అటు దేశభక్తి.. ఇటు సమైక్యశక్తి | Sakshi
Sakshi News home page

అటు దేశభక్తి.. ఇటు సమైక్యశక్తి

Published Fri, Aug 16 2013 4:08 AM

Independence Day celebrations are united movement

 
‘భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు..’ అన్న ప్రతిజ్ఞలోని స్ఫూర్తిని అణువణువునా నిలుపుకొంటూనే.. ‘తెలుగుజాతి మనది.. నిండుగ వెలుగుజాతి మనది...’ అన్న పాటలోని సారాన్ని  నరనరానా నింపుకొన్నారు జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమకారులు. ఓపక్క స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాల్ని ఆవిష్కరిస్తూనే.. మరోపక్క సమైక్య పతాకాల్ని ఎగురవేశారు. పదహారో రోజు కూడా సమైక్య ఉద్యమం ముమ్మరంగా సాగింది.
 
 సాక్షి, రాజమండ్రి: సమైక్య ఉద్యమం హోరులో స్వాతంత్య్ర దిన వేడుకలు చిన్నబోయినా ఉద్యోగ, విద్యార్థి, వ్యాపార, కార్మిక, రాజకీయ వర్గాలు జాతీయ పతాకానికి వందనం చేసి  తమ దేశభక్తిని చాటారు. ఆ చేత్తోనే సమైక్య కేతనానికీ వందనం చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోమని నినదించారు. ప్రభుత్వోద్యోగులు సమ్మె చేస్తున్నప్పటికీ తమతమ కార్యాలయాల్లో జరిగిన జాతీయ పతాకావిష్కరణల్లో పాల్గొన్నారు. ఆ వెంటనే సమైక్య ఉద్యమాన్ని కొనసాగించారు. ప్రభుత్వం తమకు ప్రకటించిన ఉత్తమసేవా పురస్కారాలను తీసుకునేందుకు నిరాకరించారు.
 
 కాకినాడ కలెక్టరేట్‌లో అధికారికంగా జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనకుండా కలెక్టరేట్ వద్ద తాము కొనసాగిస్తున్న నిరశన శిబిరం వద్ద పతాకావిష్కరణ చేశారు. సమైక్య నినాదాలు చేశారు. కార్యాలయ ప్రధాన గేటు వద్ద నిరసన శిబిరం ఏర్పాటు చేసి పది మంది కవులతో ‘సమైక్యాంధ్రపె కవి సమ్మేళనం’ నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులు, పీఆర్ కళాశాల విద్యార్థులు, వీడియో గ్రాఫర్ -మిక్సింగ్ యూనిట్ సంఘం చేపట్టిన దీక్షలు కొనసాగాయి. ఆయా శిబిరాల వద్దనే జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. కాకినాడ రూరల్ మండలంలో తిమ్మాపురం పోలీస్‌స్టేషన్ వద్ద, వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం వద్ద జేఏసీ  చేపట్టిన  దీక్షలు కొనసాగుతున్నాయి. లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు తమ కార్యాలయం వద్ద జాతీయ, సమైక్య పతాకాలను పక్కపక్కనే ఎగురవేశారు.
 
 రాజమండ్రిలో..
 రాజమండ్రిలో రెవెన్యూ ఉద్యోగులు ఆర్డీఓ కార్యాలయం వద్ద జాతీయ పతాకంతో పాటు సమైక్య పతాకాన్ని కూడా ఆవిష్కరించారు.  అన్ని కార్యాలయాల వద్ద ఉద్యోగులు సమైక్య నినాదాలతో స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహించారు. ఏపీ ఎన్‌జీవోలు నగరంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం, ఆర్టీసీ డిపోల వద్ద ఆయా శాఖల ఉద్యోగులు నిరసనలు కొనసాగించారు. కోటగుమ్మం సెంటర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్, వ్యాపార సంస్థల జేఏసీలు వేర్వేరుగా చేపట్టిన నిరవధిక దీక్షలు 14వ రోజుకు చేరుకున్నాయి. మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా జేఏసీ ఫెడరేషన్, బార్ కౌన్సిల్ ఎదురుగా న్యాయవాదులు, దానవాయిపేట వద్ద మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు, వీఎల్ పురంలో అఖిల పక్షం, గోదావరి గట్టున ఈపీడీసీఎల్ ఎస్‌ఈ కార్యాలయం వద్ద విద్యుత్తు శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. మూడు సినిమాహాళ్ల సెంటర్ వద్ద బాబూ జగ్జీవన్‌రాం యువజన సంఘం వంటావార్పూ చేపట్టారు. అంతకు ముందు మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. రాజమండ్రి రూరల్ పరిధిలోని ధవళేశ్వరంలో జేఏసీ ఆధ్వర్యంలో ఎన్‌జీవోల నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు వారికి సంఘీభావం తెలిపారు. బొమ్మూరులో రెవెన్యూ సిబ్బంది తహశీల్దారు భీమారావు ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. రూరల్ మండలంలో పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రైస్తవ సంఘాలు సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ చేశారు. 
 
