సోనియా.. సోనియా.. | Sakshi
Sakshi News home page

సోనియా.. సోనియా..

Published Thu, Nov 14 2013 4:00 AM

In gratitude Assembly , sonia....sonia ..

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :  సోనియా.. సోనియా.. సోనియా..! బుధవారం నిర్మల్ ఎన్‌టీఆర్ మినీ స్టేడియంలో జరిగిన తెలంగాణ కృతజ్ఞత సభలో ఆద్యంతం సోనియా నామస్మరణే. తెలంగాణ స్థాయిలో జరిగిన సభలో మాట్లాడిన నేతలందరూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పేరును ప్రస్తుతించారు. ‘సోనియా తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకున్నారని.. మనసెరిగి నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.
సుమారు మూడున్నర గంటలపాటు సాగిన సభలో వివిధ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ కృషి ఫలితమేనని శ్రేణుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొదటి నుంచి ప్రణాళికబద్ధంగా సభకు ఏర్పాటు చేసిన జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలను తరలించడంలో సఫలీకృతులయ్యారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సభాస్థలికి జనం వచ్చారు. మూడు గంటలకు నేతల ప్రసంగాలు మొదలయ్యాయి.
 ఆకట్టుకున్న జైపాల్‌రెడ్డి ప్రసంగం
 ‘తెలంగాణ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి.. వాటిని ఆపడం ఎవరి తరం కాదు.. వాటికి అడ్డం పడాలని ప్రయత్నించే వారికి కష్టాలు, నష్టాలు తప్పవు.. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి తీరుంది..’ అంటూ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఆయన చేసిన ప్రసంగం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులను ఉత్సాహపరిచింది. జిల్లా కాంగ్రెస్ నేతల అంచనాల కంటే ఒకింత తక్కువ జనం వచ్చినా.. ఎన్టీఆర్ మినీ స్టేడియం జనంతో కిటకిటలాడింది. ఫజల్ అలీ కమిటీ సిఫార్సుల నుంచి మొదలు పెట్టి.. నేటి రాజకీయ పరిణామాల వరకు ఏకరువు పెట్టిన మంత్రులు, ఎంపీలు చరిత్రక మార్పుల ప్రకారం ముందుకు వెళ్తున్నామంటూ సానుకూలతగా చెప్పారు. కార్యకర్తలు, అభిమానుల్లో నూతనోత్సాహాన్ని నింపేలా సభకు హాజరైన నేతలు ప్రసంగించారు.

 సభకు హాజరైన ఏఐసీసీ పరిశీలకులు రామచంద్ర కుంతియా మొదలుకుని మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్, మంత్రులు డీకే అరుణ, గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు, ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య సోనియాగాంధీపై పొగడ్తల జల్లులు కురిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన వెలువడిన నేపథ్యంలో సోనియాకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన సభ ఆమెను పొగిడేందుకే పరిమితమైంది.
 కిరణ్, చంద్రబాబులపై విమర్శలు
 నిర్మల్‌లో కృతజ్ఞత సభలో టీ-కాంగ్రెస్ నేతలు సీఎం కిరణ్, చంద్రబాబులపై నిప్పులు చెరిగారు. తెలంగాణ మంత్రులను సంప్రదించకుండా సీఎం కిరణ్ కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారన్నారని విమర్శించారు. సీనియర్ నేతలను విస్మరించి ఆంధ్రప్రదేశ్ నోట్‌ను ఆయన ఎలా పంపిస్తారని నిలదీశారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నేరుగా సీఎంపై వాగ్భాణాలు, హెచ్చరికలు సంధించినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం కనబడింది. రచ్చబండంటూ మళ్లీ తెలంగాణ జిల్లాల్లో తిరిగితే రచ్చరచ్చవుతుందని వారు పరోక్షంగా సీఎం కిరణ్‌ను హెచ్చరించారు.

మంత్రి డీకే అరుణ సూటిగా హైదరాబాద్ యూటీగా, భద్రాచలాన్ని సీమాంధ్రలో కలిపితే ఎవరూ ఒప్పుకోరని చెప్పడంతో చప్పట్లు మారుమోగాయి. రచ్చబండ సభల్లో సీఎం ఫ్లెక్సీలు, ఫొటోలు నిషేధించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నప్పుడు కూడా సభ చప్పట్లతో మారుమోగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేతలపై విమర్శలు చేస్తూ హైకమాండ్‌ను తప్పుదారి పట్టించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని డి.శ్రీనివాస్ దుయ్యబట్టారు. ఇక్కడ నివసించే సీమాంధ్రులు మా కుటుంబసభ్యులు, సీమాంధ్ర ప్రజలు మాకు బంధువులంటూ సానుకూలతను ప్రదర్శించారు. 2004 ఎన్నికల ప్రచారంలో తిరిగినప్పుడు సోనియాగాంధీ ఇక్కడి ప్రజల ఆకాంక్షను గుర్తించారన్నారు. ఇంతకాలం ఎందుకు నాన్చుతున్నారని అన్నవారు.. ఇప్పుడు నిర్ణయం తీసుకున్న తర్వాత తొందరపడుతున్నారంటూ ‘యూ’టర్న్ తీసుకున్నారని చంద్రబాబుపై విమర్శలు చేశారు.

‘కొమురం భీమ్’ జిల్లాగా మార్పునకు హామీ ఇస్తున్నట్లు నాయకులు ప్రకటించడంతో సంతోషం వెల్లివిరిసింది. ఈ బహిరంగ సభలో కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, మంత్రులు డి.శ్రీధర్‌బాబు, బస్వరాజు సారయ్య, కె.జానారెడ్డి, డీకే అరుణ, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కి, సిరిసిల్ల రాజయ్య, నాయకులు, ప్రజాప్రతినిధులు నర్సారెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ఈరవత్రి అనిల్, గండ్ర వెంకటరమణ, చిన్నారెడ్డి, ప్రేంసాగర్‌రావు, రవీందర్‌రావు, సుల్తాన్‌అహ్మద్, నారాయణరావు పటేల్, దివాకర్‌రావు, యాదవరెడ్డి, భూపాల్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, వెంకట్‌రావు, మోహన్‌రెడ్డి, కుసుర్‌పాషా, ఆకుల లలిత పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement