement
Advertisement