తిరుమల భద్రతలో రాజీపడొద్దు | Sakshi
Sakshi News home page

తిరుమల భద్రతలో రాజీపడొద్దు

Published Fri, Jul 21 2017 10:57 AM

తిరుమల భద్రతలో రాజీపడొద్దు - Sakshi

► అత్యాధునిక పరికరాలు తెప్పించుకోండి
► టీటీడీ భద్రతాధికారులతో ఈఓ సింఘాల్‌ ఆదేశం


తిరుపతి అర్బన్‌ : తిరుమల పుణ్యక్షేత్రం తో పాటు యాత్రికులకు భద్రత కల్పించడంలో రాజీ పడొద్దని టీటీడీ భద్రతాధికారులకు ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సూచించారు. వివిధ భద్రతాపరమైన అంశాలపై గురువారం ఆయన తిరుపతి పరిపాలనా భవనంలో సీవీఎస్‌ఓ రవి కృష్ణ, ఇతర అధికారులతో సమీక్షించారు. ఈఓ మాట్లాడుతూ భక్తుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తిరుపతి, తిరుమలలో ఉన్నతమైన భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. శ్రీవారి ఆలయం, ఘాట్‌ రోడ్లు, నడక మార్గాలు, తిరుపతిలోని టీటీడీ సంస్థల్లో భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన భద్రతా పరికరాలు కొనుగోలు చేయాలని ఆదేశించారు. ప్రధానంగా అలిపిరి టోల్‌గేట్‌ చెక్‌ పాయింట్, అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ కలిగిన అధునాతన సీసీ కెమెరాలు, టీవీలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న సీసీ టీవీల్లో అప్‌గ్రేడ్‌ చేయాల్సినవి, పూర్తిగా మార్పు చేయాల్సిన వాటి వివరాలను రూపొం దించుకోవాలని సూచించారు. భద్రతా పరికరా ల నాణ్యతను పరిశీలించేందుకు నోయిడా నుంచి భద్రతా నిపుణులను రప్పించాలన్నారు. వాటికి అనుసంధానించే సాంకేతిక పరిజ్ఞానం అంశంలో హెచ్‌సీఎల్‌ సంస్థ ప్రతినిధుల సహకారం తీసుకోవాలని చెప్పారు.

బ్రహ్మోత్సవాల్లోపు సీసీ టీవీల ఏర్పాటు  
తిరుమలలో అధునాతన సీసీ టీవీలు బ్రహ్మోత్సవాల్లోపు ఏర్పాటు చేయాలని ఈఓ సింఘాల్‌ ఆదేశించారు. సీసీ టీవీలు, ఇతర భద్రతా పరికరాలను సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేయాలన్నారు. తద్వారా నిరంతరం తిరుమల భద్రతను పర్యవేక్షించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌–1లో డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్‌(డీఎఫ్‌ఎండీ) పరికరాలు, అత్యాధునిక లగేజీ స్కానర్లు త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. భద్రతా పరికరాల వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాస రాజు, హెచ్‌సీఎల్‌ మేనేజర్‌ సాయికృష్ణ,  పలు వురు భద్రతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement