15 రోజుల్లో.. పాస్‌పోర్టు | Sakshi
Sakshi News home page

15 రోజుల్లో.. పాస్‌పోర్టు

Published Sun, Feb 9 2014 2:54 AM

In 15 days..pass port

కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజుల్లో పాస్‌పోర్టు అందేట్లు చర్యలు తీసుకోనున్నట్ల్లు జాతీయ పాస్‌పోర్టు అధికారి ముక్తేశ్‌కుమార్ పర్‌దేశి తెలిపారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మినీ పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. దరఖాస్తుల పరిశీలనకు పోలీసు యంత్రాంగం పదిహేను రోజుల సమయం తీసుకొనేదని, పాస్‌పోర్టు అందుకొనేసరికి నెల రోజుల సమయం పట్టేదన్నారు.
 
 దరఖాస్తుల  పరిశీలన ఏడు రోజుల్లోనే ముగిస్తామని ఎస్‌పీ హామీ ఇచ్చారని, అలా అయితే పదిహేను రోజుల్లోనే దరఖాస్తుదారుడి ఇంటికి పాస్‌పోర్టు చేరవేస్తామన్నారు. మరో రెండు నెలల్లో కరీంనగర్ పాస్‌పోర్టు కేంద్రం ద్వారా పూర్తిస్థాయిలో సేవలందిస్తామన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే పదిహేను రోజులకోసారి స్లాట్ (దరఖాస్తుదారుడికి టైం) ఇస్తామన్నారు. స్లాట్‌కు అనుగుణంగా కార్యాలయానికి వ స్తే సర్టిఫికెట్ల పరిశీలన, ఫొటోలు, థంబ్‌ఇంప్రెషన్ తదితర ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరిక మేరకు ఏడు రోజులకోసారి క్యాంప్ నిర్వహించే అవకాశాన్ని రాష్ట్ర అధికారులు పరిశీలిస్తారన్నారు. పాస్‌పోర్టు సేవలు ఇటీవల కాలంలో పురోగతి చెందాయన్నారు. తెలుగు భాషలో వెబ్‌సైట్, టోల్‌ఫ్రీనెంబర్ రూపొందిస్తున్నామని, దరఖాస్తుదారులు తెలుగులోనే సమాచారం తెలుసుకోవచ్చన్నారు. దేశంలో 77 కేంద్రాలు, 10కి పైగా మినీ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్రం నుంచి పాస్‌పోర్టు కోసం ఎనిమిది లక్షల దరఖాస్తులు వస్తున్నాయని, ఈ సంవత్సరం అది తొమ్మిది లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్‌లో 3, నిజామాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలలో ఒక్కో పాస్‌పోర్టు కేంద్రాలున్నాయన్నారు.
 
 రెండు నెలల్లో పూర్తిస్థాయిలో
 సేవలు : పొన్నం
 రెండు నెలల్లో జిల్లాలో పూర్తిస్థాయిలో పాస్‌పోర్టు కేంద్రం సేవలందిస్తుందని ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2011లో అప్పటి మంత్రి ఎస్‌ఎం.కృష్ణ హామీ ఇస్తే, అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నో అనుమానాల నడుమ పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. కంప్యూటీకరణకు మరో రెండు నెలల సమయం పడుతుందని, అప్పటివరకు క్యాంప్‌లు నిర్వహిస్తారన్నారు. పదిహేనురోజులకోసారి కాకుండా ప్రతి శనివారం క్యాంప్‌లు నిర్వహించాలని అధికారులను కోరారు. దేశంలో మినీపాస్‌పోర్టు కేంద్రాలకు ఎన్నో ప్రతిపాదనలు వ చ్చినా రెండు మాత్రమే ఆచరణకు నోచుకున్నాయని, అందులో మిజోరాంలో ఒకటి కాగా, మరొకటి కరీంనగర్‌లో ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు.
 
 కరీంనగర్ తిరుపతి రైలు, కరీంనగర్‌కు బస్‌డిపో, పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటు తన రాజకీయ జీవితానికి తృప్తినిచ్చిన ప్రత్యేక అంశాలన్నారు. వీటితో పాటు కేంద్రీయ విద్యాలయం, బీడీ కార్మికులకు ఆసుపత్రి, నర్సింగ్‌కళాశాల ఏర్పాటు కూడా అందులో భాగమేనన్నారు. ఓ వైపు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తూనే, ప్రజల చిరకాలవాంఛ అయిన తెలంగాణ సాధన  కోసం పోరాటం చేస్తున్నానన్నారు. కేంద్ర మంత్రివర్గ ఆమోదంతో మరో మైలురాయి దాటామని, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని తమకు ప్రధాని హామీ ఇచ్చారన్నారు.
 
 ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ ఇంటి పేరులో అక్షరాలు తారుమారైనా సర్దుబాటు చేయాలని అధికారులను కోరారు. ఆరెపల్లి అనే ఇంటిపేరులో చివరన ఇంగ్లిష్ అక్షరాలు ఒకసారి వై అని మరోసారి ఐ అని రాస్తుంటారని, ఇలాంటి వాటికి మినహాయింపునివ్వాలన్నారు. పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన పొన్నం ప్రభాకర్‌కు జిల్లా ప్రజల పక్షాన అభినందనలు తెలిపారు. రీజినల్ పాస్‌పోర్టు అధికారి శ్రీకర్‌రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రం హైదరాబాద్ కార్యాలయ నియంత్రణలో కొనసాగుతుందన్నారు. ప్రతి సంవత్సరం 15 శాతం పాస్‌పోర్టు డిమాండ్ పెరుగుతుందన్నారు. కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ జిల్లా నుంచి ఏటా 30 వేల మంది విదేశాలకు వెళుతున్నారన్నారు. ఇలాంటి వారికి కరీంనగర్‌లో పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
 
 ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం మంచి సంప్రదాయమన్నారు. ఉపాధి వేటలో గల్ఫ్‌కు వెళ్లడం జిల్లాలో అలవాటేనన్నారు. విదేశాలకు వెళ్లడానికి దళారులను ఆశ్రయించొద్దన్నారు. ఎస్‌పీ శివకుమార్ మాట్లాడుతూ ఆన్‌లైన్ ప్రక్రియ చేయడానికి రూ.10 లక్షలు తమకు మంజూరు చేస్తే, ఏడు రోజుల్లోనే దరఖాస్తు పరిశీలనను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 14 రోజుల్లో పరిశీలన పూర్తి చేస్తున్న జిల్లా మనదేనన్నారు. పాస్‌పోర్టు తీసుకున్నాక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని సూచించారు.
 
 ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వేములవాడ దేవస్థానం చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్, డీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి, రాష్ట్ర మత్స పారిశ్రామిక సంస్థచైర్మన్ చేతి ధర్మయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పనకంటి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణగౌడ్, రేగులపాటి పాపారావు, నగరపాలకసంస్థ కమిషనర్ రమేశ్, జిల్లా పాస్‌పోర్టు అధికారులు అశ్విని, జైన్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డెరైక్టర్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్లు ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఏనుగు మనోహర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జుబేర్, మాజీ మేయర్ డి.శంకర్ పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement