ఆయుధం ఉంటే బతికేవాడు | Sakshi
Sakshi News home page

ఆయుధం ఉంటే బతికేవాడు

Published Mon, Dec 16 2013 1:20 AM

ఆయుధం ఉంటే బతికేవాడు - Sakshi

 అటవీ అధికారి శ్రీధర్ తల్లిదండ్రుల ఆవేదన


 తిరుపతి, న్యూస్‌లైన్ : ‘‘ చేతిలో ఒక ఆయుధం ఉండుంటే నా బిడ్డ బతుకుండేవాడు, ఉడుగుతున్న వయసులో కంటికి రెప్పలా కాపాడుతూ, మమ్మల్ని కడతేర్చి కన్న రుణం తీర్చుకుంటావని ఆశిస్తే  మమ్మల్ని ఒంటరి చేసి వెళ్లావా.. కోనల్లో కిరాతకుల చేతుల్లో బలై మా గుండెలను బరువెక్కించావా.. ఇక మేము ఎవరికోసం బతకాలిరా కొడుకా...’’ అంటూ శ్రీధర్ తల్లిదండ్రులు బోరున విలపిం చారు. ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అధికారి శ్రీధర్ ఇంటి వద్ద ఈ దృశ్యం కనిపించింది. శ్రీధర్ ఇంటిలోనే కాదు, ఆ వీధి మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి. ఎన్. రామచంద్రయ్యనాయుడు, నాగరత్నమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. ఇద్దరు కుమారులు  ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. పెద్ద కుమారుడైన శ్రీధర్ తిరుపతి అటవీ శాఖలో 1990 నుంచి ఉద్యోగం చేస్తూ కుటుంబానికి బాసటగా ఉన్నారు. శ్రీధర్‌కు భార్య ఇందిర, కొడుకులు హరికిరణ్ (బిటెక్), చరదీప్ (10వ తరగతి) ఉన్నారు. శ్రీధర్‌పై ఐదేళ్ల క్రితం ఎర్రచందనం స్మగ్లర్లు రవ్వ గుండ్లతో దాడి చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసమయంలో త్రుటిలో ప్రాణప్రాయం నుంచి తప్పించుకున్నట్టు తెలిపారు.
 
 దిక్కు మాలిన ప్రభుత్వం....

 ఈ దిక్కు మాలిన ప్రభుత్వంలో సామాన్య ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ కరువైందని శ్రీధర్ మృతి చెందడాన్ని జీర్ణించుకోలేని పలువురు శాపనార్థాలు పెట్టారు. కొంత కాలంగా అటవీ శాఖ అధికారులు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి స్మగ్లర్లపై దాడులు చేసి విలువైన ఎర్రచందనాన్ని పరిరక్షిస్తున్నారని గుర్తుచేశారు. స్మగ్లర్లను ఎదుర్కొనే విధంగా అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి ఆయుధాలు ఇవ్వక పోవడంపై ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒక వేళ ఆయుధాలు ఇచ్చి ఉంటే ఇలాంటి దారుణం జరిగి ఉండేది కాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement