లేఅవుట్లు వేస్తే ఖబడ్దార్! | Sakshi
Sakshi News home page

లేఅవుట్లు వేస్తే ఖబడ్దార్!

Published Mon, Jan 19 2015 1:34 AM

లేఅవుట్లు వేస్తే ఖబడ్దార్!

గుంటూరు ఈస్ట్ : రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి(సీఆర్‌డీఏ)పరిధిలోని రాజధాని భూ సమీకరణ గ్రామాలు, మిగిలిన అన్ని ప్రాంతాల్లో అనధికారి లేఅవుట్లు వేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ హెచ్చరించారు.
 
 తన బంగ్లాలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజధాని ప్రకటిత ప్రాంతానికి సమీపంలోని అనేక గ్రామాల్లో అనధికార లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు.
 
 సీఆర్‌డీఏ పరిధిలో లేఅవుట్లు వేసేందుకు అనుమతి లేదన్నారు. కొంతమంది లేఅవుట్లు వేసినట్టు కరపత్రాలు, వెబ్‌సైట్ల ద్వారా చేసుకుంటున్న ప్రచారాలను ప్రజలు నమ్మి మోసపోవద్దని సూచించారు. రాజధాని భూ సమీకరణ గ్రామాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లోని లేఅవుట్లలో ప్లాట్లు కొంటే భవిష్యత్తులో మంచి ధర వస్తోందని దళారులు చేస్తున్న ప్రకటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చిన నేపథ్యంలో ప్రజలు మోసపోవద్దని చెబుతున్నట్టు తెలిపారు.
 
 మూడేళ్ల వరకు జైలు శిక్ష ....
 సీఆర్‌డీఏ పరిధిలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో లేఅవుట్లు వేసినా, కరపత్రాలు, వెబ్‌సైట్‌లలో ప్రచారం చేసినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు.
 
  సీఆర్‌డీఏ 108 యాక్ట్‌ను అనుసరించి ఈ తరహా ప్లాట్లను డెవలప్ చేసినా, అమ్మినా, ప్రోత్సహించినా అలాంటి వ్యక్తులకు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, లేఅవుట్ ప్రతిపాదిత భూమి విలువలో 20 శాతం జరిమానా విధించడం జరుగుతుందని జేసీ స్పష్టం చేశారు.
 
 ఆ లేఅవుట్‌లలో చేపట్టే నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుందని చెప్పారు. లేఅవుట్‌లో ప్లాట్ల విక్రయాలు ప్రభుత్వ చర్యల అనంతరం కూడా కొనసాగించినట్లయితే ఆ భూమి విలువలో ఒక రోజుకు ఒక శాతం చొప్పున జరిమానా విధించి వసూలు చేయడం జరుగుతుందని వివరించారు.
 కోరుకుంటే అభివృద్ధి
 
 చేసిన ప్లాట్లు వారసులకు ...
 రాజధాని ప్రతిపాదిత గ్రామాలలో ప్రభుత్వానికి భూములు అప్పగించే భూ యజమానులు అభివృద్ధి చేసిన ప్లాట్లను తమ వారసులకు ఇవ్వదలచుకుంటే ఆ విషయాన్ని పొందుపరుస్తూ సంతకం చేసిన అఫిడవిట్‌ను అధికారులకు ఇవ్వాలని జేసీ శ్రీధర్ చెప్పారు. దరఖాస్తుతోపాటు ఈ అఫిడవిట్‌ను విడిగా ఇవ్వాలన్నారు. అయితే ర క్తసంబంధీకుల పేర్లు  మాత్రమే ఇవ్వాలని కోరారు.
 
 భూములను ప్రభుత్వానికి అప్పగించే సమయంలో ఆ భూములలో హైటెన్షన్ వైర్లు, టాన్స్‌ఫార్మర్ల్ ఉంటే ఆ విషయాన్ని 9(3) దరఖాస్తులో తెలియజేయాలని సూచించారు. వాటి తొలగింపు ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.
 
 సేకరించిన ప్రాంతంలోనే అభివృద్ధి చేసిన ప్లాట్లు ...
 భూములు సేకరించిన అనంతరం తీసుకున్న భూములకు దగ్గరలోనే అభివృద్ధి చేసిన ప్లాట్లనే భూ యజమానులకు కేటాయిస్తారని చెప్పారు. దీని వల్ల జరీబు  భూ యజమానులు నష్టపోవడం ఉండదని వివరించారు. ఎక్కువ ధర పలుకుతున్న భూములు ఉన్న గ్రామాల వారికి అదే ప్రాంతంలో అభివృద్ధి చేసిన లేఅవుట్‌లలోని ప్లాట్లను ఇస్తారే తప్ప వేరే ప్రాంతాలలో కేటాయించరని ఈ విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. భూసమీకరణపై మార్పు చేసిన దరఖాస్తు ఫారాలను అన్ని గ్రామాలలో పంపిణీ చేస్తారని చెప్పారు.

Advertisement
Advertisement