అందరూ ఉత్తములేనా? | Sakshi
Sakshi News home page

అందరూ ఉత్తములేనా?

Published Fri, Aug 14 2015 2:08 AM

అందరూ ఉత్తములేనా? - Sakshi

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డుల ఎంపికకు చాంతాడంత జాబితా
వెయ్యి మందికి పైగా పేర్లు కష్టపడే వారికి దక్కని ‘ప్రశంసలు’

 
ఉత్తమ అధికారుల ఎంపిక ప్రక్రియ ఇప్పుడు జిల్లాలో అపహాస్యమైపోయింది. ఒకప్పుడు అనేక కోణాల్లో పరిశీలించి, పరీక్షించి ఉత్తమ అవార్డుకు అధికారుల్ని ఎంపిక చేసేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. ఉన్నతాధికారుల అడుగులకు మడుగులొత్తేవాళ్లే ఉత్తములుగా ఎంపికైపోతున్నారు. కార్యాలయాల్లో కష్టపడి సేవలందించే అధికారులకు మొండిచేయ్యే మిగులుతోంది. ఉద్యోగ విరమణ వయస్సు దగ్గరపడుతున్నా తమ సేవలకు గుర్తింపు లేదని పలువురు లోలోనే
 కుమిలిపోతున్నారు.
 
ఏం చెప్పేది బాబు..! కానిస్టేబుల్ స్థాయి నుంచి ఏఎస్సై వరకు వచ్చా. ఒక్క మెమో కూడా అందుకోలేదు. ఇక ఏడాదిన్నర పనిచేస్తే రిటైర్‌మెంట్ వస్తుంది. మా పేర్లంతా కలెక్టర్‌కు పంపరు. దొరల ఇళ్లకు కూరగాయలు తేవడం, వారి కుక్క పిల్లలకు స్నానాలు చేయించడం, ఆదివారం అయితే అంగడి వాడ్ని దబాయించి మరీ 2 కిలోల పొట్టేలు మాంసం ఫ్రీగా తెచ్చి ఇచ్చే వారి పేర్లను ప్రశంసాపత్రాలు అందుకోవడానికి పంపుతున్నారు. ఆ పనులు నేను చేయలేను. ఆ అవార్డులు నాకు రావు. ఈ బాధంతా మాపై అధికారులకు కూడా చెప్పుకోకూడదు. ఎందుకంటే మేము(పోలీసులు) క్రమశిక్షణకు మారు పేరు కదా..
 
చిత్తూరు (అర్బన్):  పోలీసుల నుంచి రెవెన్యూ, వైద్యశాఖ, మునిసిపాలిటీలు ఇలా దాదాపు 94 ప్రభుత్వ శాఖల్లో జిల్లాలో 34 వేల మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో  ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగుల్ని ఎంపికచేసి మంత్రి, కలెక్టర్, ఇతర అధికారుల చేతులు మీదుగా ప్రశంసా పత్రాలు ఇవ్వడం ఆనవాయితీ. దశాబ్దన్నర కాలం క్రితం వరకు అయితే కలెక్టర్ నుంచి ప్రశంసా పత్రం అందుకోవాలంటే సవాలక్ష కారణాలను పరిగణనలోకి తీసుకునేవారు. అనేక కోణాల్లో పరిశీలించి అవార్డులకు ఎంపిక చేసేవారు. కానీ కాలం మారిపోయింది. ఉద్యోగుల జాబితాను తయారు చేయడంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖాధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తూ వారికి నచ్చిన పేర్లనే ఉన్నతాధికారులకు పంపుతున్నారనే ఆరోపణలున్నాయి. దీనికి తోడు పోలీసు, రెవెన్యూ, స్థానిక సంస్థల్లో పెచ్చుమీరిన అవినీతి కారణంగా ఉత్తమ ఉద్యోగుల ఎంపిక నామమాత్రంగా కొనసాగుతోందని చాలామంది ఆవేదన చెందుతున్నారు. విధి నిర్వహణలో సస్పెన్షన్లకు గురైన వాళ్లు, అవినీతి ఆరోపణలు ఉన్న ఉద్యోగులు, చార్జ్ మెమోలు పెండింగ్ ఉన్న వాళ్లు, ఏసీబీ అధికారులకు చిక్కిన వాళ్లకు సైతం ఉత్తములంటూ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారనే విమర్శలున్నాయి వెల్లువెత్తుతున్నాయి.

కొందరు అధికారులైతే నిత్యం వారిని అంటిపెట్టుకుని చెప్పిన పనులు కిమ్మన కుండా చేసే వారిని, నెల పెడితే రూపాయి తగ్గకుండా మామూళ్లు ముట్టచెప్పే వారిని కలెక్టర్ చేతులు మీదుగా ప్రశంసా పత్రాలు అందుకోవడానికి ఎంపిక చేస్తున్నారని చాలామంది లోలోన మదనపడుతున్నారు. ఈసారి కూడా పలు ప్రభుత్వ శాఖల నుంచి జిల్లా రెవెన్యూ శాఖకు వెయ్యి మందికి పైగా పేర్లు అందాయి. ఇంత మందికి ప్రశంసా పత్రాలు ఇవ్వడం సాధ్యం కాదని, జాబితాను కుదించాలని పలు శాఖలకు జాబితాను తిప్పి పంపినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల ఎంపికలో నీతి, నిజాయితీ, పనితీరు, ఆరోపణలు లాంటి కనీస అంశాలను కూడా ప్రతిపాదనలోకి తీసుకోని అధికారులు దేన్ని కొలమానంగా పరిగణనలోకి తీసుకుని పేర్లను ఎంపిక చేస్తున్నారని వేలాదిమంది ఉద్యోగులు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.
 
నాకు 32 ఏళ్ల సర్వీసు. ఒక్క రిమార్కూ లేదు. కనీసం స్వాతంత్య్ర దినోత్సవం రోజునో.. గణతంత్ర దినోత్సవం సందర్భంగానో ఒక్క ప్రశంసాపత్రానికి  నా పేరు పంపిస్తారని చూస్తూనే ఉన్నా. ఎక్కడ..? గడచిన అయిదేళ్లుగా ఇక్కడ పనిచేసే కొందరి పేర్లే తిప్పితిప్పి పంపిస్తా ఉండారు. వాళ్లకే కలెక్టర్ల నుంచి అవార్డులు అందుతున్నాయి. మాలాంటి వాళ్లు పనులు చేసేదానికే కానీ.. మెప్పు పొందలేం..
 ...ఇదీ చిత్తూరు కార్పొరేషన్‌లోని
 ఓ ఉద్యోగి ఆవేదన
 

Advertisement
Advertisement