 కోనసీమలో..
 అమలాపురంలో గడియారస్తంభం సెంటర్ వద్ద కొనసాగుతున్న నిరవధిక రిలే దీక్షల్లో పెన్షనర్ల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. పేరూరు గ్రామ కొబ్బరి వొలుపు కార్మికులు పట్టణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అల్లవరం, మొగల్లమూరు, ఓడలరేవుల్లో విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ చేశారు. ఉప్పలగుప్తం మడలం గొల్లవిల్లిలో యువకులు స్వచ్ఛందంగా చేపట్టిన నిరవధిక దీక్షలు రెండో రోజుకు చేరాయి. ముమ్మిడివరంలో జేఏసీ నేతలు పెన్మత్స జగ్గరాజు, కోనా శ్రీనివాసరావు, బీవీఆర్ చౌదరిల ఆధ్వర్యంలో సమైక్యవాదులు గుండు గీయించుకుని రాష్ట్ర విభజన పట్ల నిరసన వ్యక్తం చేశారు. తహశీల్దారు కార్యాలయం వద్ద కొనసాగుతున్న నిరస శిబిరంలో జేఏసీ నేతలు సమైక్యాంధ్ర పతాకాన్ని ఆవిష్కరించారు. దీక్షల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఐ.పోలవరం, కాట్రేనికోన, తాళ్లరేవు గ్రామాల్లో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. కొత్తపేటలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆలమూరు, ఆత్రేయపురం మండల కేంద్రాల్లో టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. అంబాజీపేటలో జేఏసీ దీక్షలు నాలుగవ రోజుకు చేరాయి. రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో మామిడికుదురు వద్ద 216 జాతీయ రహదారిపైన, పెదపట్నం లంక, ఆదుర్రు గ్రామాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్షలు, ర్యాలీలు కొనసాగాయి. రాజోలులో ఎన్‌జీఓలు నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. సఖినేటిపల్లి సెంటర్‌లో స్థానిక అంబేద్కర్ యూత్ రాస్తారోకో చేసింది.
 
 ఎమ్మెల్యే పెందుర్తి వినూత్న నిరసన
 రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్  సీతానగరంలో కస్తూర్బా ఆశ్రమం ఎదురుగా గాంధీలా కర్ర చేతపట్టి ఎనిమిది గంటల పాటు నిలబడి వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. పిఠాపురంలో పాస్టర్లు, కొత్తపల్లిలో వికలాం గులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. కొత్తపల్లి మండలంలో ఉద్యోగులు తమకు ప్రకటించిన ఉత్తమ సేవా అవార్డులను తిరస్కరించారు. తునిలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు తహశీల్దారు కార్యాలయం వద్ద జాతీయ పతాకంతో పాటు సమైక్య పతాకాన్ని ఆవిష్కరించి  నినాదాలు చేశారు. ఏలేశ్వరం మండలంలో విద్యార్థులు ధర్నా చేశారు. జగ్గంపేట బస్టాండ్ సెం టర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో 13వ రోజు దీక్షలు కొనసాగాయి. అనపర్తిలో స్వాతంత్య్ర దినవేడుకల్లో ఉద్యోగులు, విద్యార్థులు సమైక్య నినాదాలు వినిపించారు. 
 
