సార్వత్రిక విద్యలో ఇగ్నో కీలకపాత్ర | Sakshi
Sakshi News home page

సార్వత్రిక విద్యలో ఇగ్నో కీలకపాత్ర

Published Fri, Aug 7 2015 1:16 AM

సార్వత్రిక విద్యలో ఇగ్నో కీలకపాత్ర

40 దేశాల్లో అధ్యయన కేంద్రాలు
దేశంలో 67 ప్రాంతీయ కేంద్రాలు
8న  28వ ఇగ్నో స్నాతకోత్సవం
 

విజయవాడ (వన్‌టౌన్) : భారతదేశంలో సార్వత్రిక విద్యను అందించే విద్యా సంస్థల్లో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) మేటిగా ఉంది. ఉన్నత విద్యావ్యాప్తి కోసం 1985 నవంబర్ 19న ఇగ్నోను ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం ద్వారా దీని ఏర్పాటుకు ప్రభుత్వం పునాదులు వేసింది.  రోజువారి (రెగ్యులర్) విద్యా విధానంలో ఉన్నత చదువులు చదవాలనే కాంక్ష బలంగా ఉండి, ఆ అవకాశం లేని  లక్షలాదిమంది ఇగ్నో ద్వారా తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. విద్యావ్యాప్తితో పాటుగా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే క్రమంలో ఇగ్నో విధానాలు యువతకు బాసటగా నిలుస్తున్నాయి. ఈనెల 8న ఇగ్నో స్నాతకోత్సవం జరుగనుంది.

 ప్రమాణాల్లో రాజీ లేదు
 ప్రతి విద్యార్థి ఆయా కోర్సుకు సంబంధించిన ఎసైన్‌మెంట్లను పూర్తి చేసి సమర్పించాలి. ఎసైన్‌మెంట్లకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం 30 శాతం మార్కులను కేటాయిస్తుంది. అలాగే రాత పరీక్షలకు 70 శాతం మార్కులు ఉంటాయి. రెండింటిలోనూ విద్యార్థులు సరైన ప్రతిభ కనబరిచినప్పుడే ఆ కోర్సు ఉత్తీర్ణులయ్యేం దుకు అవకాశముంటుంది. దీనిలో ఇగ్నో  రాజీ పడకుండా ముందుకు సాగుతోంది.   ఉతీర్ణతా సర్టిఫికెట్లలో క్రెడిట్స్‌తో పాటుగా మార్కుల శాతాన్ని కూడా ముద్రిస్తారు.

 ఉపాధే లక్ష్యంగా కోర్సులు
 యూజీ, పీజీ కోర్సులతో పాటు ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసే పలు కోర్సులను కూడా ఇగ్నో అందిస్తోంది. కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఉన్న పాడి పరిశ్రమను గమనంలో ఉంచుకొని డిప్లమో ఇన్ డెయిరీ టెక్నాలజీ కోర్సును ప్రత్యేకంగా ఇంగ్లిష్, తెలుగు మీడియాల్లో నూతనంగా ప్రవేశ పెట్టారు. ఎంఏ (సైకాలజీ), ఎంఎస్సీ (కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీథెరఫీ), ఎంఎస్‌డబ్ల్యు (కౌన్సిలింగ్ ) కోర్సులు, అలాగే పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి పీజీ డిప్లమో ఇన్ ప్రీ ్రైపైమరీ ఎడ్యుకేషన్, విద్యా కళాశాలల్లో బోధకులుగా వెళ్లేవారికి ఎంఏ (ఎడ్యుకేషన్) తదితర కోర్సులు ఉన్నాయి.

 29 అధ్యయన కేంద్రాలు
 రాష్ట్రం విడిపోయిన తరువాత విజయవాడ రీజినల్ సెంటర్ కీలకంగా మారింది. విజయవాడ రీజినల్ కేంద్రం ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్, తెలంగాణ  రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాల్లో స్టడీ సెంటర్లు కొనసాగుతున్నాయి. 2013లో రాయలసీమ జిల్లాలకు సంబంధించి తిరుపతిలో సబ్ రీజినల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. విజయవాడ రీజినల్ కేంద్రం పరిధిలో మొత్తం 29 అధ్యయన  కేంద్రాల ద్వారా వేలాది మంది విద్యార్థులు పలు డిగ్రీలను పూర్తి చేసుకుంటున్నారు.

 ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు
 ఇగ్నోకు ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు ఉన్నారు. ప్రధానంగా గడిచిన మూడు దశాబ్ధాల్లో  40 దేశాలకు ఇగ్నో సేవలు విస్తరించాయి. దేశ వ్యాపితంగా 67 ప్రాంతీయ కార్యాలయాలు, వాటి కింద 2,600కు పైగా స్టడీ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఇగ్నో మొత్తం 142 కోర్సులను అందిస్తుండగా విజయవాడ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో వంద వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఇగ్నో కార్యాలయ ప్రతినిధులు చెబుతున్నారు.

 బీకాం (ఏ అండ్ ఎఫ్)కు భలే డిమాండ్
 సీఏ కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థులకు ఒకే ఏడాదిలో బీకాం (ఏ అండ్ ఎఫ్) డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశాన్ని ఇగ్నో కల్పిస్తోంది. ఈ కోర్సును ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అక్కౌంటెన్సీ, ఇగ్నో సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. నగరంలో సీఏ విద్యా సంస్థలు అధికంగా ఉండటంతో ఈ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement