బీమా పేరిట టోకరా.. | Sakshi
Sakshi News home page

బీమా పేరిట టోకరా..

Published Sun, Oct 13 2013 11:48 PM

insurance company blames customer

 తాండూరు టౌన్, న్యూస్‌లైన్:
 ప్రముఖ బీమా కంపెనీ పేరుతో ఓ బోగస్ సంస్థ కార్యాలయం తెరిచింది. జనాన్ని నమ్మించి డబ్బులు వసూలు చేసింది. బాండ్లు ఇవ్వమంటే నీళ్లు నములుతుండడంతో పాలసీదారులు నిలదీశారు. దీంతో బోగస్ సంస్థ గుట్టురట్టు అయింది. రెక్కల కష్టం దోచుకుపోయారని బాధితులు లబోదిబోమంటున్నారు. తాండూరు పట్టణ డీఎస్పీ షేక్ ఇస్మాయిల్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మల్లప్పమడిగ వద్ద ఓ భవనంలో ఓ ప్రముఖ కార్పొరెట్ కంపెనీ పేరుతో ఈ ఏడాది మార్చి నెలలో కార్యాలయం తెరిచారు. కంపెనీ ప్రధాన బ్రాంచ్‌లు కాకినాడ, సామర్లకోటలో ఉన్నట్లు జనాన్ని నమ్మబలికారు.
 
  కార్యాలయంలో సుమారు 10 మంది వరకు పని చేస్తున్నారు. పథకం ప్రకారం ముందుగా తాండూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన మధ్య తరగతి, ఆపై స్థాయి వారికి ఫోన్‌లు చేశారు. 1000 మంది లక్కీ డ్రాలో మీ ఫోన్ నంబర్ ఎంపికైందని, మా కంపెనీ యాజమాన్యం మీకు ఉచితంగా రూ.లక్ష విలువ గల బీమా బాండ్‌ను ఇస్తుందని నమ్మబలుకుతారు. కార్యాలయానికి సతీసమేతంగా వచ్చి బాండ్ తీసుకువెళ్లాలని వైజాగ్, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి ఫోన్లు చేస్తున్నారు. కార్యాలయానికి వచ్చిన జనానికి ఓ గంటపాటు బీమా పాలసీల గురించి వివరించి వారు ఏదో ఓ పాలసీలో చేరేలా చేస్తున్నారు. పాలసీని బట్టి ఒక్కొక్కరి దగ్గర రూ.10 వేల నుంచి రూ.70 వేల వరకు వసూలు చేశారు. డబ్బులు తీసుకున్నట్లు ఓ రశీదు కూడా ఇచ్చి వారం రోజుల తర్వాత వచ్చి రూ.లక్ష ఉచిత పాలసీ బాండ్‌తో పాటు, డబ్బులు చెల్లించిన బీమా పాలసీ బాండ్‌ను తీసుకెళ్లాలని చెప్పసాగారు. ఇలా పలువురి వద్ద నుంచి దాదాపు రూ. 15 లక్షలు వసూలు చేశారు.
 
  పాలసీదారులకు బాండ్‌లు ఇవ్వడంలో ఆలస్యం కావడంతో పలువురు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పటణంలోని దోబీ గల్లీకి చెందిన ఇడ్లీ బండి నడుపుకొనే శ్రీనివాస్ తన పేరుమీద, భార్య పేరు మీద రెండు పాలసీలు చేసి రూ.70 వేలు చెల్లించాడు. డబ్బులు ఇచ్చి రోజులు గడుస్తున్నా బాండ్లు ఇవ్వకపోవడంతో శనివారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు కార్యాలయం మీద దాడిచేసి కంపెనీకి చెందిన నలుగురు ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. పలు ముఖ్య పత్రాలను స్వాధీనం చేసుకుని కార్యాలయాన్ని సీజ్ చేసినట్లు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్ చెప్పారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఈ బోగస్ కంపెనీ మూలాలను వెతికి పట్టుకుని త్వరలోనే సంబంధీకులను అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. కాగా బాధితులు లబోదిబోమంటున్నారు. పాలసీదారులకు న్యాయం చేయాలని స్థానికులు పోలీసులను కోరారు.  
 
 
 
 

Advertisement
Advertisement