 బిక్కవోలులో నేతాజీ పబ్లిక్ పాఠశాల ఆవరణలో ఓ చిన్నారిని తెలుగుతల్లి వేషధారణతో అలంకరించి ర్యాలీ చేశారు. మండపేటలో ఉద్యోగ జేఏసీలు ర్యాలీలు చేశాయి. రామచంద్రపురంలో కళాకారులు ర్యాలీ చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జేఏసీ శిబిరంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మంత్రి తోట నరసింహం పాల్గొన్నారు.  కె.గంగవరం మండలం కూళ్లలో స్థానికులు రోడ్డుపై వంటావార్పూ నిర్వహించారు. రంపచోడవరం అంబేద్కర్ సెంటర్‌లో జేఏసీ శిబిరం వద్ద సమైక్యాంధ్ర వాదులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఐటీడీఏ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవం జరుగుతున్న ప్రభుత్వ కళాశాల మైదానం వద్దకు వచ్చి గేటు బయట ధర్నా చేశారు. ఎమ్మెల్యే కాశీ విశ్వనాథ్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వచ్చి సమైక్యాంధ్ర నినాదాలు చేయడంతో విరమించారు.
 
 
 సమైక్య సమరంలో వైఎస్సార్ సీపీ
 
 కాకినాడ బ్యాంకుపేటలో దళితులు, సండే మార్కెట్ ఫుట్‌పాత్ వ్యాపారులు చేపట్టిన నిరసన ర్యాలీలతో పాటు, మాజీ కౌన్సిల ర్ మీసాల ప్రసాద్ చేపట్టిన బైక్ ర్యాలీలో వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద జాతీయ, సమైక్య పతాకావిష్కరణ కార్యక్రమంలో చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద కొనసాగుతున్న దీక్షలకు పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, పార్లమెంటు నియోజక వర్గ కో ఆర్డినేటర్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, నియోజక వర్గ కో ఆర్డినేటర్ మిడగుదిటి మోహన్ సంఘీభావం తెలిపారు. కొత్తపేటలో కొనసాగుతున్న రిలే దీక్షల  శిబిరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. అయినవిల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షల్లో పాయకరావు పేట ఎమ్మెల్యే అమలాపురం పార్లమెంటు నియోజక వర్గ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు, నియోజక వర్గ కో ఆర్డినేటర్లు మిండగుదిటి మోహన్, మందపాటి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురంలో పాస్టర్లు, కొత్తపల్లిలో వికలాంగులు చేపట్టిన దీక్షలకు పెండెం దొరబాబు  మద్దతు తెలిపారు.
 
 కొనసాగుతున్న నిరాహార దీక్షలు
 సమైక్యాంధ్ర పరిరక్షణ లక్ష్యంతో జిల్లాలో పలువురు చేపట్టిన నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. రాజమండ్రిగోకవరం బస్టాండ్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ యువ నేతలు పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, గుర్రం గౌతం, కోటగుమ్మం వద్ద సాల్మన్‌రాజు అనే యువకుడు  చేపట్టిన నిరవధిక దీక్షలు రెండవ రోజుకు చేరాయి, కాకినాడ భానుగుడి సెంటర్‌లో మంత్రి భార్య తోట నరసింహం సతీమణి వాణి చేపట్టిన నిరవధిక దీక్ష ఆరవ రోజుకు చేరింది. ఆమె దీక్షకు మద్దతుగా రాజానగరంలో కాంగ్రెస్ కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. పెదపూడి మండలం గొల్లల మామిడాడలో వాణి దీక్షకు మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ చేశారు. రామచంద్రపురంలో ఆర్యవైశ్య సంఘం నేత గ్రంధి వెంకటరాజు చేపట్టిన నిరవధిక దీక్ష రెండవ రోజుకు చేరింది. పెద్దాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత కాపగంటి కామేశ్వరరావు 48 గంటల దీక్ష ప్రారంభించారు. కాగా మండపేటలో నందికోల్ల రాజు చేపట్టిన నిరవధిక దీక్షను గురువారం మధ్యాహ్నం పోలీసులు భగ్నం చేశారు. 
 
 పాక్షికంగా తెరుచుకున్న దుకాణాలు
 శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాపార వర్గాలు గురువారం కాస్త పట్టు సడలించాయి. స్వాతంత్య్ర దినోత్సదవం సందర్భంగా సెలవు రోజైనప్పటికీ వాణిజ్య కేంద్రం రాజమండ్రి సహా జిల్లాలో పలు పట్టణాల్లో దుకాణాలు పాక్షికంగా తెరుచుకున్నాయి. దీంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సులు మాత్రం డిపోలకే పరిమితం కాగా ప్రయాణీకులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడ్డారు. 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement