Sakshi News home page

నైపుణ్యం ఉంటే బంగరు భవిత

Published Tue, Sep 16 2014 1:12 AM

నైపుణ్యం ఉంటే బంగరు భవిత - Sakshi

విద్యానగర్ (గుంటూరు): ఇంజినీరింగ్ విద్యలో నైపుణ్యం అవసరమని, కాలానుగుణంగా నైపుణ్యం పెంపొందించుకునేవారికి బంగారు భవిత వెన్నంటే ఉంటుందని తులసీ గ్రూప్ చైర్మన్ తులసీ రామచంద్రప్రభు తెలిపారు. గుంటూరు రూరల్ మండలం పెద్దపలకలూరు గ్రామంలోని విజ్ఞాన్ నిరులలో సోమవారం ఇంజినీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథి రామచంద్రప్రభు మాట్లాడుతూ ఇంజినీరింగ్ వృత్తికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆదర్శప్రాయుడని చెప్పారు. యువ ఇంజనీర్లు కూడా కొత్త విషఫయాలు తెలుసుకుని నూతన టెక్నాలజీతో దేశ భవితకు బాటలు వేయాలని సూచించారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ పర్‌ఫెక్ట్ ఇంజినీర్ తులసి రామచంద్రప్రభు ఇంజినీర్స్ డేకు ముఖ్య అతిథిగా రావడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా రామచంద్రప్రభును కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పాతూరి రాధిక, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. తొలుత ముఖ్యఅతిథి రామచంద్రప్రభు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
 విజ్ఞాన్ వర్సిటీలో ఇంజినీర్స్ డే వేడుకలు..
 చేబ్రోలు: మోక్షగుండం విశ్వేశరయ్యలోని నిబద్ధత, పట్టుదల, దేశభక్తి, కృషిని విద్యార్థులు అలవర్చుకోవాలని సికిందరాబాద్‌కు చెందిన ఐఎస్‌డీవో అడ్రిన్ డిప్యూటీ డెరైక్టర్ జె.సాయిబాబు అన్నారు. వడ్లమూడి విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో సోమవారం ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాటిలైట్ టెక్నాలజీ అండ్ రిమోట్ సెన్సింగ్‌లో చేసిన సేవలకుగాను ఉత్తమ సాంకేతిక పురస్కార్ -2014 అవార్డును విజ్ఞాన్ యూనివర్సిటీ సాయిబాబుకు అందజేసింది. పురస్కార్ గ్రహీత సాయిబాబా మాట్లాడుతూ మన దేశ ప్రముఖలైన శాస్త్రవేత్తలు, సాంకేతికవేత్తలు అయిన కేఎల్‌రావు, ఏపీజె అబ్దుల్ కలాం, విక్రం సారాభాయ్‌లను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.  చంద్రయాన్ -1, చంద్రయాన్-2లో పనిచేసిన అనుభవాన్ని వివరించారు. విజ్ఞాన్ విశ్వవిద్యాలయం వైస్‌చైర్మన్ లావు కృష్ణదేవరాయులు, ఉపకులపతి ఎం.పురుషోత్తం, రిజిస్ట్రార్ రఘునాథన్, డీన్ ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ వి.మధుసూదనరావు, ఫార్మసీ, లారా కళాశాలల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
 
 
 

 

Advertisement

What’s your opinion

Advertisement