పశువులేగా తోలెయ్! | Sakshi
Sakshi News home page

పశువులేగా తోలెయ్!

Published Thu, Mar 3 2016 4:25 AM

పశువులేగా తోలెయ్! - Sakshi

సిబ్బంది చెక్‌పోస్టులో..అడ్డదారిలో పశువుల రవాణా
లారీల్లో కుక్కి... ఘోరంగామూగజీవాల తరలింపు
చేతులు మారుతున్న రూ.కోట్లుఅమలుకు నోచుకోని చట్టాలు
చోద్యం చూస్తున్నఅధికార యంత్రాంగం



 పెద్దఎత్తున జంతువుల అక్రమ రవాణా జరుగుతుంటే పోలీ సులు, అటు రెవెన్యూ, పశుసంవర్థక శాఖ అధికారులు ఏం చేస్తున్నట్లు.? రోజు మనకు పాలిచ్చే ఆవులను లారీల్లో కుక్కి హింసిస్తూ తరలిస్తుంటే కళ్లప్పగించి చూస్తున్నారా.? జంతువులపై జరుగుతున్న హింసాత్మక చర్యలను అడ్డుకోకపోవడం దారుణం..  - హైకోర్టు 


రోడ్డుపై లారీ ఊగుతూ మం దుకు కదిలిపోతోంది. లారీలోంచి అంబా..అంబా..అంటూ అరుపులు.. పశువుల మందను కుక్కేశారు. కొన్ని పశువుల మెడల నుంచి రక్తం కారుతోంది. తల ఎత్తేందుకు కూడా వీలులేకుండా తాళ్లతో బంధించారు. బాధతో రోదించి నోటి వెంట నురగ కారుతోంది. ఈ దృశ్యాలు ఎవరికైనా కళ్లు చెమర్చక మానదు. అయ్యో..పాపం అనకతీరదు.


నెల్లూరు(అగ్రికల్చర్) : మూగజీవాల రవాణాలో హింసను నివారించేందుకు ఎన్నో చట్టాలు వచ్చినా ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. మానవాళికి ఎంతో మేలు చేస్తున్న పశువులను కనీస కనికరం లేకుండా లారీల్లో కుక్కి తీసుకెళ్లే దృశ్యాలు నిత్యం హైవేపై కన్పిస్తునే ఉన్నాయి. జంతు ప్రేమికుల వేదన అరణ్య రోదనగానే మిగులుతోంది. వేలాదిగా ఫిర్యాదులు, కోర్టు వ్యాజ్యాల అనంతరం కొత్తగా ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి అమలులోకి వచ్చిన నిబంధనలు నేటికీ కార్యరూపం దాల్చలేదు.


లారీల్లో కుక్కి మూగజీవాల తరలింపు చర్యలు ఆగడం లేదు.  కబేళాకు పోతున్నాయి..
మూగజీవాల తరలింపులో నిబంధనలు తప్పక పాటించాని చట్టం చెబుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పశువుల సంతల నుంచి గేదెలు, దున్నలు, ఆవులు, ఇతర మూగజీవాలను కబేళాకు తరలిస్తుంటారు. ఏపీ నుంచి ఎక్కువగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పశువులను తరలిస్తుంటారు. జంతు హ క్కుల కార్యకర్తలు ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కొత్త చట్టానికి రూపకల్పన చేసింది. ఈ చట్టం ఈ ఏడాది జనవరి ఒకటో తారీఖు నుంచి అమలులోకి వచ్చింది.

నిబంధనలు ఇవీ..
ఆర్టీవో నుంచి అనుమతి పొందిన వాహనాల్లోనే పశువులను రవాణా చేయాల్సి ఉంటుంది.

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్ధేశించిన కొలతల మేరకు రవాణా వాహనంలో ప్రత్యేకక్యాబిన్‌నుఏర్పాటు చేయాలి.

దున్న లేదా ఆవు వంటివి తరలిం చేందుకు ఒక్కొక్క క్యాబిన్‌ను రెండు చదరపు మీటర్ల మేర ఏర్పాటు చేయాలి.

