కనిపిస్తే కబ్జా | Sakshi
Sakshi News home page

కనిపిస్తే కబ్జా

Published Wed, Aug 12 2015 3:08 AM

కనిపిస్తే కబ్జా

- ప్రభుత్వ, ప్రైవేటు భూములనే తేడాలేదు
- ఏది కనిపించినా.. కన్నుపడితే చాలు ఆక్రమణలే
- వేములపాడు మహమ్మదాపురం పంచాయతీల్లో కబ్జాలపర్వం
- యథేచ్ఛగా అటవీ భూముల ఆక్రమణ..
- జామాయిల్ తోటల సాగు
హనుమంతునిపాడు :
ప్రభుత్వ భూములు, కుంటలు, పురాతన బంగళాలు, పోలీసు ఠాణా స్థలాలు, అటవీ భూములు, కొండ వాలు భూములు, పశువుల బీడు.. ఒక్కటేమిటి ఆక్రమణకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. వందల ఎకరాలు ఆక్రమించుని ఏకంగా తోటలు సాగు చేస్తున్నారు. హనుమంతునిపాడు మండలం వేములపాడు, కొండారెడ్డిపల్లి, మహమ్మదాపురం పంచాయతీలు కబ్జాదారుల అడ్డగా మారాయి. ప్రధానంగా వందల ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుని జామాయిల్, క్లోన్స్ మొక్కలు సాగు చేశారు. ముప్పళ్లపాడు పంచాయతీలోనూ ప్రభుత్వ భూమిని ఆక్రమించి బడా బాబులు నిమ్మతోటలు నాటారు. కొంత మంది పక్క మండలాల రైతులకు కౌలుకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు.
 
కొండారెడ్డిపల్లి పంచాయతీలో..
కొండారెడ్డిపల్లి పంచాయతీలో సర్వే నంబర్ 222లో గాడిరాళ్లకొండ వద్ద 274 ఎకరాలు, సర్వేనంబర్ 208లో ఆరెకరాల పోరంబోకు భూమి, సర్వేనంబర్ 207లోని 42 ఎకరాల పశువుల బీడును ఆక్రమించుకున్నారు. జామాయిలు తోటలు విస్తారంగా సాగు చేశారు. ఇటీవల జామాయిల్ కర్రను రాత్రులు తరలిస్తుండగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో వదిలేశారు.
 
హైవే పొడవునా..
వేములపాడు సమీప నంద్యాల-ఒంగోలు హైవే పక్కన 419, 422, 420,421,405 సర్వే నంబర్లలో భూమిని దర్జాగా కబ్జా చేశారు. కుంటలు, ఫారెస్టు భూమి, ప్రభుత్వ భూములు, రోడ్డు సైడు భూములు, పశువుల బీడు భూమి, చెక్ డ్యాం సైతం కబ్జాలకు గురయ్యాయి. పశువుల కుంటలు చదును చేసి సాగు చేయడంతో పశువులకు తాగునీరు కరువైంది. అడవికి మేతకెళ్లిన జీవాలు, పశువులు అల్లాడుతున్నాయి. మహమ్మదాపురం రెవెన్యూలో   సర్వేనంబర్ 422లో అసైన్డు భూమిలో ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయలకు, హాస్టల్ వార్డెన్లకు 18 ఎకరాల్లో  పట్టాలు ఇచ్చారు. వాటికి కూడా పాస్ పుస్తకాలు సృష్టించి అమ్ముకున్నట్లు సమాచారం.
 
కఠిన చర్యలు తప్పవు
డిప్యూటీ తహసీల్దార్ షేక్ రఫీని  భూ కబ్జాలపై  వివరణ కోరగా ప్రభుత్వ భూముల ఆక్రమిస్తే వారిపై కఠిన చర్యలతోపాటు కేసుల నమోదు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో దండోరా కూడా వేయించినట్లు తెలిపారు. హెచ్చరిక బోర్డులనుకూడా ఏర్పాటు చేశామన్నారు. కబ్జా భూములను పరిశీలించి హెచ్చరించినట్లు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement