Sakshi News home page

మార్మోగిన హోదా నినాదం

Published Sun, Apr 15 2018 7:14 AM

Immense Response To YSR Congress Relay Hunger Strikes - Sakshi

పట్నంబజారు(గుంటూరు): జిల్లాలో ప్రత్యేక హోదా నినాదం మార్మోగుతోంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే  నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని హోదా ఆకాంక్షను చాటిచెబుతున్నారు. సత్తెనపల్లి తాలుకా సెంటర్‌ వద్ద యువత, విద్యార్థులు, దివ్యాంగులు చేపట్టిన దీక్షలను పార్టీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ హోదా కోసం ఐదు కోట్ల మంది ప్రజలు పోరాడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపట నాటకాలు ఆడుతున్నాయని దుయ్యబట్టారు. 

ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లుగా అలుపెరుగక పోరాడుతున్నారని వివరించారు. దివ్యాంగులు పట్టణంలోని మాచర్ల –గుంటూరు ప్రధాన రహదారిలో చేపట్టిన రాస్తారోకోలో అంబటి పాల్గొని సంఘీభావం తెలిపారు. పొన్నూరు ఐలాండ్‌ సెంటర్‌లో జరిగిన రిలేదీక్షలను గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ ప్రారంభించి మాట్లాడుతూ హోదా సాధించే వరకు పోరాటం ఆగదన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయం వద్ద 11 డివిజన్‌ అధ్యక్షుడు షరీఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన దీక్షలను నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా ప్రారంభించారు.

 హోదా కోసం ఎంతటి పోరాటానికైనా, త్యాగానికైనా తమ పార్టీ వెనుకడగు వేయదని ఎమ్మెల్యే ముస్తఫా స్పష్టం చేశారు. చిలకలూరిపేట కళామందిర్‌ సెంటర్‌లో జరిగిన రిలేదీక్షలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్‌ ప్రారంభించి ప్రసంగించారు. గుంటూరు లాడ్జిసెంటర్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అ«ధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పార్లమెంట్‌ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు వినతి పత్రం అందజేశారు. రాజ్యాంగ విలువలకు విఘాతం కలిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. చట్టాలు చేసి వాటిని అమలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

 ప్రత్తిపాడులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రిలేదీక్షలను మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ప్రారంభించారు. అనంతరం బస్టాండ్‌ సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి సుచరిత, పార్టీ నేతలు వినతిపత్రాన్ని అందజేశారు. బాపట్ల పోస్టాఫీస్‌ సెంటర్‌లో రిలేదీక్షలను పార్టీ మండలాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, పట్టణాధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశరావు ప్రారంభించారు. గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల ఐలాండ్‌ సెంటర్‌ వద్ద జరిగిన దీక్షలను పార్టీ నేత రేపాల శ్రీనివాసరావు ప్రారంభించారు. మాచర్లలో జెడ్పీటీసీ సభ్యుడు గోపిరెడ్డి, పార్టీ నాయకుడు ఏడుకొండలు, మరికొంత మంది కలిసి అంబేడ్కర్‌ పార్క్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. 

తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌ నేతృత్వంలో రైల్వేస్టేషన్‌ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. వేమూరు నియోజకవర్గంలో వేమూరు బస్టాండ్‌ సెంటర్‌లో పార్టీ నేతల ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. తాడికొండ నియోజకవర్గంలోని అడ్డరోడ్డు సెంటర్‌లో జరిగిన దీక్షలను మండల పార్టీ అధ్యక్షుడు తియ్యగూర బ్రహ్మారెడ్డి ప్రారంభించారు. ముస్లిం మైనారిటీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Advertisement
Advertisement