Sakshi News home page

దోచుకున్నోడికి దోచుకున్నంత !

Published Fri, Oct 18 2013 12:05 AM

illegal sand mafia in yacharam

 యాచారం, న్యూస్‌లైన్:
 చెట్లు, ఇసుక, మట్టి, రాళ్లు... దోచుకున్న వాడికి దండిగా కాసులు కురిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ఫిర్యాదులు అందినా పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా తమ దందాను కొనసాగిస్తున్నారు. మండలంలో పలు గ్రామాల్లోని ప్రభుత్వ భూములపై కన్నేసిన వీరు, మట్టి, రాళ్లు, చెట్లు వేటినీ వదలడం లేదు. అధికారులను ప్రసన్నం చేసుకొని కొల్లగొడుతున్న వనరులను తరలించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ వ్యాపారం కొన్నేళ్లుగా సాగుతున్నా, నిరోధించడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మళ్లీ ఇటుక బట్టీల వ్యాపారం షురూ కావడంతో అక్రమార్కుల కన్ను చెరువులు, కుంటలపై పడింది. చింతుల్ల, ధర్మన్నగూడెంలలోని కుంటల నుంచి వందలాది ట్రాక్టర్ల మట్టిని తరలిస్తున్నారు.
 
  యాచారం, నందివనపర్తి, చౌదర్‌పల్లి తదితర గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో ఎర్రమట్టి తవ్వుకుంటున్నారు. యాచారం, తక్కళ్లపల్లి, మొండిగౌరెల్లి, తక్కళ్లపల్లి, కొత్తపల్లి, నక్కర్తమేడిపల్లి, మాల్ తదితర గ్రామాల్లో  ప్రభుత్వ భూముల్లోని గుట్టల్లో రాళ్లను పగులగొట్టి గ్రానైట్‌గా మార్చి అమ్ముకుంటూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. వాగుల్లోంచి ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గునుగల్, గడ్డమల్లయ్యగూడ, నల్లవెల్లి, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల అటవీ ప్రాంతాల్లోని భూముల్లో మట్టి తవ్వకాలు, చెట్లు నరికి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి అక్రమార్కుల అగడాలకు కళ్లెం వేయాలని కోరుతున్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement