వెనుకబాటుతనానికి అవిద్యే కారణం | Sakshi
Sakshi News home page

వెనుకబాటుతనానికి అవిద్యే కారణం

Published Fri, Apr 24 2015 4:17 AM

Illiteracy is main cause of backward people

మంత్రి రావెల కిషోర్‌బాబు

భవానీపురం : నిరక్షరాస్యత, అవిద్యే వెనుకబాటుతనానికి కారణమని సాంఘిక, గిరిజన శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. ఏపీ ట్రైబల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం జరిగిన ఆదివాసీ ఆత్మగౌరవ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. వెనుకబాటు తనానికి కారణం నిరక్షరాస్యతేనని గుర్తించి రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నారు.

ప్రకృతిలోని సహజ వనరులను కంటికి రెప్పలా కాపాడేది గిరిజనులేనని అన్నారు. మారుతున్న కాలానుగుణంగా ఆదివాసీలు కూడా మార్పు చెందాలన్నారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మసర్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు గడిచినా ఆదివాసీలలో అక్షరాస్యత పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు కమిషన్లు ఉన్నాయి గానీ గిరిజనులకు లేకపోవడం విచారకరమన్నారు.

అధికారుల అలసత్వం, గిరిజనుల అవగాహన లోపంతో వారికి అందాల్సిన సంక్షేమ పథకాల ఫలాలు అందడం లేదన్నారు. రాజకీయంగా ప్రోత్సాహం లేకపోవడం వల్ల కూడా గిరిజనులు వెనుకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పందుల పెంపకం తదితర కుల వృత్తులకు రుణాలు, రాయితీలు అందటం లేదని ఆరోపించారు. సభ తొలుత 3 గంటలకు ప్రారంభమవుతుందని ప్రకటించగా రాత్రి 7 గంటలకు గానీ ప్రారంభం కాలేదు.

సభను నిర్వాహకుడు ప్రారంభించిన అనంతరం మంత్రి రావెల దాదాపు గంటసేపు ప్రసంగించడంతో ఆడిటోరియంలోని ఆహూతులు, వేదికపై ఆశీనులైనవారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ దేవర సుబ్బారావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌రావు, బొండా ఉమామహేశ్వరరావు, జేసీ గంధం చంద్రుడు, పలువురు గిరిజన నాయకులు పాల్గొన్నారు.

ఆత్మ గౌరవ సభ కాదు.. ఆత్మ వంచన సభ :ఎమ్మెల్యే సర్వేశ్వరరావు
ఇది గిరిజనుల ఆత్మ గౌరవ సభ కాదు.. ఆత్మ వంచన సభగా భావిస్తున్నానని అరకు ఎమ్మెల్యే కె.సర్వేశ్వరరావు చేసిన ప్రసంగం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు.. గిరిజనులకు ఏడాది కాలంలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని అనడంతో ఆడిటోరియంలో చప్పట్లు మార్మోగాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఎంతమంది గిరిజనులను ఇంజనీరు, డాక్టర్లు, ఐఏఎస్‌లను చదివిస్తున్నారు.. ఎంతమందికి ఇళ్లు కట్టిచ్చారని మంత్రి రావెలను ప్రశ్నించారు.

గిరిజన ప్రాంతాల్లో మలేరియా, టైఫాయిడ్, ఆంత్రాక్స్ వంటి వ్యాధులతో చని పోతున్న గిరిజనులకు ఎటువంటి వైద్య సౌకర్యాలు కల్పించారని అడిగారు. అక్కడ హాస్పటల్స్ ఉండవు.. ఉంటే వైద్యులు ఉండరు... వారుంటే మందులు ఉండవు. ఇలా ఎంత కాలం గిరిజనులను మోసం చేస్తారని ధ్వజమెత్తారు. మన తలరాతలను మార్చే నేతలు కావాలి గానీ, ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే నాయకులు కాదన్నారు. నగరాల్లో గ్రామాలను దత్తత తీసుకోవడం కాదు, గిరిజన కుటుంబాలను ఎంతమంది దత్తత తీసుకుంటున్నారని ప్రశ్నించారు.

ఏ ప్రభుత్వమైనా గిరిజనులను విభజించి పాలిస్తూ వారి పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాలలో బాక్సైట్ తవ్వకాల వల్ల ఎంతోమంది గిరిజనులు ఊళ్లు వదిలిపెట్టి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులు ఎక్కువగా ఉండే విశాఖపట్నం ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల వల్ల ఆదిమవాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఈ విషయమై మంత్రిగారు హైదరాబాద్‌లో ఒకమాట, బయటకు వస్తే మరోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా మన జాతి అభివృద్ధికి మనమేం చేయాలి అన్నదాని గురించి ఆలోచిస్తే బాగుంటుందని హితవు పలికారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement