కేంద్ర బలగాల స్థావరంగా భూపాలపల్లి ? | Sakshi
Sakshi News home page

కేంద్ర బలగాల స్థావరంగా భూపాలపల్లి ?

Published Thu, Jan 2 2014 4:49 AM

కేంద్ర బలగాల స్థావరంగా భూపాలపల్లి ? - Sakshi

=పట్టణంపై చక్కర్లు కొట్టి, ల్యాండ్ అయిన హెలికాప్టర్
 =ఇక్కడి నుంచే  కూంబింగ్ ఆపరేషన్‌‌స నిర్వహించే యోచన
 =త్వరలో హెలిపాడ్ నిర్మాణం.. ?
 =మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చర్యలు ముమ్మరం

 
భూపాలపల్లి, న్యూస్‌లైన్ : భూపాలపల్లి కేంద్రంగా ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహించేందుకు కేంద్ర బలగాలు సన్నద్ధమవుతున్నాయి. దే శంలోని మావోయిస్టు ఉద్యమ ప్రాంతాలపై ముప్పేట దాడికి సుమారు 40 వేల కేంద్ర బలగాలు బయల్దేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూపాలపల్లిలో బుధవారం హెలికాప్టర్ ట్రయల్ ల్యాండింగ్ ఒక్కసారిగా కలకలం రేపింది. ప్రముఖుల రాకపోకలు లేకున్నా ఓ హెలికాప్టర్ బుధవారం పట్టణంతోపాటు పరిసర అటవీ ప్రాంతంలో చక్కర్లు కొట్టడంతో ఏం జరిగిందోనని పట్టణవాసులు, అటవీ గ్రామాల ప్రజలు ఆందోళన చెందారు.

చివరకు ట్రయల్ ల్యాండింగ్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఛత్తీస్‌గఢ్ లోని దంతెవాడ నుంచి సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఒక హెలికాప్టర్ భూపాలపల్లి పట్టణానికి మధ్యాహ్నం సుమారు 2.30 గంటలకు చేరుకుంది. 5 నిమిషాల పాటు పట్టణంపై చక్కర్లు కొట్టిన అనంతరం సీఆర్‌నగర్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో దిగింది. పైలట్ సంఘటన స్థలం లో ఉన్న భూపాలపల్లి సీఐ ఆదినారాయణ వద్దకు చేరుకుని రెండు నిమిషాలు చర్చించారు. అనంతరం హెలికాప్టర్ తిరిగి దంతెవాడకు వెళ్లిపోయింది.

ఇదిలా ఉండగా హెలికాప్టర్ ల్యాడింగ్ కానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు భూపాలపల్లి పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ల్యాండ్ అయ్యే స్థలాన్ని చదును చేయించారు. కాగా ఆ స్థలంలో మట్టి, ఇసుక భారీగా ఉండడంతో గమనించిన పైలట్ కొంతదూరాన ల్యాండింగ్ చేశాడు. అంతేగాక సింగరేణికి చెందిన రెస్క్యూ టీం, కేటీపీపీకి చెందిన ఫైరింజన్‌ను ముందస్తుగా సంఘటన స్థలంలో ఏర్పాటు చేశారు. బాంబ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు.
 
అయితే హెలికాప్టర్ ట్రయల్ ల్యాండిం గ్‌పై స్థానికులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో భారీ కూంబింగ్ ప్రారంభమైన నేపథ్యంలో వివిధ అవసరాలరీత్యా భూపాలపల్లిని స్థావరంగా వినియోగించుకునేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి హెలికాప్టర్‌లో వచ్చి భూపాలపల్లితోపాటు పరిసర అడవులను పరిశీలించినట్లు చర్చ జరుగుతోంది.

ఛత్తీస్‌గఢ్‌కు సమీపంలోని కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్నందున భూపాలపల్లిలో హెలిపాడ్‌ను నిర్మించే అవకాశాలు ఉన్నాయనే చర్చ స్థానికంగా సాగుతోంది. ఈ విషయమై సీఐ ఆదినారాయణను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా హెలికాప్టర్ ట్రయల్ ల్యాండింగ్ చేసిందని, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదన్నారు.
 

Advertisement
Advertisement