Sakshi News home page

రాజ్యసభ బరిలోకి ఇండిపెండెంట్లు?

Published Wed, Jan 22 2014 12:47 PM

independents may contest in rajya sabha polls

రాజ్యసభ బరిలోకి ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు రంగప్రవేశం చేయబోతున్నారా? సమైక్యవాదులు అంతా కలిసి అధిష్ఠానం చెప్పిన అభ్యర్థులను కాకుండా, స్వతంత్ర అభ్యర్థులనే గెలిపించబోతున్నారా? ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అసెంబ్లీ లాబీల్లో బుధవారం నాడు ఆసక్తికరమైన చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ శాసన సభ్యుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ రాజ్యసభ ఎన్నికల గురించి చర్చించుకున్నారు.

క్రితం సారిలా ఈ సారి కాంగ్రెస్‌కు నాలుగు రాజ్యసభ సీట్లు రావని, మహా అయితే రెండు సీట్లు మాత్రమే గెలవచ్చునని జేసీ అన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ హైకమాండ్ అభ్యర్థికి ఓటు వేసేందుకు సుముఖంగా లేరని కూడా ఆయన చెప్పారు. ఎంఐఎం తరఫున అభ్యర్థిని పోటీకి నిలపాలని అక్బర్‌కు జేసీ సూచించారు. అయితే, అందుకు అక్బర్ సమాధానమిస్తూ, మీరే నిలబడవచ్చు కదా అన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు బలపరుస్తామంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి రాజ్యసభకు పోటీ చేస్తానని జేసీ ఆయనతో చెప్పారు. ఈ దఫా సమైక్యవాదులెవరైనా స్వతంత్రులుగా పోటీచేస్తే రాజ్యసభ అభ్యర్థిగా గెలవడానికి అవకాశముందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తమ తరఫున ఇండిపెండెంట్లను బరిలోకి దింపే ప్రయత్నాలు సాగుతున్నాయని జేసీ వెల్లడించారు.

Advertisement
Advertisement