కొల్లేరులో ఆగని రగడ | Sakshi
Sakshi News home page

కొల్లేరులో ఆగని రగడ

Published Mon, Mar 16 2015 1:53 AM

Illegally dug a fish pond in Collina

మరోసారి చేపలు పట్టిన గ్రామస్తులు
  తెరవెనుక ఓ ప్రజాప్రతినిధి !
 
 ఏలూరు రూరల్ : కొల్లేరులో అక్రమంగా తవ్విన చేపల చెరువు విషయమై మరోసారి రగడ చోటుచేసుకుంది. ఓ ప్రజా ప్రతినిధి అండతో రెండేళ్లకు పైగా సాగుతున్న ఈ గొడవ లంక గ్రామాల ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఆదివారం గ్రామస్తులు వివాదాస్పద చెరువులో చేపలు పట్టేందుకుప్రయత్నించడంతో గొడవ మరోసారి రాజుకుంది. ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత ఆధ్వర్యంలో పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఉదయం 9 గంటలకు గ్రామస్తులు 16 ఎకరాల విస్తీ ర్ణంలోని చెరువులో చేపలు పట్టేందుకు ఉపక్రమిం చారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ ఘంటసాల మహలక్ష్మిరాజు వర్గీయులు చెరువు తమదంటూ అడ్డుపడ్డారు. దీన్ని గ్రామస్తులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. చేపలు పట్టేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని గ్రామస్తులు ఆర్డర్ కాపీ చూపించారు. దీనిపై స్పందించిన మాజీ సర్పంచ్ వర్గీయులు హైకోర్టులో తప్పుడు కౌంటర్లు వేయించి ఆర్డర్ తెచ్చుకున్నారంటూ దుయ్యబట్టారు. చివరకు పోలీసుల సహకారంతో గ్రామస్తులు సుమారు 12 టన్నుల చేపలు పట్టి తరలించారు. దీనిపై మాజీ సర్పంచ్ వర్గీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమకు చెందిన చెరువులో చేపలను పట్టుకుపోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత మహలక్ష్మిరాజు పలువురిపై ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
 నాయకులే సూత్రధారులు
 సుమారు రెండేళ్లుగా సాగుతున్న ఈ రగడకు నాయకుల కనుసన్నల్లో అధికారులే సూత్రధారులుగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఈ గ్రామంలోని వివాదాస్పద చేపల చెరువులు కొల్లేరు అభయారణ్య పరిధిలో ఉన్నాయి. ఐదేళ్ల క్రితం కొల్లేరులో సాగిన అక్రమ తవ్వకాలను అటవీ శాఖ అధికారులు చూసీచూడనట్టు వదిలేశారు. తర్వాత ఈ చెరువులకు రెవెన్యూ అధికారులు 254/1, 255/1 లాంటి తప్పుడు సర్వే నంబర్లతో పట్టాలు మంజూరు చేశారు. వీటిని ఆధారం చేసుకుని మత్స్య శాఖ అధికారులు అనుమతులు ఇచ్చేశారు. ఈ తతంగాన్ని చేతులు మారిన డబ్బు సంచులు నడిపించాయన్న సంగతి జగమెరిగిన సత్యం. దీనివెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారు. నేడు ఈ చెరువుల్లో కోట్లాది రూపాయల విలువైన చేపలు ఉన్నాయి. దీంతో ప్రలోభాలకు గురైన అధికారులు చెరువు అభయారణ్య పరిధిలో ఉందని చెప్పడం లేదు. ఓ ప్రజాప్రతినిధి వెనకుండి కథ నడిపించడం మరో కారణం. ఇదే అదునుగా చేపలు పట్టేందుకు గ్రామస్తులు కోర్టులో పిటీషన్ వేశారు. కోర్టు అధికారులను వివరణ అడిగింది. అధికారులు సైతం తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో చేపలు పట్టేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని మహలక్ష్మిరాజు చెబుతున్నారు. దీన్ని పరిష్కరించేందుకు చొరవ చూపకపోవడంతో ఈ రగడ ఎక్కడకు దారి తీస్తుందోనని లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
 

Advertisement
Advertisement