కదులుతున్న అక్రమాల డొంక | Sakshi
Sakshi News home page

కదులుతున్న అక్రమాల డొంక

Published Sun, Oct 13 2019 9:56 AM

Illegal Granite Transport In Prakasam - Sakshi

సాక్షి.మార్టూరు(ప్రకాశం) : మండల కేంద్రం మార్టూరులో పది రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నకిలీ వేబిల్లుల వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మార్టూరు బైనీడి కాలనీలోని ఓ యువకుడికి చెందిన గ్రానైట్‌ ముడిరాయి లారీని గత గురువారం సంతమాగులూరు పోలీసులు స్వాధీనం చేసుకుని తనిఖీ చేశారు. ఎలాంటి బిల్లులు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి వెళ్తున్నట్లు గుర్తిం చి వాహనానికి చెందిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అధికారుల విచారణలో ఆ యువకుడు పది మందికి చీకటి వ్యాపారుల వివరాలు చెప్పడంతో తీగ లాగితే మార్టూరు, బల్లికురవ మండలాల్లో డొంక కదలడం ప్రారంభించింది. అంతేగాక ఆ యువకుడు తనను పోలీసు కేసు నుంచి తప్పించకుంటే ఈ వ్యాపారంలో ము ఖ్యులైన వారి అసలు రంగు బయట పెడతానని బెదిరించడంతో కొందరు ముఖ్యులు అండర్‌ గ్రౌండ్‌కు వెళ్లినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు అత్యంత సన్నిహితుడు, ఆయన స్వగ్రామం కోనంకికి చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ యువకుడి సోదరి శనివారం సాయంత్రం స్థానిక పోలీసుస్టేషన్‌ వద్ద హల్‌చల్‌ చేయబోయి సర్దుకుంది. ఏలూరి తమ అనుచరుడిపై అధికార పార్టీ తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తుందనే కోణంలో రగడ చేసేందుకు రంగం సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం. పోలీసుల వలలో త్వరలో కొన్ని తిమింగలాలు పడనున్నట్లు మార్టూరులో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement