పార్ట్ టైం ఇనస్ట్రక్టర్ల నియామకంలో ఇష్టారాజ్యం | Sakshi
Sakshi News home page

పార్ట్ టైం ఇనస్ట్రక్టర్ల నియామకంలో ఇష్టారాజ్యం

Published Thu, Jun 19 2014 1:09 AM

పార్ట్ టైం ఇనస్ట్రక్టర్ల నియామకంలో ఇష్టారాజ్యం

  • నిబంధనలకు విరుద్ధంగానే...
  •  చక్రం తిప్పుతున్న ఎంఈవోలు
  • మచిలీపట్నం : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనతో పాటు కళలు, చేతివృత్తుల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు సర్వశిక్షా అభియాన్ ద్వారా పార్ట్ టైం ఇనస్ట్రక్టర్ల నియామకం జరుగుతోంది. ఈ నియామకాల్లో నిబంధనలను పక్కనపెట్టి ఎంఈవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వశిక్షా అభియాన్ ద్వారా ఆరోగ్య విద్య, కుట్లు, అల్లికలు, నృత్యం, నైతిక విద్య తదితరాలను విద్యార్థులకు నేర్పేందుకు జిల్లావ్యాప్తంగా 230 మంది ఇనస్ట్రక్టర్లను నియమించేందుకు అనుమతులొచ్చాయి.

    ఆర్ట్ ఎడ్యుకేషన్ విభాగంలో 99, పీఈటీలు 19 మంది, వర్క్ ఎడ్యుకేషన్ 112 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. వీరు 7, 8, 9 తరగతులు చదివే విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించాల్సి ఉంది. వంద మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో వీరి నియామకం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 230 పాఠశాలలను ఈ విద్యాసంవత్సరంలో గుర్తించి అక్కడ పార్ట్ టైం ఇనస్ట్రక్టర్లను నియమించాలని నిర్ణయించారు. ఇందుకు విధివిధానాలను సర్వశిక్షా అభియాన్ విడుదల చేసింది. ఎంపికైన ఇనస్ట్రక్టర్లకు నెలకు రూ. 6వేల  వేతనం చెల్లిస్తారు.
     
    నిబంధనలు ఉల్లంఘన...
     
    వంద మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలున్న ప్రాంతం నుంచే ఈ ఇనస్ట్రక్టర్లను ఎంపిక చేయాల్సి ఉంది. ఒకరి కంటే ఎక్కువ మంది దరఖాస్తు  చేసుకుంటే దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్న నైపుణ్యం ఆధారంగా ఎంపిక చేయాలి. ఈ బాధ్యతలను పాఠశాల కాంప్లెక్స్ చైర్మన్, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల యాజమాన్య కమిటీ  తీసుకుంటుంది.

    మండల పరిధిలో ఉన్న పాఠశాలల్లో పార్ట్ టైం ఇనస్ట్రక్టర్ల నియామక పర్యవేక్షణా బాధ్యతలను ఎంఈవోలకు అప్పగించారు. దీనిని తమకు అనుకూలంగా మలచుకున్న ఎంఈవోలు స్కూలు కాంప్లెక్స్ చైర్మన్, హెచ్‌ఎం, పాఠశాల యాజమాన్య కమిటీలను పక్కనపెట్టి తమ చిత్తానుసారం తమను ప్రసన్నం చేసుకున్న వారికి ఈ పోస్టులను కేటాయిస్తున్నారనే రోపణలు వస్తున్నాయి. పూర్తయిన జాబితాలను కలెక్టర్, డీఈవో, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారికి సమర్పించాల్సి ఉంది.
     
    వారు ఈ జాబితాలు సక్రమంగా ఉన్నాయో, లేదో పరిశీలించి తుది జాబితాను విడుదల చేస్తారు. అయితే పార్ట్ టైం ఇనస్ట్రక్టర్ల ఎంపికలో ఎంఈవోలకు కేవలం పర్యవేక్షణా బాధ్యతలను అప్పగించినప్పటికీ వారే అన్నీ తామై వ్యవహరిస్తూ జిల్లాలోని అధిక మండలాల్లో పెత్తనం చెలాయిస్తున్నారని ప్రతిభావంతులైన అభ్యర్థులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టిసారించి పార్ట్ టైం ఇనస్ట్రక్టర్ల  నియామక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
     

Advertisement
Advertisement