గుర్రాలకైతే 2.5 చ.మీ, గొర్రె, మేకలకు 0.3 చ.మీ, పందులకు 0.6 చ.మీ, కోళ్ల కోసం 40 సెంమీటర్ల వైశాల్యంతో కూడిన ప్రత్యేక క్యాబిన్‌లు ఉండాలి.

ప్రత్యేక లెసైన్స్ పొందిన వాహనాల్లో మాత్రమే మూగజీవాలను తరలించాలి.

పశువులను తరలించే వాహనాల్లో నీటి తొట్టి, పశుగ్రాసం ఏర్పాటు చేయాలి.

పశువుల ఆరోగ్యంపై స్థానిక వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ జారీచేసే సర్టిఫికెట్ తప్పనిసరి. పశువుల ఆరోగ్యం పరిరక్షణను పశుసంవర్థక శాఖ పర్యవేక్షించాలి.

చెక్‌పోస్టుల వద్ద జిల్లా నుంచి తరలిస్తున్న, జిల్లాకు తీసుకొస్తున్న పశువులను, జీవాల నుంచి వ్యాధులు వ్యాప్తిచెందకూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

  నిబంధనలు పాటించని పక్షంలో వాహనాలను సీజ్ చేయడంతో పాటు వాహన యజమానిపై కేసు నమోదు చేయాల్సి ఉంటుంది.

అక్రమరవాణాను అడ్డుకునేందుకు చెక్‌పోస్టుల్లో పోలీసు, రెవెన్యూ, రవాణా, పశుసంవర్థక శాఖల అధికారులు ఉమ్మడిగా తనఖీలు నిర్వహించాలి.

సిబ్బంది చెక్‌పోస్టులో... అడ్డదారిలో పశువుల తరలింపు
పశువుల రవాణాను పర్యవేక్షించాల్సిన అధికారులు తడ ఉమ్మడి తనిఖీ కేంద్రంలో ఉంటున్నారు. అయితే అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న వాహనాలు నాయుడుపేట మీదుగా ఇతర జిల్లాలకు ఆపై ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. జిల్లాకు రావాల్సిన ఆదాయానికి భారీస్థాయిలో గండిపడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. అక్రమ రవాణాదారులు మాఫియాగా ఏర్పడి నాయుడుపేట మీదుగా భారీస్థాయిలో పశువులను తరలిస్తున్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో గంటకు ఒక వాహనం చొప్పున తరలివెళ్తుందంటే ఏస్థాయిలో పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారో అర్ధమవుతుంది.

అమలుకాని నిబంధనలు...
జిల్లాలోని మనుబోలు సంత నుంచి ఒక్కనెలలోనే వేలాది పశువులు తరలివెళ్తుంటాయి. వీటిని తరలిం చే క్రమంలో నిబంధనలు అమలు కాకపోవడంపై జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలి....
ఎన్ని జంతువులను రవాణా చేసింది తదితర వివరాలను పర్యవేక్షించేందుకు సంత పర్యవేక్షణ కమిటీల ను ఏర్పాటు చేయాలి. ఇప్పటికే పశుసంవర్థక శాఖ ఈ మేరకు జీఓ నం. 23ను 2015 అక్టోబర్ 1న జారీ చేసింది. ప్రతినెల ఈ కమిటీ ద్వారా ఏపీసీఏ(సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్) చైర్మన్ అయిన కలెక్టర్‌కు నివేదిక అందజేయాల్సి ఉంటుంది.

మా దృష్టికి రాలేదు :
పశువులను నాయుడుపేట మీదుగా తరలిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. తనిఖీ కేంద్రాల వద్ద పశువులకు ఆరోగ్యపరీక్షలు చేస్తున్నాం. తనిఖీలు ముమ్మరం చేస్తాం. పశువులు తరలించే వాహనాల్లో నీటి సదుపాయం, పశుగ్రాసం కచ్చితంగా ఉండాలి. ఏ పశువును తరలించాలన్నా స్థానిక పశువైద్యుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి.
- శ్రీధర్‌కుమార్, పశుసంవర్థకశాఖ జేడీ

Advertisement
Advertisement