‘అనంత’ బీభత్సం | Sakshi
Sakshi News home page

‘అనంత’ బీభత్సం

Published Tue, Mar 4 2014 1:43 AM

Infinite' devastation

అనంతపురం :
 కనీవినీ ఎరుగని రీతిలో ప్రకృతి ప్రకోపించింది. గాలి, వాన బీభత్సం సృష్టించింది. రైతులకు కన్నీరు మిగిల్చింది. కన్నకొడుకులాగా పెంచుకున్న తోటలు క్షణాలలో తుడిచిపెట్టుకుపోవడంతో అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. లక్షలు పెట్టుబడి పెట్టిన తోటలు చూస్తుండగానే నాశనం కావడంతో లబోదిబోమన్నారు.

వివరాల్లోకి వెళితే.. సోమవారం సాయంత్రం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలివాన అల్లకల్లోలం సృష్టించింది. అలా ఇలా కాదు.. ఇదివరకెన్నడూ లేని విధంగా వడగండ్ల వర్షం.. పెనుగాలులతో అతలాకుతలం చేసింది. నగరంలో సాయంత్రం 5 గంటల నుంచి అరగంటపాటు అసలు ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. చిరు వ్యాపారాలు చేసుకునే తోపుడు బండ్ల పైకప్పులు, హోర్డింగులు గాల్లో ఎగిరిపోయాయి. పెలపెలమంటూ పడ్డ వడగండ్ల దెబ్బకు చాలామంది స్వల్పంగా గాయపడ్డారు.

కొందరైతే భయంతో వణికిపోయారు. విద్యుత్ స్తంభాలు నేలవాలిపోయి.. కరెంటు తీగలు తెగిపడ్డాయి. భారీ వృక్షాలు సైతం కూకటివేళ్లతో కుప్పకూలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో నగరంతో పాటు అనంతపురం రూరల్, కూడేరు, బెళుగుప్ప, బుక్కరాయసముద్రం తదితర మండలాల్లో అంధకారం నెలకొంది. ట్రాన్‌‌సకోకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. మరమ్మతులు చేపట్టేందుకు కనీసం రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉందని ట్రాన్‌‌సకో ఎస్‌ఈ ప్రసాద్‌రెడ్డి, నగర ఏడీఈ లక్ష్మినారాయణరెడ్డి తెలిపారు.

నగర పాలక సంస్థ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి సాయంత్రం తన చాంబర్‌లో కార్పొరేషన్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన చే పట్టాల్సిన చర్యలపై చర్చించారు. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌లో నార్పల బస్ పాయింట్ వద్ద షెడ్డు కూలడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. ప్రమాదవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ ఆపేశారు.
 

బెళుగుప్ప మండలంలో పెనుగాలులు, వడగళ్ల వర్షం కారణంగా భారీ నష్టం సంభవించింది. బెళుగుప్ప, దుద్దేకుంటలో 20 ఎకరాల్లో అరటి పంట నేలకొరిగింది.  వెంకటాద్రిపల్లి, శీర్పి, కోనాపురం, శ్రీరంగాపురం, నక్కలపల్లి గ్రావూల్లో ఉల్లి, మిరప పంటలు 50 ఎకరాల్లో దెబ్బతిన్నారుు.
 

నార్పల మండలంలో పెను గాలులకు 500 ఎకరాల్లో అరటితోటలు నేలకూలాయి. వైఎస్సార్‌సీపీ కాలనీలో ఎర్నాగప్ప కట్టెల డిపోలో రేకుల షెడ్ కూలింది. పాత రామస్వామి వీధిలో రేకుల షెడ్లు గాలిలో ఎగిరి కిందపడ్డాయి.
 

కూడేరులో వడగండ్ల వర్షానికి శంకర్ నాయక్, నందకుమార్‌లకు చెందిన నర్సరీలు దెబ్బతిన్నాయి. పురాతన వేపచెట్లు విరిగిపడటంతో సుంకులమ్మ దేవాలయం దెబ్బతింది. కూడేరు, రామచంద్రాపురం, అరవకూరు, పి.నారాయణపురంతో పాటు మరికొన్ని గ్రామాల్లో అరటి, మిరప, దోస, కళింగరతో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. కూడేరులో కుమ్మర రమేష్‌కు చెందిన సిమెంట్ రేకుల షెడ్ కూలింది. షెడ్‌లోని 150 వినాయక విగ్రహాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.
 

అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఏ.నారాయణపురం, నరసనాయునికుంట, నాగిరెడ్డిపల్లి, కొడిమి, సోములదొడ్డి తదితర ప్రాంతాలలో సోమవారం సాయంత్రం అకాల వడగండ్ల వర్షం కురిసింది. దీంతో వందల ఎకరాల్లో పండతోటలు నేలమట్టమయ్యాయి. దాదాపు రూ.15 కోట్ల నష్టం వాటిల్లింది.   
 

బుక్కరాయసముద్రం మండలం నీలారెడ్డిపల్లి, వడియంపేట, పొడరాళ్ల, బీకేఎస్ తదితర గ్రామాల్లో అరటి పంట పూర్తిగా దెబ్బతింది. దాదాపు రూ. కోటి మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు చెబుతున్నారు.

 పెనుగాలుల బీభత్సానికి అనంతపురంలోని తాజ్‌మహల్ ఎగ్జిబిషన్ చెల్లాచెదురైంది. భారీ సెట్టింగులు ఎగిరిపోయాయి. ఎగ్జిబిషన్ ప్రదేశంలో వడగళ్లు అక్కడక్కడా పడి ఉండటం కనిపించింది. జన సమ్మర్ధనం లేకమునుపే బీభత్సం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. కాకపోతే ఎగ్జిబిషన్‌లో కోటి రూపాయల మేర నష్టం వాటిల్లిందని నిర్వాహకులు తెలిపారు.

Advertisement
Advertisement