పింఛనుదారులపై పిడుగు | Sakshi
Sakshi News home page

పింఛనుదారులపై పిడుగు

Published Sat, Apr 2 2016 12:47 AM

పింఛనుదారులపై పిడుగు

జిల్లాలో 1251 మంది పింఛను నిలిపివేత
సాకుగా ఆధార్ నంబర్లు లబోదిబోమంటున్న లబ్ధిదారులు

 
సామాజిక భద్రత పింఛన్ల కోత మళ్లీ మొదలైంది. రకరకాల సాకులతో ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో కోత విధిస్తూ వస్తోంది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అర్హత ఉన్నప్పటికీ పింఛను పొందేందుకు అనర్హతకు గురవుతున్నారు. భారం తగ్గించుకోవాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్లు రద్దు చేస్తూ వస్తోంది. ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా  13,434 మందికి పింఛన్లు నిలిపివేసింది. కేవలం పింఛను సొమ్ముపై ఆధారపడి జీవిస్తున్న అనేక మంది పేదలు పిడుగులాంటి వార్తతో అల్లాడిపోతున్నారు.
  
నరసరావుపేటరూరల్ :
జిల్లాలో 3లక్షలా 14వేల 292 మందికి ప్రతి నెలా పింఛను అందిస్తున్నారు. ఇందులో 1251మందికి ఈ నెలలో పింఛను నిలిపివేశారు. ఎటువంటి సమాచారం లేకుండా పింఛను నిలిపివేయడంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నకిలీ ఆధార్ కార్డులు అందజేయడం వల్లే పింఛన్లు నిలిపి వేసినట్లు అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులు అందజేసిన ఆధార్ కార్డు నంబర్లను సర్వర్లు తీసుకోవడం లేదని అంటున్నారు. కొంత మంది సర్వీస్ ప్రొవైడర్లు నకిలీ ఆధార్‌కార్డులను పంపిణీ చేసారని తమ దృష్టికి వచ్చినట్టు పేర్కొన్నారు. వీటిని అరికట్టేందుకే పింఛన్లు నిలిపివేసినట్టు తెలిపారు. పూట గడవక అల్లాడే పేదలు ప్రభుత్వం అందించే పింఛను కోసం ఎదురు చూస్తుండగా పిడుగులాంటి వార్తను ప్రభుత్వం వారినెత్తిన పడేసింది.
 
 ఆధార్‌లను సరిచేసుకోండి..
పింఛన్లు నిలిచిపోయిన లబ్ధిదారులు తమ ఆధార్ నంబర్లను సరిచేసుకోవాలని ప్రసాద్  కోరారు. నకిలీ ఆధార్ నంబర్ల నిలిపివేతలో భాగంగా లబ్ధిదారులు తమ  ఆధార్ ఎన్‌రోల్ మెంట్ ఐడీలను సంబంధిత కేంద్రాలకు తీసుకొచ్చి సరైన ఆధార్ సంఖ్యను పొందాలన్నారు.  
 ప్రసాద్, ఏపీవో, జిల్లా పింఛన్ల పంపిణీ విభాగం

Advertisement

తప్పక చదవండి

Advertisement