Sakshi News home page

‘ఎస్‌బీక్యూ’లో అగ్నిప్రమాదం

Published Fri, Apr 18 2014 4:05 AM

‘ఎస్‌బీక్యూ’లో అగ్నిప్రమాదం - Sakshi

 ముగ్గురికి గాయాలు  రూ. 2 కోట్ల ఆస్తి నష్టం..
 
చిల్లకూరు, న్యూస్‌లైన్: ఎస్‌బీక్యూ ఉక్కు పరిశ్రమలోని విద్యుత్ ప్లాంట్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా, రూ.2కోట్లు ఆస్తి నష్టం వాటిల్లింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం అంకులపాటూరులోని ఎస్‌బీక్యూ ఉక్కు పరిశ్రమలో 40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఉంది.   ఉదయం మొదటి షిఫ్ట్ కార్మికులు విధులు నిర్వర్తిస్తుండగా కోల్ కన్వేయర్ హ్యాండ్లింగ్ సిస్టంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
 
బొగ్గును ప్లాంట్‌లోకి తీసుకెళ్లే కన్వేయర్ బెల్టులో రాపిడి జరగడంతో ఎగసిన మంటలు ఇరువైపులా ఉన్న బొగ్గుకు అంటుకోవడంతో ఒక్కసారిగా బెల్టు కాలిపోవడం ప్రారంభిం చింది. గమనించిన కార్మికులు రాజశేఖర్, చెన్నకేశవరెడ్డి, వికాస్ మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నించి గాయాలపాలయ్యారు. అప్రమత్తమైన సహచర కార్మికులు వెంటనే పరిశ్రమలోని అగ్నిమాపక సిబ్బందికి  సమాచారం అందించారు. అయితే గాలి వీస్తుండటంతో మంట లు నలువైపులా వ్యాపిం చాయి.
 
సమాచారం అందుకున్న గూడూరు, కోట అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని నాలుగు గంటలకు పైగా శ్రమించినా మంటలను అదుపు చేయలేకపోయారు. చివరకు ఇరువైపులా కన్వేయర్ బెల్టులను తొలగించడంతో కొంతమేర మంటలు అదుపులోకి వచ్చాయి. కోల్‌కన్వేయర్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌లో నిల్వ ఉన్న బొగ్గు మొత్తం కాలిపోయింది.  గాయపడిన కార్మికులు నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement