ఇల్లు గుల్లే! | Sakshi
Sakshi News home page

ఇల్లు గుల్లే!

Published Sat, Feb 7 2015 1:04 AM

ఇల్లు గుల్లే! - Sakshi

గగ్గోలు పెడుతున్న  గృహ వినియోగదారులు
 
మధ్య తరగతి ప్రజలపైనే 80 శాతం భారం పడే ప్రమాదం
ఉద్యమబాటలో విపక్షాలు..
జిల్లా అంతటా వెల్లువెత్తుతున్న నిరసనలు


విజయవాడ : విద్యుత్ చార్జీల పెంపు రూపంలో జిల్లా వాసులకు త్వరలోనే గట్టి షాక్ తగలనుంది. జిల్లాలోని విద్యుత్ వినియోగదారులపై నెలకు రూ.18 కోట్ల మేర భారం పడనుంది. వేసవిలో ఈ మొత్తం రూ.22 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఈ భారంలో ఎక్కువ  శాతం గృహ వినియోగదారులపైనే పడనుంది. నష్టాలను భర్తీ చేసేందుకు విద్యుత్ చార్జీలు పెంచాల్సిందేనని సదరన్ డిస్కం అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ఈ నెలాఖరు వరకు వివిధ జిల్లాల్లో విద్యుత్ చార్జీల పెంపుపై బహిరంగ విచారణ పేరుతో ప్రజాభిప్రాయాన్ని సేకరించి వచ్చే నెల నుంచి భారీ వడ్డనకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. ఒక వైపు ప్రజలపై భారం పడకుండా చూస్తామంటూనే.. ప్రభుత్వం మరోవైపు ఇందుకు పూర్తి భిన్నంగా విద్యుత్ చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోవడంతో జిల్లా అంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ చార్జీల పెంపు అంశం ప్రతిపాదనల దశలోనే ఉన్నప్పటికీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లాలోని రాజకీయ పార్టీలు ఉద్యమబాట పట్టాయి.

వేసవిలో మరింత పెరిగే అవకాశం..

జిల్లాలో విద్యుత్ శాఖ డివిజన్లు ఏడు ఉన్నాయి. వీటి పరిధిలో 13,67,121 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో కేటగిరీ-1(గృహ వినియోగం)లో సుమారు 13.30 లక్షలు ఉన్నాయి. కేటగిరీ-2 (వాణిజ్య కనెక్షన్లు) 26 వేలు, కేటగిరీ-3(పరిశ్రమలు)లో సుమారు 6వేల కనెక్షన్లు ఉన్నాయి. వీటిని విద్యుత్ శాఖ హైటెన్షన్(హెచ్‌టీ), లో టెన్షన్ లైన్( ఎల్-సెక్షన్)గా విభజించి నెలవారీగా విద్యుత్ వినియోగాన్ని బట్టి బిల్లులు నిర్ణయిస్తారు. గత నెలలో జిల్లాలో విద్యుత్ బిల్లులు రూ.135.69 కోట్లు వసూలయ్యాయి. ఈ మొత్తంలో ఎల్‌టీ కేటగిరీ నుంచి రూ.73.36 కోట్లు, హెచ్‌టీ కేటగిరీ నుంచి రూ.62.33 కోట్లు వచ్చింది. సాధారణంగా వేసవి మూడు నెలలు మినహా మిగిలిన సమయంలో సగటున నెలకు రూ.140 కోట్ల విద్యుత్ బిల్లు డిమాండ్ ఉంటుంది. వేసవిలో అయితే నెలకు రూ.180 కోట్ల నుంచి రూ.190 కోట్ల వరకు వస్తుంది. మార్చి నుంచి ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో డిస్కంల ప్రతిపాదనలకు అనుగుణంగా శ్లాబ్‌ల వారీగా చార్జీలు పెంచితే వేసవిలో నెలకు రూ.210 కోట్ల వరకు విద్యుత్ బిల్లులు చేరుతాయని అధికారుల అంచనా వేస్తున్నారు.
 
ప్రభుత్వ కార్యాలయాలపై అధిక భారం...


ప్రభుత్వ కార్యాలయాలపై కూడా విద్యుత్ చార్జీల భారం పడనుంది. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.93 కోట్ల మేర విద్యుత్ బకాయిలు వసూలు కావాల్సి ఉంది. మేజర్ పంచాయతీలు రూ.24.46 కోట్లు, మైనర్ పంచాయతీలు రూ.53.23 కోట్ల బకాయిలు ఉన్నాయి. చార్జీల పెంపు కారణంగా ఈ బకాయిలు రెండు నెలల్లోనే రూ.100 కోట్లకు చేరే అకాశం ఉంది.

నగరంలో 80శాతం భారం ప్రజలపైనే...

ప్రస్తుతం ప్రతిపాదించిన మేరకు విద్యుత్ చార్జీలు పెంచితే నగరంపై నెలకు సగటున రూ.2.45 కోట్ల భారం పడనుంది. వేసవిలో ఈ మొత్తం రూ.4కోట్లకు చేరే అవకాశం ఉంది. ఈ మొత్తంలో 80 శాతం గృహ వినియోగదారులపైనే పడనుంది.

Advertisement
Advertisement