ఫోన్‌ చేస్తారు.. దోచుకుంటారు.! | Sakshi
Sakshi News home page

ఫోన్‌ చేస్తారు.. దోచుకుంటారు.!

Published Fri, Jun 23 2017 4:36 PM

ఫోన్‌ చేస్తారు..  దోచుకుంటారు.!

► అవగాహన లోపంతో మోసపోతున్న జనం
► అధికమవుతున్న సైబర్‌ నేరాలు


రాయచోటి రూరల్‌: మారుతున్న కాలానుగుణంగా నేరాలు, దొంగతనాలు కొత్తరూపుదాల్చుతున్నాయి. దొంగలు అనేక వేషాలు మార్చుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్‌ నేరాలు అధికమైపోతున్నాయి. సులభంగా డబ్బు దోచుకునే మార్గాన్ని నేరగాళ్లు అలవర్చుకుంటున్నారు. ఇది నియంత్రించేందుకు పోలీసులు, బ్యాంకు వ్యవస్థలకు కూడా తలనొప్పిగా మారుతోంది.

  మొదట ఫోన్‌ రింగవుతుంది. లిఫ్ట్‌ చేసిన వెంటనే అవతల నుంచి మేము ఫలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం... అని అంటారు. బ్యాంకర్లు అనుకొని చెప్పండి సార్‌ ... అంటూ ఇవతలి నుంచి సమాధానం ... వెంటనే ఏటీఎం నంబర్‌ అడుగుతారు. మీ పిన్‌ నంబర్‌ బ్లాక్‌ అవుతోంది ...వెంటనే మీ నంబర్లు చెప్తే సరిచేస్తాం అంటూ వివరాలు రాబడతారు. అంతే నిమిషాల వ్యవధిలో .. పదే పది నిమిషాల్లో వారి మొబైల్‌కు మెసేజ్‌ వస్తుంది. అప్పటికే వారి ఖాతాలో నుంచి రూ.50వేలు. 1లక్ష రూపాయలు డ్రా చేసినట్లు తెలిసిపోతుంది. ఇవీ మన కంటికి కనపడని నేరాలు...

రాయచోటి పట్టణ పరిధిలోని కృష్ణాపురానికి చెందిన జ్ఞానం ప్రసాద్‌ అనే వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి దుండగులు గత నెలలో రూ.37వేలు కాజేశారు. బాధితునికి 8674848568 నంబర్‌ నుంచి ఫోన్‌ చేసిన దుండగులు , ఏటీఎం బ్లాక్‌ అయిందని, ఏటీఎం కార్డు పైన ఉన్న నంబర్‌ తెలియజేయమని అడిగారు. ఆ తరువాత కార్డుకు వెనుక వైపు ఉన్న మరో నంబర్‌ అడిగారు. రెండు నంబర్లు చెప్పిన తరువాత మొబైల్‌కు మూడు మెసేజ్‌లు వస్తాయని, వాటిని చెప్పమని సూచించారు. బాధితుడు ప్రసాద్‌ ఆ నంబర్లు వారికి తెలియజేశాడు. వెంటనే వరుసగా రూ.19,999లు, రూ.15,000లు, రూ.2వేలు మొత్తం రూ.37వేలు అతని ఖాతాల నుంచి లాగేసుకున్నారు.   

చిన్నమండెం మండలం చాకిబండ కస్పాకు చెందిన చిలకల సలాం అనే వ్యక్తికి కూడా సైబర్‌ నేరగాళ్లు మార్చి నెలలో ఫోన్‌ చేసి ఏటీఎం నంబర్‌ తీసుకున్నారు. అలాగే వన్‌టైం పాస్‌వర్డ్‌(ఓటీపీ) కూడా ఫోన్‌కు మేసేజ్‌ వస్తుందని చెప్పి, అతని ఖాతాలో ఉన్న రూ.47వేలను గంట వ్యవధిలోనే మూడు సార్లు తీసేసుకున్నారు. ఈ విషయంపై పోలీసులకు, బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంత వరకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఇలా ఎంతో మంది ప్రజలు సైబర్‌ నేరగాళ్ల మాయ మాటలకు బలవుతున్నారు. 

బ్యాంకు,ఏటీఎం వివరాలు ఎవ్వరికీ ఇవ్వకూడదు :
బ్యాంకు ఖాతాల వివరాలు, ఏటీఎం వివరాలు గోప్యంగా ఉంచుకోవాలి. ఎవరికీ ఇవ్వకూడదు. వాటిని ఇతరులకు తెలియజేస్తే మోసపోవాల్సి వస్తుంది. ఖాతాదారుల వివరాలను ఎప్పుడూ బ్యాంకర్లు అడగరని గుర్తించాలి. ఏటీఎం వివరాలు, ఓటీపీ(వన్‌టైం పాస్‌వర్డ్‌) వంటివి అడిగారంటే మోసం జరిగే అవకాశం ఉందని గ్రహించాలి. ఈ తరహా ఫోన్లువస్తే బ్యాంకు వద్దకు వచ్చి మాట్లాడతామని చెప్పాలి. డబ్బుపోయిన తర్వాత బాధపడే కంటే ముందే అప్రమత్తంగా ఉండాలి.  – డి.మహేశ్వర్‌రెడ్డి, అర్బన్‌ సీఐ, రాయచోటి

Advertisement
Advertisement